
సాక్షి, అమరావతి: నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు అల్లాడుతున్నా పన్నులు తగ్గించి ఆదుకోవడానికి ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించడానికి రాయితీల మీద రాయితీలు ప్రకటిస్తోంది. విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడపడానికి ఏ సంస్థ కూడా ఆసక్తి చూపకపోవడంతో ఖాళీగా ఉన్న సీట్ల నష్టాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) కింద తామే భరిస్తామంటూ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ వీజీఎఫ్ కింద ఆరు నెలల కాలానికి రూ.18 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడంతో వారానికి రెండు సర్వీసులు నడపడానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ముందుకొచ్చింది.
ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి అవసరమైన కస్టమ్స్ విభాగం వ్యయాన్ని కూడా తాము భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. క్టసమ్స్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసే యూనిట్‌కు అద్దె చెల్లింపులకు నెలకు రూ.2 లక్షలు వరకు అవుతుందని అంచనా వేశామని, విమాన సర్వీసులు తక్షణం ప్రారంభించాలన్న లక్ష్యంతో ఇలా ఆరు నెలలకు రూ.12 లక్షల వరకు చెల్లించాలని నిర్ణయించినట్లు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని, ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఈ అద్దె ఎవరు చెల్లించాలన్న దానిపై ఏఏఐ, కస్టమ్స్ విభాగం మధ్య వివాదం తలెత్తింది. 2009 నుంచి మారిన నిబంధనల ప్రకారం కస్టమ్స్ విభాగం ఏర్పాటుకు సంబంధించిన వ్యయాన్ని ఆ శాఖే భరించాల్సి ఉంది. కానీ, విజయవాడలో వారానికి రెండుసార్లు చొప్పున ఆరు నెలల పాటు మాత్రమే వీజీఎఫ్ కింద సర్వీసులు నడుపుతుండడంతో కస్టమ్స్ విభాగం ఈ వ్యయాన్ని భరించడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించాలంటూ పౌర విమానయాన శాఖ మంత్రికి ప్రభుత్వం లేఖ రాయడంతోపాటు ఏఏఐకి కస్టమ్స్ వ్యయాన్ని తామే భరిస్తామంటూ కూడా ప్రతిపాదనలు పంపింది. 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 25వ తేదీలోగా సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో నెల రోజుల వరకు సర్వీసులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment