
సాక్షి, విశాఖపట్నం: మందుబాబులకు మద్యం ధరలు నిజంగానే కిక్ ఇస్తున్నాయి. నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మద్యం ధరలను పెంచేసింది. పెంచిన ధరలు జిల్లాలో గురువారం నుంచి అమలులోకి వచ్చాయి.
ధర ముద్రించకనే..
మద్యం బాటిళ్లకు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.30 వరకు మోత మోగుతోంది. అయితే పెంచిన ధరలు బాటిళ్లపై ఇంకా ముద్రించలేదు. ప్రస్తుతం డిస్టలరీ డిపోల్లో పాత ఎమ్మార్పీతో ఉన్న సరుకునే మద్యం వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇన్వాయిస్‌లో మాత్రం కొత్త రేట్లు వసూలు చేస్తున్నారు. పేరొందిన డిస్టలరీల కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న మద్యంపై ఒక రేటు, కొత్తగా వచ్చిన కంపెనీలు తయారు చేసే మద్యంపై మరో రేటుతో ఇన్వాయిస్ వసూలు చేస్తున్నారు.
మొన్నటి వరకు ఒక సాధారణ బ్రాండ్ క్వార్టర్ బాటిల్‌పై ఉండే ఎమ్మార్పీ రూ.80 ఉంటే, ప్రస్తుతం బ్రాండ్‌ను బట్టి రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఇంకా మంచి బ్రాండ్స్ అయితే ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 పెంచి విక్రయిస్తున్నారు. ధరల పెంపు వల్ల కనీసం 15 శాతం ఆదాయం అదనంగా వస్తుందని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. పెంచిన రేట్లతో లైసెన్స్ గడువు పూర్తయ్యే సమయానికి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని అంచనా.
‘స్వైప్’ చేసేశారు
బార్ కోడింగ్ విధానం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. మద్యం కొనుగోలు చేసే వినియోగదారుడికి ప్రతి బాటిల్‌పై స్వైప్ మిషన్ ద్వారా కోడింగ్ చేసి బిల్లు ఇవ్వాలి. తద్వారా లూజు విక్రయాలకు చెక్ పెట్టవచ్చున్నది ప్రభుత్వ ఆలోచన. కానీ ఈ విధానానికి మద్యం వ్యాపారులు తూట్లు పొడిచారు. స్వైపింగ్ మిషన్ల వినియోగానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. వీటి ద్వారా అమ్మకాలు జరిపితే లూజు విక్రయాలు పూర్తిగా పడిపోయి వ్యాపారం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచనతో వీటిని పక్కన పెట్టేశారు.