ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర వెల్లడి
అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్ సరఫరా, వినియోగం, డిమాండ్, వసూళ్లు తదితర అంశాలపై పూర్తి అవగాహన, సరైన గణాంకాలతో సమావేశానికి హాజరుకావాలని, లేదంటే రావద్దని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) హెచ్‌వై దొర జిల్లా అధికారులకు చురకంటించారు. స్థానిక విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆ యన జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఆయన అడిగిన పలు సందేహాలు, ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంపై అవగాహన లేకుండా సమావేశాలకు హాజరుకావద్దని మండిపడ్డారు. అనంతపురం, క ర్నూలు జోన్ చీఫ్ ఇంజనీరు పీరయ్య, డెరైక్టర్ రామ్‌సింగ్, జిల్లా ఎస్‌ఈ ఆర్‌ఎన్ ప్రసాద్‌రెడ్డితో కలిసి వివిధ అంశాలపై సీఎండీ సమీక్షించారు.
విద్యుత్ బిల్లుల వసూళ్లు, దొంగ కరెంటు వినియోగంపై కేసులు నమోదు చేయకపోవడం, ఆధార్ సేకరణలో నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా ఏడు జిల్లాల కన్నా అనంతపురం జిల్లా వెనుకబడి ఉందన్నారు. వచ్చే నెల నుంచి 100 శాతం వసూళ్లు చేయాలన్నారు. అపరాధ రుసుం రూ.2 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నా వసూళ్లు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ నెల 10లోగా వంద శాతం ఆధార్ సేకరణ కాకపోతే శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు.
సమావేశంలో అనంతపురం, గుత్తి, కదిరి, హిందూపురం, కళ్యాణదుర్గం డివిజన్ల డీఈలు కె.సంపత్‌కుమార్, పీవీ రమేష్, శేషగిరిరావు, నాగేంద్రకుమార్, శ్రీనివాసులు, ఎస్‌ఏవో విజయభాస్కర్‌తో పాటు ఎస్‌ఈ కార్యాలయ డీఈలు, ఏడీఈలు, ఏఈలు హాజరయ్యారు. విద్యుత్‌శాఖకు సంబంధించి వివిధ ఉద్యోగుల యూనియన్లు పలు డిమాండ్ల సాధనకు సీఎండీని కలిసి వినతి పత్రం అందజేశారు.
సీఎండీ దొరకు రైతు సంఘం వినతి పత్రం : విద్యుత్ ప్రమాదాల్లో మరణిస్తున్న బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంకే వెంకటరెడ్డి, కార్యదర్శి పి.పెద్దిరెడ్డి సీఎండీ హెచ్‌వై దొరకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.
ఆపరేటర్, వాచ్‌మెన్ పోస్టులు భర్తీ చేయండి : జిల్లా వ్యాప్తంగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్, వాచ్‌మెన్ పోస్టులు అర్హులైన మీటర్‌రీడర్స్‌తో భర్తీ చేయాలని సీఐటీయూ అనుబంధ యునెటైడ్ ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యుఈఈయు) నేతలు సీఎండీ హెచ్‌వై దొరకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్ అధ్యక్షుడు ఎం.రామచంద్ర, కార్యదర్శి టి.మారుతీకుమార్, నాయకులు మహబూబ్‌బాషా, సుబ్రమణ్యం ఉన్నారు.
గణాంకాలతో హాజరు కావాలి
Published Sat, Dec 6 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement