బావమరిదికే కేబినెట్ బెర్త్!
చూడబోతే కేంద్ర మంత్రి పదవి బుర్ర మీసాల బాపిరాజుగారి బావమరిది నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజునే వరించేలా ఉంది. ఎందుకంటే బీజేపీ కేంద్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఆ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఇద్దరు బీజేపీ ఎంపీలు కె.హరిబాబు, గోకరాజు గంగరాజులకు స్థానం లభించలేదు. వీరిద్దరిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అయితే హరిబాబు కంటే గంగరాజుకే నరేంద్ర మోడీ కేబినెట్లో మంత్రిపదవి దక్కే ఛాన్స్ అధికంగా ఉందని సమాచారం. ఎందుకంటే విశాఖపట్నం ఎంపీ హరిబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఓ వ్యక్తికి ఒకే పదవి అనే సిద్దాంతాన్ని ప్రస్తుతం బీజేపీ తు.చ తప్పక పట్టిస్తుంది. అదికాక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పోత్తుతో ఆ పార్టీ ఆ రాష్ట్రంలో రెండు ఎంపీ సీట్లు, నాలుగు ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో మరింత బలపడేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. రానున్న రోజుల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అవసరమైన కసరత్తు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అనుభవజ్ఞుడైన హరిబాబు సేవలు ఉపయోగించుకోవాలని అగ్ర నాయకత్వం భావిస్తుంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాలుపై కూడా హరిబాబుకు సమగ్ర అవగాహన ఉంది. ఒకవేళ హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే మరో కొత్త వ్యక్తికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాల్సివుంటుంది. కొత్త అధ్యక్షుడికి రాష్ట్రంలో పరిస్థితిని అవగాహన చేసుకునేందుకు సమయం పడుతుంది.
ఇదంతా పెద్ద తలనొప్పిగా మారి మొదటికే నష్టం వచ్చే అవకాశాలున్నాయని అగ్ర నాయకులు తలపోస్తున్నారు. దాంతో హరిబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగిస్తూ... కొత్తగా పార్టీలోకి వచ్చి ఎంపీగా గెలిచిన గోకరాజు గంగరాజుకు కేంద్రమంత్రి పగ్గాలు అప్పగించాలని అగ్రనాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో మోడీ తొలి కేబినెట్ కూర్పులో టీడీపీ నాయకుడు, విజయనగరం ఎంపీగా తొలిసారి ఎన్నికైన అశోక్గజపతి రాజుకు పౌర విమానాయానశాఖ కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున ఎన్నికైన ఎంపీలకు స్థానం దక్కలేదన్న ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్లో బలంగా ఉంది. గోకరాజును కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా కార్యకర్తలను సంతృప్తి పరచాలని చూస్తోంది.
ఇక తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ ఒక్కరే ఎంపీగా నుంచి గెలుపొందారు. ఆయనకు మోడీ కేబినెట్లో మంత్రి పదవి వరిస్తుందని ఆశించారు. కానీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా దత్తాత్రేయ పేరును అమిత్ షా తాజాగా ప్రకటించడంతో మంత్రి పదవిపై ఆయన పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇరు రాష్ట్రంలోని ముగ్గురు ఎంపీలలో గంగరాజుకే తదుపరి కేబినెట్ విస్తరణలో పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.