Minister prattipati pulla Rao
-
నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటి?
గుంటూరు రూరల్: దళిత ఎమ్మెల్యేనైన తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్? అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై టీడీపీకి చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు ధ్వజమెత్తారు. దళితుల భూములు అన్యాక్రాంతం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో ఔటర్ రింగ్, కమ్యూనిటీ గృహాల సముదాయాలకు భూ సేకరణ నిమిత్తం ప్రభుత్వం ఎంపిక చేసిన రైతుల భూములను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన మనుషులు కొందరు వచ్చి.. ప్రభుత్వం ఈ భూములకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వదని తమకు ఎంతో కొంతకు విక్రయిస్తే కనీసం అదైనా దక్కుతుందంటున్నారని రైతులు వాపోయారు. తాము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మార్కింగ్ రాళ్లు వేశారని కన్నీరుపెట్టుకున్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు పట్టాలు ఇవ్వడం వల్లే ఈ భూములను తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రావెల కిశోర్‌బాబు స్పందిస్తూ.. దళిత ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఇటువంటి దురాక్రమణలకు పాల్పడడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 200 మంది రైతుల నుంచి 160 ఎకరాలు సేకరిస్తుంటే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, మాదిగలపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అధికార మదంతో అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మంత్రికి తెలిసే అక్రమ మైనింగ్!
గుంటూరు రూరల్: తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తెలుసనీ, ఏడాది కాలంగా ఎన్నోసార్లు చెప్పినా ఆపలేక పోయారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తెచ్చినా అడ్డుకోలేదని తెలిపారు. గత ఏడాదిన్నర నుంచి రూ.100 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగిందని ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం పొత్తూరు శివారు ఓబులునాయుడుపాలెం వద్ద నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ క్వారీలను ఎమ్మెల్యే రావెల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ మైనింగ్‌కు వినియోగిస్తున్న రెండు ప్రొక్లెయిన్లు, రెండు లారీలను పోలీసులకు అప్పగించారు. అనంతరం రావెల మీడియాతో మాట్లాడుతూ ఓబులునాయుడుపాలెం, పొత్తూరు, నాయుడుపేట, పేరేచర్ల, కైలాసగిరి తదితర ప్రాంతాల్లో నారాయణస్వామి, అశోక్ అనే వ్యక్తులు అజయ్ అనే వ్యక్తి ద్వారా ప్రభుత్వ, అటవీ భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. -
సీఎం సీరియస్‌లో మర్మమిదే!
► మంత్రి ప్రత్తిపాటిపై రహస్య నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు ► నకిలీ విత్తనాలు, పురుగు మందులను అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ► సొంత నియోజకవర్గంలో ఆయన సతీమణి చక్రం తిప్పుతుందనే ఆరోపణలు సాక్షి, అమరావతి: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురించి పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న తర్వాతే సీఎం చంద్రబాబు తన అసంతృప్తిని వీడియోకాన్ఫరెన్స్లోవెల్లడించినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఉద్యోగుల బదిలీల సమన్వయం సాకుతో మూడు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నాయి. నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలకు జిల్లా అడ్డగా మారినా అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నట్లు చెబుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను కాదని పుల్లారావు భార్యే చక్రం తిప్పుతుందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతు న్నాయి. ఏ పని చేయాలన్నా ఆమె అనుమతి తప్పనిసరని కార్యకర్తలు వాపోతున్నారు. మంత్రి పేరు చెప్పి కొందరు అనుచరులు అడ్డంగా దోచుకొంటున్నారని సొంత పార్టీ వారే ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలతోనూ సఖ్యత నిల్..: జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలతోనూ మంత్రి పుల్లారావుకి సఖ్యత కొరవడినట్లు సమాచారం. పలుచోట్ల ఆయనే ఎమ్మెల్యేల ప్రమేయం లేకుం డా కలుగజేసు కోవడం వల్లే సమస్యలు తలెత్తినట్లు చర్చ సాగుతోంది. గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మోదుగుల నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఎక్కువైనట్లు తెలిసింది. మార్కెట్ యార్డు చెర్మైన్ పదవి విషయంలో మోదుగుల మాటను మంత్రి పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యహరించడంతోనే మార్కెట్ యార్డు చైర్మన్ భర్తీ ఆగిపోయినట్లు సమాచారం. సీసీఐ కుంభకోణంలో ఆరోపణలు.... గత ఏడాది సీసీఐ కొనుగోళ్లలో రూ. 450 కోట్ల కుంభకోణం బహిర్గతమైంది. మార్కెటింగ్ ఉద్యోగులు 15 మంది పైనా సీబీఐ కోర్టు విశాఖపట్నంలో కేసులు దాఖలయ్యాయి. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిఫార్సు చేసినా మంత్రి ప్రత్తిపాటి పట్టించుకోలేదు. ఫైలును తొక్కిపెట్టినట్లు అ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. సీసీఐ కుంభకోణంలో అప్పట్లో మంత్రి పాత్రపై పలు ఆరోపణలు వినిపించాయి. వ్యవసాయ శాఖలో ఏవోలు, ఏడీలు, ఎంపీఈఓల తదితర ఉద్యోగుల ప్రమోషన్లు ఏడాదిగా ఆగిపోయినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బదిలీలకూ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై నిఘా వర్గాల నుంచి సీఎంకు సమాచారం అందడం వల్లే పుల్లారావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. -
నీటి కుంటలతో కరువులోనూ సాగు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నాదెండ్ల: నీటి కుంటలతో కరువులోనూ పంటలు సాగు చేసుకునేందుకు వీలుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మండల కేంద్రంలో గురువారం కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నీటి కుంటల పనులు ప్రారంభించారు. అనంతరం నీరు - చెట్టు క్రింద నాదెండ్ల గ్రామ పరిధిలోని కొండాయగుంట చెరువులో మట్టి తవ్వకం చేపట్టారు. పుల్లారావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వంద నీటి కుంటల ఏర్పాటు లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5 లక్షల నీటి కుంటల ఏర్పాటును లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 670 చెరువులను గుర్తించి రూ.28 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. గణపవరం, సాతులూరు గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టర్ కాంతిలాల్‌దండే, మార్కెట్‌యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, చిలకలూరిపేట నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ పులి శ్రీనివాసరావు, ఏపీడీ నరేంద్రబాబు, నరసరావుపేట ఆర్డీవో శ్రీనివాసరావు, సర్పంచ్ గోరంట్ల సుబ్బారావు, ఎంపీపీ సాయిలక్ష్మీ జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అమాత్యా.. ఇదేమి చోద్యం..!
► ఓ వైపు గుంటూరు అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ పెద్దలు ► మరో వైపు పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కమిషనర్ నాగలక్ష్మికి మంత్రి ప్రత్తిపాటి క్లాసు ► విస్తుపోతున్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ► బృందావన్‌గార్డెన్స్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు ► ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో తమ్ముళ్ల వీరంగం ► కార్పొరేషన్లో ఖాళీలను పట్టించుకోని వైనం ► కృష్ణా పుష్కరాలకు పైసా విడుదల చేయని ప్రభుత్వం ► ఇష్టారాజ్యంగా జన్మభూమి కమిటీలు సాక్షి, గుంటూరు : రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు ‘ చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న’ నానుడిని జ్ఞప్తికి తెస్తున్నాయి...గుంటూరు నగరాభివృద్ధిని తెలుగు తమ్ముళ్లు, టీడీపీ ప్రజాప్రతినిధులు అడుగడుగునా అడ్డుకుంటుండగా, ఆయన మాత్రం నగర కమిషనర్, ఐఏఎస్ అధికారి నాగలక్ష్మికి క్లాసు తీసుకోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. నగరంలో రోడ్లు విస్తరణ చేపట్టి అప్పటి కమిషనర్ కృష్ణబాబు ఎంతో పేరు తెచ్చుకున్నారని మీరు సైతం రోడ్లు విస్తరణ పూర్తిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, అలాగే తమవాళ్లు ఎవరైనా అడ్డుకుంటే తనకు చెప్పాలంటూ మూడు రోజుల కిందట నగర కమిషనర్ నాగలక్ష్మికి మంత్రి క్లాస్ తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగుల నుంచి వినవస్తున్నాయి. నగరంలోని బృందావన్గార్డెన్స్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగులుగా విస్తరించాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది అధికార పార్టీ పెద్దలకు సంబంధించిన గృహాలు, స్థలాలు రోడ్డు విస్తరణలో పోతాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు, తమ్ముళ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా 60 అడుగులు మాత్రమే విస్తరణ చేపట్టాలని కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. అదేవిధంగా జేకేసీ కళాశాల రోడ్డు నుంచి తక్కెళ్ళపాడు రోడ్డు విస్తరణలో పార్టీకి చెందిన ప్రముఖ బిల్డరుకు సంబంధించిన స్థలం కోల్పోతున్నారు. దీంతో కేవలం ఒకవైపు మాత్రమే రోడ్డు విస్తరణ చేపట్టాలని ఒత్తిడి తీసుకువస్తూ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తున్నారు. జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం ... అదే సమయంలో నగరాభివృద్ధికి అవసరమైన నిధులను ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రజల పన్నులతోనే నగరంలో కమిషనర్ అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తుంది. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రూ. 540 కోట్లుకు సంబంధించి భూగర్భ డ్రైనేజీ పనులు సైతం ఆలస్యం అవుతున్నాయి. అలాగే నగరాభివృద్ధికి సంబంధించి అటు ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. అదేసమయంలో సంక్షేమ పథకాల అమల్లో జన్మభూమి కమిటీల అవినీతికి అంతులేకుండా పోతుంది. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో తమ్ముళ్లు చేతివాటం చూపిస్తున్నారు. కమిషనర్‌కు తమ్ముళ్ల హెచ్చరికలు.. ఇదిలా ఉంటే నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల అంశం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటిని పాటిస్తున్న కమిషనర్‌పై టీడీపీ పెద్దలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా నగరం మొత్తం ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. అయితే తమ్ముళ్లు మాత్రం ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకొనేది లేదని కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవసరమైతే తెనాలి పట్టణానికి వెళుతున్న నీటిని గుంటూరుకు మళ్లించకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో ఆమె ఆశ్చర్యపోయారు. నగరపాలక సంస్థలో సిబ్బంది కొరత.. ఇక నగర పాలకసంస్థలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది లేరు. అదనపు కమిషనర్ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంది. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాల్లో సైతం పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రభుత్వం భర్తీ చేయకపోయినా మంత్రి పుల్లారావు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అధికారులు లేకపోవడంతో ప్రతి చిన్న పనిని కమిషనర్ స్వయంగా చూడాల్సి రావడంతో అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్ నిధులతోనే పనులు... కృష్ణా పుష్కరాలకు సంబంధించి నగరంలో రోడ్లవిస్తరణ, నగర సుందరీకరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా మంజూరు చేయలేదు. కార్పొరేషన్ నిధులతోనే పనులు చేపట్టేందుకు కమిషనర్ ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. ఇందులో సైతం తమ్ముళ్లు టెండర్లు దక్కించుకొని నాసిరకంగా పనులు చేస్తూ ఇంజినీరింగ్ అధికారులపై పెత్తనం చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా పట్టించుకోని మంత్రి, ప్రజాప్రతినిధులు నగర ప్రజలపై ప్రేమ ఉన్నట్లు, నగరాభివృద్ధికి అధికారులు కృషిచేయడం లేదన్న విధంగా మాట్లాడడంపై కార్పొరేషన్ సిబ్బంది, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.