క్షమాపణ చెప్పాల్సిందే
Published Sun, Aug 18 2013 4:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఉద్యోగులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం నెల, రెండు నెలలకంటే ఎక్కువ రోజులు జరగదని.. ఉద్యోగులను, ఉద్యమాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ తిమ్మన్న డిమాండ్ చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమావేశం సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మన్న మాట్లాడుతు సీమాంధ్ర పౌరుషం మంత్రికి తెలియనిది కాదని, అయినప్పటికీ ఈ విధంగా మాట్లాడడం దారుణమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో పాటు బిచ్చగాళ్లు, హిజ్రాలు కూడా పాల్గొంటుంటే మంత్రి నీరుగార్చడం తగదన్నారు. మంత్రి టీజీ వైఖరికి నిరసనగా ఈ నెల 19న ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం విడిపోతే భావి తరాలకు తీరని నష్టం తప్పదని.. విద్యార్థి సంఘాలు నిద్ర వీడి ఉద్యమాల్లో అగ్రభాగాన నిలవాలని కోరారు. వైఎసార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాల్లో విద్యార్థులే ప్రధాన పాత్ర పోషించారని, ఇక్కడా తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. న్యాయవాది మురళి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ఇంతటి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నా కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖం చాటేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సమావేశంలో జేఏసీ నేతలు యాగంటీశ్వరయ్య, మియ్య, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement