కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్పాలి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య
ఆదోని అర్బన్: రాష్ర్ట విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కేటాయించిన రూ.1,65,000 కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్క చూపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య అన్నారు. బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. కోట్లు ఇస్తున్నా ఒక్క చోట కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలను వేయడం లేదని విమర్శించారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ అన్ని పార్టీలను పిలిచి బీజేపీ నాయకులను పిలవకపోవడం తమను అవమానించడమేనన్నారు.
దళితుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ నిధులను కేటాయించిందన్నారు. ఇప్పటికైన కలెక్టర్ అన్నిపార్టీలతో కలిసి పోవాలని కోరారు. పార్లమెంట్‌లో భరతమాతాకు జై అనని పార్లమెంట్ సభ్యుడు ఓవైసీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో బీజేవైఎం, బీజేపీ నాయకులు నీలకంఠ, గోవిందరాజులు, శ్రీరాములు, భాస్కర్, సుశీల, మీనాక్షి, శివకుమార్ పాల్గొన్నారు.