సాక్షి, అమరావతి: ఆరు నెలల నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తాజాగా చంద్రబాబును ధిక్కరిస్తూ మాట్లాడటం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. చంద్రబాబు తీరును ఎండగట్ట డం, అవసరమైతే టీడీపీని వదిలేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తన వందిమాగధులతో అప్పుడే ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆరు నెలల క్రితం మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కిషోర్‌బాబు అప్పటి నుంచి తీవ్ర అసం తృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు దగ్గరవడం, ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ తన రూటు సెపరేటని తేల్చి చెప్పారు.
కృష్ణమాదిగ చేపట్టిన కురుక్షేత్ర సభకు మద్దతివ్వడంతోపాటు నేరుగా ఫ్లెక్సీల్లో కృష్ణమాదిగ ఫొటో పక్కన తన ఫొటోలను వేసినా అభ్యంతరం చెప్పలేదు. తాజాగా గురువారం తన నియోజకవర్గం ప్రత్తిపాడులో గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభకు మందకృష్ణ హాజరవ గా అందులో పాల్గొన్న కిషోర్‌బాబు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని దీనికోసం తాను రాజీనామా చేస్తానని ప్రకటించి పార్టీ అధినేతపైనే గురిపెట్టారు. మందకృష్ణను అడ్డు కుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఉలిక్కిపడిన టీడీపీ ముఖ్య నేతలు రావెలపై ఎదురుదాడి చేయించారు. రావెలతో ఎవరో మాట్లాడిస్తున్నారని, కావాలంటే రా జీనామా చేసుకోవచ్చని ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రి జవహర్, హౌసింగ్ కార్పొరేష న్ చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు.
నా వ్యాఖ్యలు వక్రీకరించారు: రావెల
గుంటూరు రూరల్ : తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి జవహర్, వర్ల రామయ్యలు పూర్తిగా వక్రీకరించారని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అన్నారు. వీరు చేసిన వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కించపరిచేటట్లు ఉన్నాయన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి జవహర్, వర్ల మాటలను ఖండిం చారు. కురుక్షేత్ర మహాసభను ప్రభుత్వం అడ్డుకుందన్న విషయం మాదిగల్లో బాగా నాటుకుపోయిందని.. తమను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాదిగలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. వర్గీకరణ జీవో–25ను ప్రభుత్వం అమలుచేయడంలేదని మాదిగలు ఆవేదన చెందుతున్నారని.. అలాగే, ఇటీవల సంక్షేమ శాఖలో కీలకమైన పదవులన్నీ మాలలకే ఇచ్చారని మాదిగలు భావిస్తున్నారన్నారు. ప్రత్తిపాడులో గురువారం జరిగిన గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో తానుగానీ, మందకృష్ణ మాదిగగానీ ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని రావెల స్పష్టంచేశారు. పార్టీని వీడతానని ప్రజల్లో అపోహలు కలిగేలా అధికార పార్టీ నేతలే తన గురించి వ్యాఖ్యానించడం విచారకరమన్నారు.