సాక్షి, అమరావతి: పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తప్పు చేయనప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలన్న ధీమాతో రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస (ఏసీబీ) ప్రవేశానికి అనుమతించింది. ఇప్పటికే కాంట్రాక్టుల్లో అక్రమాలకు చెల్లుచీటి రాసేలా సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్‌కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌ను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. టెండర్లలో సంస్కరణలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు.
అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా న్యాయ వ్యవస్థ చేతికే టెండరింగ్ విధానం అప్పగించాలనే నిర్ణయించారు. అవకతవకలు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ ద్వారా సరికొత్త ఒరవడికి తెరలేపారు. నీతివంతమైన పాలన అందించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న నిర్ణయాల్లో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి ఉన్న అడ్డంకులను తొలగించారు. జగన్ నిర్ణయం పట్ల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పునరాగమనానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీబీఐకి సాధారణ సమ్మతిని(జనరల్ కన్సెంట్) పునరుద్ధరిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ 2018 నవంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. తన అవినీతి, అక్రమాలు బయట పడతాయన్న భయంతోనే సీబీఐకి చంద్రబాబు అనుమతి నిరాకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతకు ముందు ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంటూ జీవో 176ను జారీ చేసింది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు.
ఇక సీబీఐ విచారణకు మార్గం సుగమం
ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. జనరల్ కన్సెంట్ లేకుంటే రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు. దాంతో రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖనే(ఏసీబీ) దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రామేశ్వర్‌పై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ దాడి చేసి, కేసు నమోదు చేసింది. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టకుండా అడ్డుకుంటూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీవో నం.176ను రద్దు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం గురువారం జీవో నం.81ని జారీ చేసింది. దీంతో ఏపీలో అవినీతికి సంబంధించిన కేసుల విచారణకు సీబీఐకి మార్గం సుగమమైంది. పారదర్శక పాలన దిశగా బలమైన సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.
జగన్‌పై హత్యాయత్నం కుట్ర బయటపడకుండా పన్నాగం
వైఎస్ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణం వెలుగు చూడకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర పోలీసులతోనే తూతూమంత్రంగా దర్యాప్తు చేయించి, కేసును మూసివేసేందుకు తాపత్రయపడింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తే అసలు కుట్రదారులు బయటపడే అవకాశం ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ హత్యాయత్నంలో ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దీంతో కంగారు పడిన చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలోకి సీబీఐకి నో ఎంట్రీ అంటూ నవంబర్ 8న జీవో జారీ చేసింది.
సీబీఐ అంటే బాబుకు వణుకు
కేంద్ర హోంశాఖ పరిధిలోని సీబీఐకి ఏ రాష్ట్రంలోనైనా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసే హక్కు ఉంటుంది. రాష్ట్రంలోని సంస్థలు అయితే తన చెప్పుచేతల్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదని, అదే కేంద్ర దర్యాప్తు సంస్థలైతే తనకు కష్టాలు తప్పవని గ్రహించిన చంద్రబాబు ప్రభుత్వం సీబీఐకి ఎర్రజెండా చూపింది. గత ఐదేళ్లలో చంద్రబాబు, ఆయన కోటరీలోని టీడీపీ నేతలు అధికారమే అండగా సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని, పట్టిసీమ పేరుతో నిధుల ఎత్తిపోతలపైనా విచారణ జరిగితే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్, అప్పటి జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దొరికిపోయే ప్రమాదం ఉందన్న భయంతోనే సీబీఐ రాకుండా అడ్డుకట్ట వేశారన్న విమర్శలు వచ్చాయి.
రాజధాని నిర్మాణం పేరుతో అక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి ప్రవాహం, విశాఖపట్నంలో భూ కుంభకోణాలు, ఓటుకు కోట్లు కేసు, ఇసుక మాఫియా, నీరు–మట్టి కుంభకోణం వంటి వ్యవహారాల్లో సీబీఐ జోక్యం చేసుకుంటే టీడీపీ పెద్దల మెడకు ఉచ్చు బిగుసుకుంటుందనే భయంతోనే జీవో 176 జారీకి అప్పటి చంద్రబాబు సర్కారు సాహసించిందనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment