బాల్య వివాహ నిశ్చితార్థాన్ని అడ్డుకున్న అధికారులు
కణేకల్లు : 16 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు నిర్వహిస్తున్న నిశ్చితార్థ కార్యక్రమాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన మండలంలోని గోపులాపురం గ్రామంలో గురువారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బాలికకు ఆమె తల్లిదండ్రులు సమీప బంధువులకు చెందిన ఓ అబ్బాయితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈనేపథ్యంలో గురువారం ఇంట్లో నిశ్చితార్థ కార్యక్రమం పెట్టుకొన్నారు. విషయం తెలియడంతో ఐసీడీఎస్ సీడీపీఓ పార్వతమ్మ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని నిశ్చితార్థాన్ని అడ్డుకొన్నారు. మైనర్ బాలికకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు సూచించారు. అధికారుల హెచ్చరికతో నిశ్చితార్థం ఆగింది.