డీఎంహెచ్‌ఎస్‌లో విభజన సెగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ.. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు, ఏపీఎన్జీవోలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఇరు ప్రాంతాల ఉద్యోగుల పోటా పోటీ నినాదాలు, కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బుధవారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌లో ఏపీఎన్జీవోలు తలపెట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ధర్నాకు ఇతర శాఖల ఏపీఎన్జీవోలు తరలిరావడంపై టీఎన్జీవోలు అభ్యంతరం తెలిపారు. దీంతో సీమాంధ్ర ఉద్యోగులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేయగా.. తెలంగాణ ఉద్యోగులు ‘జై తెలంగాణ’ నినాదాలు ప్రారంభించారు. డీఎంహెచ్‌ఎస్‌లో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులు తప్ప ఇతరులు అక్కడ నిరసన వ్యక్తం చేయవద్దంటూ టీఎన్జీవోలు గేట్లు మూసి వేశారు.
దాంతో ఆగ్రహించిన ఇతర శాఖల ఏపీఎన్జీవోలు ఉమెన్స్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీఎన్జీవోలను పోలీసులతో అరెస్టు చేయించారని, తెలంగాణ వస్తే సీమాంధ్రులకు హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోతుందని ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. మరోవైపు... అమరుల బలిదానాలతో వ స్తున్న తెలంగాణను అడ్డుకుంటే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేత జూపల్లి రాజేందర్, టీఎన్జీవో నాయకులు హెచ్చరించారు. ఏపీఎన్జీవోలు తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
విద్యుత్‌సౌధలో నిరసన: విద్యుత్ సౌధలో బుధవారం సీమాంధ్ర ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సోనియాగాంధీ తన కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలైనా చేసేందుకు సిద్ధమంటూ ఒక వ్యంగ్య నాటికను ప్రదర్శించారు. అంతకుముందు హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీని ఏర్పాటుచేసుకొని దానికి చైర్మన్‌గా నర్సింహులు అనే ఉద్యోగిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి ఉద్యోగులను వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ లేదన్నారు. ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీఎన్జీవోలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని.. జరగబోయే సమ్మెకు తమ పూర్తి సంఘీభావం ఉంటుందని తెలిపారు.