విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమాశం వాడిగా వేడిగా సాగింది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో జరగడంతో ఎమ్మెల్యేలు తమ గొంతు గట్టిగానే విప్పారు. అధికారుల తీరుపై విరుచుకు పడ్డారు. గత తీర్మానాలే అమలు కానప్పుడు కొత్తవి ఎందుకని ఈ మార ఎలాంటి తీర్మానం లేకుండా ముగించేశారు. సభ్యులకు అండగా కమిటీ చైర్మన్ మందా జగన్నాధం పలుమార్లు అండగా నిలిచారు. చివరికి కలెక్టర్ గిరిజాశంకర్ ముక్తాయింపు ఇస్తూ అన్నీ సమీక్షించి పనులను వేగిరపరుస్తామని ప్రజాప్రతినిధులను శాంతింపజేశారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘‘ కేంద్ర ప్రభుత్వం గ్రామాద్ధికోసం కోట్ల నిధుల్ని మంజూరు చేస్తోంది. వాటిని సక్రమంగా వినియోగించడంతోపాటు, నాణ్యత ఉండేలా చూడాలి. నిధులున్నా పనిచెయ్యరు, ఈ విషయమై ప్రశ్నిస్తే కట్టు కథలు చెప్పడం అలవాటుగా మారిందా?’ అంటూ ఎంపీ మందా జగన్నాథంతోపాటు, ఎమ్మెల్యేలంతా అధికారుల తీరుపై మండిపడ్డారు. శనివారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ మంద జగన్నాథం అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు.
అవి అమల్లోకి రాకపోవడంతో అధికారుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. తాము నియోజకవర్గాలకు ఎలా వెళ్లాలనీ, ప్రజలకు ఏం చెప్పాలని నిలదీశారు. ‘ మీరెందుకు పనిచేయరు, మీకు హైకమాండ్ మంత్రా ’అని సభ్యులు ప్రశ్నించారు. వారికి అండగా జగన్నాథం మాట్లాడుతూ ‘ ప్రతిసారీ కథలు చెప్పడం అలవాటుగా మారిందా, మీతీరు మారదా’ అని నిలదీశారు. ఇలాగే ప్రవర్తిస్తే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అధికారుల చేతగాని తనం వల్ల జిల్లా అభివృద్దిలో వెనుబడిందని వారిపై అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ జాబితాతోపాటు, నిధుల సమాచారాన్ని తనకు సమర్పించాలని ఆదేశించారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశాన్ని మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగించి ఎలాంటి తీర్మానాల్లేకుండానే ముగించేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఇదే చివరి సమావేశం కావొచ్చని, ఈసారైనా సమస్యలకు పరిష్కారం చూపుతారా లేదా అని ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తపరిచారు.
విద్యుత్ సమస్యపై సీఎం వద్దకు
గతేడాది వర్షాలు అంతంతే ఉండడంతో విద్యుత్ సమస్య ఏర్పడింది, కానీ ఈ ఏడు వర్షాలు బాగా వచ్చి నా నీళ్లు నిండుగా ఉన్నా అదే సమస్య తలెత్తి రైతులు వేసుకొన్న పంటలకు నీరు అందడడంలేదనీ ఎమ్మెల్యేలు నాగం, రాములు, జైపాల్‌యాదవ్‌లు ప్రశ్నించా రు. ఇలా అయితే రైతులు బతికేదెట్ల, వారికి ఉపాధి ఎవరు చూపాలని వారంతా ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా ఎమ్మెల్యేలమంతా సీఎంను సోమవారం కలుద్దామని నిర్ణయించుకొన్నారు.
హౌసింగ్‌కు అవినీతి రోగం
జిల్లాలో హౌసింగ్ విభాగం అవినీతి మయమైందనీ, పేదలంతా బిల్లులు రాక పరేషాన్‌లో పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తమైంది. అవినీతి అధికారుల కారణంగా హౌసింగ్ శాఖ అక్రమాల శాఖగా మారిందన్నారు. నాగర్‌కర్నూల్ పరిధిలోని నాగనూలులో , అల్లీపూర్‌లో , శాయిన్‌పల్లి , బాలాజీపల్లిలో భారీగా నిధులు హౌసింగ్ అధికారి ఖాతాల్లోకి వెళ్లాయనీ డీఈ ఏకంగా 64లక్షల్ని స్వాహా చేసినా రికవరీ గానీ, కేసులు కానీ లేవని నాగం జనార్ధనరెడ్డి అధికారులను నిలదీశారు. లక్షల్ని స్వాహా చేసి నాగర్‌కర్నూల్‌లో పెద్ద భవనాల్ని నిర్మించుకొని దర్జాగా ఉన్నారని ఆరోపించారు.
ఇక బినామీలకు బిల్లులు వెళ్లాయి, కానీ ఇండ్లు ఉండవు, గ్రామాల్లో పేర్లున్నా వారుండరని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పేదోడి కడుపు కొడితే మీకేం వస్తుందని అధికారులను నిలదీశారు. ఉపాధి పథకం కూడా పక్కదారి పట్టిందనీ ఎంపీడిఓలు, ఇతర సిబ్బంది రూ. కోట్లలో స్వాహా చేసిన వారిపై కేసుల్లేవన్నారు. సోషల్ ఆడిట్ బృందాలు ఇచ్చిన తప్పుడు నివేదికలతో ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం తొలగిస్తారని సభ్యులంతా అగ్రహం వ్యక్తం చేశారు. బదిలీల విషయంలో కూడా ఇబ్బందిలేని నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్స్ కోసం డీడీలు కట్టినా లేవు
నియోజకవర్గ పరిధిలోని రైతులంతా చెల్లించిన డీడీలను అనుగుణంగా 5వేల ట్రాన్స్‌ఫార్మర్లని ఇవ్వాలి.ఇంత వరకు ఒక్కటైనా ఇవ్వలేదు. దీంతోపాటు, ప్రపంచ బ్యాంక్ నిధులు రూ.35కోట్లు మంజూరైనా పనుల్ని చేపట్టడంలేదు, ఇక తాగునీటి సమస్యను పరిష్కరించేందుకైనా సింగోటం రిజర్వాయరు నుంచి నీటి సదుపాయాన్ని కల్పించాలి.
- జైపాల్ యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే
ప్రతీ గ్రామానికి రూ.5లక్షలు కేటాయించండి...
ఉపాధి హామీ పథకంలో ప్రతీ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలను చేపట్టేందుకు రూ.5లక్షల నిధుల్ని కేటాయించాలన్నారు. ఎందుకంటే కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైనా వారికి నిధుల కొరత ఉండడంతో వారేం చేయలేని పరిస్థితిలో పడ్డారు. అదే విధంగా వేసవి రాబోతోంది, తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. మేం అధికారులకు మర్యాద ఇస్తున్నాం, కాపాడుకోవాలి.
- రావుల చంద్రశేఖర్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే
బిల్లులు వేరే వారు స్వాహా చేస్తున్నారు...
గ్రామాల్లో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయగా, పనులు చేపట్టింది ఒక్కరైతే, నిధుల్ని మాత్రమే వేరే వారు స్వాహా చేశారు. దీంతో పనులు చేపట్టిన వారంతా అప్పుల పాలై నానా పాట్లు పడుతున్నారు. ఈ కారణంగా 5గ్రామాల్లో సమస్య తీవ్రంగా మారింది, చట్టం ఉన్నా ఆ ప్రకారం చర్యలు తీసుకోరా ?. ఈవిషయమై జడ్పీ సీఈఓ సమాధానం ఇవ్వాలి. -అబ్రహం, అలంపూర్ ఎమ్మెల్యే
డిఅర్‌సీ మీటింగ్ ఏర్పాటు చేయండి...
జిల్లా అభివృద్దిలో వెనుకబడింది, మేం జిల్లా కాకుండా, ప్రత్యేక రాష్ట్రం కోసం రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేస్తోంటే అధికారులేమో మమ్మల్ని అడిగేవారు లేరనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. వెంటనే డిఅర్‌సి మీటింగ్‌ను ఏర్పాటు చేస్తే, ఏఅభివృద్ది ఎంత అనేది తెలుస్తామని నాగం పట్టుబట్టారు. ఈ విషయంలో కలెక్టర్ కల్పించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ‘ తాడూర్ మండలం ఐతోలుకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్‌ను సోషల్ ఆడిట్ బృందం సమర్పించిన తప్పు నివేదిక కారణంగా సస్పెండ్ చేశారు. దీనిపై నేను స్వయంగా పీడికి ఫోన్ చేసి బీద వాడు కాబట్టి అవకాశం కల్పించాలని కోరా. ఆమె నిబంధనలు ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన నాకే చెప్పారు. మీ నిర్లక్ష్యం వల్ల మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు మీరే బాద్యత వహించాలి, మీతోపాటు, కార్యాలయంలో పనిచేసే భరత్‌ను విధుల్లోంచి తొలగించి, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ కల్పించుకొని అధికారుల తీరుపై మండిపడ్డారు, వెంటనే అతని కుటుంబాన్ని ఆదుకోవాలని అగ్రహించగా, ఆదుకొంటామని కలెక్టర్ హామీ ఇవ్వంతో శాంతించారు.
- నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే
జిల్లాకు చివర్లో ఉన్నామని నిర్లక్ష్యం చేస్తున్నారా..
మా నియోజకవర్గం జిల్లాకు చివర్లో ఉందని, ఏప్రభుత్వ పథకాన్ని అధికారులు సరిగ్గా అమలు చేయడం లేదు. ఈకారణంగా అమ్రాబాద్, ఉప్పునుంతల మండల పరిధిలలో ఉండే గ్రామాల్లో 15రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. ఇక గతంలో మంజూరు చేసిన పనులే పూర్తి కాలేదు, ఇప్పుడు లింగాల నుంచి గ్రామాలకు రూ.3కోట్లతో తాగునీటి పైపులైన్ పనులకు నిధులు మంజూరు చేశారు. రామన్‌పాడు పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏరోజు నీరు సరఫరా అయిన దాఖలాల్లేవు.
- రాములు, అచ్చంపేట్ ఎమ్మెల్యే
జిల్లా కేంద్రానికి సీఎం రూ.20కోట్లు
ఇస్తామని చేతులేత్తేశారు...
జిల్లా కేంద్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేసేందుకు గాను రూ.20కోట్లు మంజూరు చేస్తానని ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు చెప్పిన సీఎం ఇప్పుడు చేతులేత్తేశారు. సీమాంధ్రకు మాత్రం రూ.7వేల కోట్లను తీసుకెళ్లారు.
- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
భూత్పూర్‌కు రామన్‌పాడు
నీరు ఇవ్వండి.....
భూత్పూర్ మీదుగా జడ్చర్లకు రామన్‌పాడు నీటిని తీసుకెళ్లారు, కానీ, భూత్పూర్‌కు నీరు ఇవ్వడంలేదు. ఈవిషయమై ఏడాది కిందట అధికారులకు విన్నవించా, వెంటనే నీరివ్వండి. ఎప్పటికి నీరిస్తారో చెప్పండి. ఇక పెండింగ్ పనులన్నింటిని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగా పరిష్కరించాలి.
- సీతాదయాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
విద్యుత్ వాడకం పెరిగింది..
గతేడాది 650మెగావాట్లు వాడకం ఉండేది, కానీ ఈసారి 980మెగావాట్లకు పెరిగింది. దీంతో విద్యుత్ సమస్యతోపాటు, ఇన్‌కమింగ్ సరఫరా ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సమ్మర్‌లో 500మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తే తప్పా సమస్య పరిష్కారం కాదు. ఈ విషయాన్ని సీఎండి దృష్టికి తీసుకెళ్తా. - సదాశివా రెడ్డి, విద్యుత్ ఎస్‌ఈ
అభివృద్ది పథకాలను పరిష్కరించేందుకు నావంతు కృషి చేస్తా
అన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులపై సమీక్షలు నిర్వహించి సత్వరమే పరిష్కరించేందుకు నావంతు కృషి చేస్తా. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి కోట్ల నిధులు మంజూరు చేస్తోంది.వాటిని సకాలంలో వినియోగించి, జిల్లాను అభివృద్ది చేసేందుకు ఈసమావేశాల్ని నిర్వహిస్తున్నాం. అన్ని శాఖల పనితీరును మరోసారి పరిశీలించి, వెంటనే పెండింగ్ పనుల్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటా.
- ఎం.గిరిజాశంకర్, జిల్లా కలెక్టర్
కథలు చెప్పడానికా..!
Published Sun, Feb 2 2014 3:55 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement