రాష్ట్రాన్ని విభజించాల్సిందే: చంద్రబాబు
సాక్షి, ఒంగోలు: ‘‘రాష్ట్రాన్ని విభజించాలని నేను స్పష్టంగా చెప్పాను... అయితే అసెంబ్లీలో తీర్మానం చేశాకే రాష్ట్రాన్ని విభజించాల’’ని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. సోనియాగాంధీ ఇష్టమొచ్చినట్లు విభజిస్తే కుదరదని, తాను చెప్పినట్టుగా రాష్ట్రాన్ని విభజించాలని స్పష్టం చేశారు. టీడీపీ సోమవారం ఒంగోలులో నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ... ‘‘రాష్ట్రాన్ని విభజించమని నేను ఇచ్చిన లేఖను కొందరు తప్పుబడుతున్నారు. ఆ లేఖలో ఏం చెప్పానో చూడకుండా నన్ను విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణను ఏర్పాటు చేయాలని నేను స్పష్టంగా చెప్పాను. అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఇప్పుడు చెబుతున్నాను’’ అని చెప్పారు. ఆర్టికల్-3 ప్రకారం విభజిస్తే అంగీకరించేది లేదన్నారు. విభజన బిల్లు అసమగ్రంగా ఉందని టీఆర్‌ఎస్ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ... ఇరుప్రాంతాల వారికి సమ్మతం కాని బిల్లును ఎందుకు పెట్టడమని ప్రశ్నించారు.
అందరికీ ఆమోదయోగ్యంగా విభజించడం కోసం ఇరు ప్రాంతాలవారితో చర్చించాలన్నారు. సోనియాగాంధీని ఇటాలియన్ మాఫియాగా అభివర్ణిస్తూ ఆమెపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యిందని విమర్శించారు. తెలంగాణలో మూడు నాలుగు జిల్లాలకే పరిమితమైన టీఆర్‌ఎస్ తనను విమర్శించడమేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను, తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై తాను విసిరిన సవాల్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భయపడ్డారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. వివిధ వర్గాలపై హామీల వర్షం కురిపించారు. వాజ్‌పేయి హయాంలో స్వర్ణ చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల విస్తరణ, సెల్‌ఫోన్ కమ్యూనికేషన్ విప్లవం తదితరాలన్నీ తన ఘనతేనని చంద్రబాబు చెప్పారు.
వైఎస్ జగన్‌పై అక్కసు
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన సభలకు హాజరుకావద్దని ప్రజలను కోరారు. అదేవిధంగా సాక్షి పత్రిక, టీవీలపై కూడా తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. సాక్షి కాకుండా ఇతర టీవీ చానళ్లను కూడా చంద్రబాబు విడిచిపెట్టలేదు. ఆ చానళ్లు ప్యాకేజీలకు అమ్ముడుపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. తన ప్రసంగంలో చంద్రబాబు ఒక్కసారి కూడా ‘సమైక్యం’ అనే మాట మాట్లాడకపోవడం గమనార్హం. ఈ సభలో టీడీపీ నేతలు దామచర్ల జనార్దన్, కరణం బలరాం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.