దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలి
Published Mon, Jan 6 2014 1:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ప్రతి భారతీయుడు చిత్తశుద్ధితో కృషి చేయాలని, ముఖ్యంగా కీలకమైన బాధ్యతలను స్వీకరించేందుకు యువత ముందుకు రావాలని కేంద్ర పథకాల క్షేత్ర ప్రచార అధికారి డాక్టర్ జి.కొండలరావు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యువజన సరీసుశాఖ (సెట్‌శ్రీ), నెహ్రూ యువకేంద్రం సౌజన్యంతో యంగ్‌ఇండియా సారధ్యంలో ఆదివారం ఎన్‌వైకేలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత స్వామి వివేకానంద చిత్ర పటానికి జ్యోతి ప్రజల్వన చేశారు. అనంతరం యువతీయువకులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ సంస్కృతి, జాతి ఔన్నత్యం, మాతృభాషాభియానం,త్యాగం,
సేవ వంటి గుణాలు వ్యక్తిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతాయన్నారు. యువజన వారోత్సవాల కన్వీనర్ కేవీఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికీ లేని గొప్ప యువశక్తి భారతదేశానికి ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. యువత శ్రమించేతత్వం విషయాసక్తి పెంచుకోవాలని హితవు పలికారు. గీతాశ్రీకాంత్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ గీతాశ్రీకాంత్, విద్యాసంస్థల అధినేత జామి భీమశంకర్‌లు మాట్లాడుతూ వివేకానందుడు భారతజాతికి అందించిన ప్రబోధాల సంపదను యువత సొంతం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. యంగ్‌ఇండియా డెరైక్టర్ మందపల్లి రామకృష్ణారావు కార్యక్రమానికి నేతృత్వం వహించగా, సెట్‌శ్రీ మేనేజర్ ఎ.మురికయ్య, వైష్ణవి సేవా సంస్థ అధ్యక్షుడు ఎస్.సత్యం, డి.మోహనరావు, సీహెచ్ శ్రీనివాస్, ఎన్‌వైకే ప్రతినిధులు బి.జోగారావు, లోచన బాబు, కుమారస్వామి పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 80 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
Advertisement
Advertisement