
గుంటూరు రూరల్: దళిత ఎమ్మెల్యేనైన తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్? అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై టీడీపీకి చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు ధ్వజమెత్తారు. దళితుల భూములు అన్యాక్రాంతం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో ఔటర్ రింగ్, కమ్యూనిటీ గృహాల సముదాయాలకు భూ సేకరణ నిమిత్తం ప్రభుత్వం ఎంపిక చేసిన రైతుల భూములను శనివారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులు ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన మనుషులు కొందరు వచ్చి.. ప్రభుత్వం ఈ భూములకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వదని తమకు ఎంతో కొంతకు విక్రయిస్తే కనీసం అదైనా దక్కుతుందంటున్నారని రైతులు వాపోయారు. తాము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మార్కింగ్ రాళ్లు వేశారని కన్నీరుపెట్టుకున్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు పట్టాలు ఇవ్వడం వల్లే ఈ భూములను తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రావెల కిశోర్‌బాబు స్పందిస్తూ.. దళిత ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఇటువంటి దురాక్రమణలకు పాల్పడడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 200 మంది రైతుల నుంచి 160 ఎకరాలు సేకరిస్తుంటే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, మాదిగలపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అధికార మదంతో అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.