తుపాను బాధితులందరికీ పూర్తిగా న్యాయం చేస్తామని మంత్రి గంటా అన్నారు
మంత్రి గంటా శ్రీనివాసరావు
అనకాపల్లి: హుదూద్ తుపాను వల్ల ప్రాథమిక అంచనా ప్రకారం 60వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడారు. హుదూద్ ఇప్పటి వరకూ సంభవించిన తుపాన్ల కంటే అత్యంత ప్రభావ వంతమైనదని ఐఎండీ తెలి పిందన్నారు. మంచినీటి సరఫరా, కూరగాయ లు, రేషన్ పంపిణీలో సఫలీకృతులమయ్యామ ని తెలిపారు. విశాఖపట్టణానికి 80శాతం విద్యు త్ సరఫరా చేయగా, మొత్తం మీద 60 శాతం విద్యుత్‌ను పునరుద్దరించామని పేర్కొన్నారు.
నేడు విశాఖ బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ
ఈ నెల 22వ తేదీ సాయంత్రం విశాఖ బీచ్‌లో తుపాన్‌ను జయిద్దాం అని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు ఈ ర్యాలీలో పాల్గొంటారన్నారు. 23 వ తేదీ ఉదయం పరిశ్రమల సీఇఓలతో విశాఖపట్నంలో సీఎం సమావేశమవుతారని తెలిపారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఏ మాత్రం పడిపోనీయకుండా కొత్త సిటీని నిర్మించుకుందామన్నారు. ప్రతి విద్యార్థి ఒక్క చెట్టుని నాటి, దాని పెంచే బాధ్యతను తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎంఎల్‌ఏలు పీలా గోవింద సత్యనారాయణ, పంచకర్ల రమేశ్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎంఎల్‌ఏ ఉప్పలపాటి రమణమూర్తి రాజు పాల్గొన్నారు.
బాధితులందరికీ న్యాయం
మాడుగుల: తుపాను బాధితులందరికీ పూర్తిగా న్యాయం చేస్తామని మంత్రి గంటా అన్నారు. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజులలో ప్రతి గ్రామంలో తిరిగి ఇళ్లు, పశువుల పాకలు, పంటలు, తోటల అన్నింటి నష్ట వివరాలను నమోదు చేసి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాలలో వాస్తవ పరిస్థితులు చూసి నష్టం నమోదు చేయాలని సూచించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ ఆస్తుల నష్టం నమోదు చేయలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, అద్దిపల్లి జగ్గారావు, సర్పంచ్ దంగేటి వెంకటలక్ష్మి, ఎంపీపీ ఓండ్రు గంగమ్మ, పుప్పాల అప్పలరాజు పాల్గొన్నారు.