రాష్ట్రం హక్కులు కాపాడాకే అనుసంధానం | State rights kapadake integration | Sakshi
Sakshi News home page

రాష్ట్రం హక్కులు కాపాడాకే అనుసంధానం

Published Thu, Jan 8 2015 1:54 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

రాష్ట్రం హక్కులు కాపాడాకే అనుసంధానం - Sakshi

రాష్ట్రం హక్కులు కాపాడాకే అనుసంధానం

  • నదుల అనుసంధానంపై తెలంగాణ మంత్రి హరీశ్
  • గోదావరి జలాలపై తాజా అధ్యయనం జరగాలి
  • కేంద్రానికి ఇదే చెప్పాం
  • సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా చేపట్టనున్న నదుల అనుసంధాన కార్యక్రమాన్ని తాము వ్యతిరేకించడం లేదని,తెలంగాణ  ప్రయోజనాలు కాపాడాకే అనుసంధానం మొదలుపెట్టాలని కోరుతున్నామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రాజెక్టులకు రావాల్సిన నీటిని పూర్తిగా కేటాయించాకఅదనంగా ఉన్న జలాలను అనుసంధానంతో తరలిస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు. ‘నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించడం లేదు.

    రాష్ట్ర ప్రయోజనాలు ఫణంగా పెట్టే అనుసంధానం వద్దన్నాం. ఈ విషయంలో మా అభ్యంతరాలను, అనుమానాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాం. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంది. గోదావరిలో అదనపు జలాలు ఉన్నాయని కేంద్రం అంటోంది. ఇక్కడ ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుంది. ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదు.

    తాజాగా అధ్యయనం చేసి దీనిపై నిర్ణయం చేయాలి. అలాకాకుండా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నష్టం’ అని మంత్రి అన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాల్ల్లో కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమన్నారు.
     
    కాంగ్రెస్, టీడీపీలు వాస్తవాలు తెలుసుకోవాలి


    ప్రభుత్వ పనితీరు పేలవంగా ఉందంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి చేసిన విమర్శలపై మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలనే కాకుండా మరిన్ని హామీలను అమలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

    దేశానికే ఆదర్శమైన పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు. పంట రుణాల మాఫీ, పింఛన్లు, పాల సేకరణ ధరల పెంపు, విద్యార్థులకు సన్నబియ్యం పథకాలపై ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్, టీడీపీలు తమ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను విస్మరించాయన్నారు. అలాంటి వారికి తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ప్రభుత్వ పథకాలపై ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement