సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. కనీసం ప్రాజెక్టు సర్వే కోసం పంపిన ప్రతిపాదనలను కూడా నెలలు గడుస్తున్నా పట్టించుకోని పరిస్థితి. స్వయంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పంపిన ప్రతిపాదనలకూ దిక్కులేకుండా పోతోంది. హంద్రీనీవా నుంచి ఆలూరు, పత్తికొండ, డోన్ నియోజవర్గాల్లోని 38 చెరువులను నింపేందుకు ఏ విధంగా ప్రాజెక్టును నిర్మించాలనే విషయంపై సర్వే చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ జిల్లా సాగునీటిశాఖ అధికారులు.. జనవరి 7, 2015న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదన సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శికి మార్చి 14న చేరింది.
అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వాస్తవానికి ఈ సర్వేకు అయ్యే ఖర్చు రూ.95.25 లక్షలు మాత్రమే. సర్వే కోసం అనుమతి ఇవ్వాలంటూ సాగునీటిశాఖ ఉన్నతాధికారులను స్వయంగా డిప్యూటీ సీఎం కోరినా ఫలితం లేకపోవడం గమనార్హం.
పదే పదే ఫాలో అప్ చేసినా
పట్టించుకోరే..
వాస్తవానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కువగా లబ్ధి పొందేది డిప్యూటీ సీఎం నియోజకవర్గమైన పత్తికొండనే. దీంతో ఆయన ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం సాగునీటిశాఖ
ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాజెక్టు సర్వేకు అనుమతివ్వాలని అధికారులను స్వయంగా విన్నవించారు. ఇప్పటివరకు సంబంధిత అధికారులకు ఏకంగా 18 సార్లు ఫోన్ చేసినట్టు సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కించిత్తు స్పందన కూడా లేకపోయింది. హంద్రీ నీవా ద్వారా 38 చెరువులకు నీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆలూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో తాగునీటిని అందించే అవకాశం ఉంది. కరువు ప్రాంతాలైన ఈ నియోజకవర్గాలకు ఉపయోగపడే ప్రాజెక్టు గురించి డిప్యూటీ సీఎం స్థాయిలో ఫాలోఅప్ చేసినా ఫలితం లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.
కరువు ప్రాంతాలపైనా
కనికరమేదీ..
వాస్తవానికి ఆలూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాలకు తాగు, సాగునీటి సమస్యలు ఉన్నాయి. ప్రతి యేటా కరువుబారిన పడే మండలాల్లో అధికంగా ఈ నియోజకవర్గాలకు చెందినవే. వేసవి వచ్చిందంటే చాలు.. గుక్కెడు నీటి కోసం ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు గొంతెండాల్సిందే. కిలోమీటర్ల దూరం నడిచి తాగునీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాలైన ఈ నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు.. చెరువులు నిండటం ద్వారా భూగర్భ జలాలు పెరిగి సాగునీటికీ ఇబ్బందులు లేకుండా పోయే అవకాశం ఉంది. ఇంతటి కరువు దుర్భిక్ష ప్రాంతాలైనప్పటికీ వీటిపై ప్రభుత్వం కనికరం చూపకపోవడం పట్ల తమ్ముళ్లు గుర్రుమంటున్నారు.
పెద్దన్న.. మాట చెల్లదన్న!
Published Sat, Jul 18 2015 3:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement