టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు
సాక్షి, గుంటూరు : టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలోని దళిత ప్రజాప్రతినిధులకు పదవులు తప్ప అధికారం లేదని అన్నారు. ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ‘పదవులు మావి.. పెత్తనం మాత్రం వాళ్లదా?’ అని నిలదీశారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని వాపోయారు.
రావెల కిశోర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘తెలుగుదేశం పార్టీలో నా ఒక్క నియోజకవర్గంలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకుల నేతల పెత్తనమే ఎక్కువగా ఉంది. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు మాత్రమే ఉన్నాయి. అధికారం చెలాయించేది మాత్రం బయటి వ్యక్తులే. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని నామమాత్రపు ఎమ్మెల్యేగా చూస్తున్నారు. పెత్తనం మొత్తం అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్థన్‌రెడ్డి సాగిస్తున్నారు.
కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి పదవిలో జవహర్ ఉన్నప్పటికీ పెత్తనం మొత్తం సుబ్బరాజు చౌదరి చేస్తుంటాడు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అధికారం మొత్తం అక్కడి చైర్మన్ బాపిరాజు చేతుల్లో ఉంటోంది. మంత్రి నక్కా ఆనందబాబు పదవిలో ఉండగా, వేమూరు నియోజకవర్గంలో అధికారమంతా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా చేతుల్లోనే ఉంది. ప్రకాశం జిల్లా కొండెపిలో ఎమ్మెల్యే పదవి స్వామిది, అధికారం చెలాయించేది మాత్రం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన్.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. దాదాపు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కేవలం నామమాత్రపు నాయకత్వాన్ని ఇచ్చి అధికారం పక్కవాళ్లు చెలాయిస్తే దళితుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు చదువుకున్నవారు, విజ్ఞానవంతులు అంబేడ్కర్‌వాదులు రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు అగ్రకుల ఆధిపత్యాన్ని సహించే పరిస్థితుల్లో లేరు. వీరికి పదవులతోపాటు అధికారం కూడా ఇవ్వాలి. అప్పుడే ఈ పార్టీలో నాకు గుర్తింపు ఉంది, గౌరవం ఉంది, అధికారం ఉంది అనే ఆత్మవిశ్వాసంతో వారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు.
నా పేరు ప్రతిష్టలు దిగజార్చారు
నా నియోజకవర్గం పరిధిలోని ఓబులునాయుడుపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తే ఆయన చెప్పా. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకుండాపోయింది. నాకు వాటా పంపుతున్నామని ప్రచారం చేసి నా పేరుప్రతిష్టలను దిగజార్చడంతో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు విలేకరులను తీసుకుని అక్కడికి వెళ్లా. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరగడం చూసి ఆశ్చర్యపోయా. నారాయణస్వామి, అశోక్ అనేవాళ్లు ఇష్టం వచ్చినట్లు అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు తేలింది..’’ అని రావెల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment