రాష్ట్రాన్ని విభజిస్తే ఆర్టీసీ మూతే
Published Mon, Sep 2 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
పొదిలి, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజిస్తే ఆర్టీసీ సంస్థను మూసేయాల్సి వస్తుందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక డిపో ఆవరణలో నిర్వహించిన ఉద్యోగ జేఏసీ సమావేశంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఐకమత్యంగా సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెలో పాల్గొని సమ్మెకు బలం చేకూర్చాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో ఉందని, దానికి కారణం వారికి ఆర్టీసీ తప్ప వేరే రవాణా మార్గాలు లేవన్నారు. ఆంధ్రా, రాయలసీమల్లో ఒక్క కర్నూలు తప్ప మిగతా 12 జిల్లాలు రాజధానికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ జిల్లాల్లో 4 వేల ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రం విడిపోతే రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. రాయలసీమ ఎడారిగా మారి వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన రహంతుల్లా, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ కోసం తమకు ఆర్థిక నష్టం జరిగినా సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు నారు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులంతా ఐకమత్యంగా సమ్మెలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా బలం చేకూర్చాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మయ్య, మాల్యాద్రిరెడ్డి, గౌష్, జగన్‌మోహన్‌రెడ్డి, హజరత్, నాగూర్, బసవారెడ్డి,నాగేశ్వరరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement