ఇప్పటికీ నేను సమైక్యవాదినే: జగ్గారెడ్డి
హైదరాబాద్: ఇప్పటికీ తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగదని చెప్పారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తమకు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని, తెలంగాణ అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే ఈ రకంగా ప్రత్యేకరాష్ట్రం వద్దనడంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన కోసం రోడ్ మ్యాప్ రూపొందించిన వారు అసలు జిల్లాకు సాగు, తాగునీటి వనరులను ఎక్కడి నుంచి తెస్తారో చూపించారా? అని ప్రశ్నించారు. సింగూర్ ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్‌లలో పూడిక తీయించాలని, కర్ణాటక, మహారాష్ట్రల్లో అక్రమంగా నిర్మించిన చిన్నచిన్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని తాను ఎన్నిసార్లు చెప్పినా జిల్లా మంత్రులు పెడచెవిన పెట్టారని వాపోయారు. జిల్లా అభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. తెలంగాణ అంశానికి అనుకూలంగా లేకపోతే వారెవరూ వచ్చే ఎన్నికలలో గెలవలేరని, అందుకే ఈ అంశంతో ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.