‘ఉక్కు’ సంకల్పం
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఉక్కు’పరిశ్రమ ఏర్పాటుపై తాత్సారం చేయొద్దు. విభజన చట్టాన్ని అమలు చేయండి. కడప గడపలో ‘సెయిల్’ నేతృత్వంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి. నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కృషి చేయండి. తద్వారా వెనుకబడిన ప్రాంతాన్ని ఆదుకోండి’ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు కేంద్ర ఆర్థిక, హోంశాఖ మంత్రులు అరుణ్‌జైట్లీ, రాజనాథ్‌సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సమస్యలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వీరు కేంద్రమంత్రులను ఆదివారం ఢిల్లీలో కలిశారు. వైఎస్సార్ జిల్లాలో సెయిల్ నేతృత్వంలో ఉక్కుపరిశ్రమ నెలకొల్పాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించడంతో వెనుకబడ్డ ప్రాంతానికి ఉక్కుపరిశ్రమ వస్తుందనే ఆశలో ప్రజానీకం ఉన్నారని తెలిపారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాలని సెయిల్ సూచనల మేరకు రాయితీలు అందించి కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని విన్నవించారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అందుకోసం సకాలంలో నీటి వనరులను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే విషయాన్ని పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ కేంద్రంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే వెనుకబడ్డ ప్రాంతంలో ఉపాధికి మార్గం చూపినట్లుందని వారు వివరించారు. కేంద్ర మంత్రులను కలిసిన విషయాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి సాక్షికి ఫోన్ ద్వారా ధ్రువీకరించారు.