1964లో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారులు పేరినాయుడు, కాటన్ శామ్యూల్‌తో బోర సూర్యనారాయణరెడ్డి(మధ్యలో)
టైగర్, కింగ్ కాంగ్, బొబ్బిలి పులి..ఇవి సినిమా పేర్లు..ఇవే అతనికి నిక్ నేమ్‌లు...ఈ పేర్లతో పిలిస్తేనే కిక్ ఉంటుందంటున్నారు ఆయన సన్నిహితులు. కట్ చేస్తే ఆయనొక 82 ఏళ్ల వెటరన్ క్రీడాకారుడు. 15 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. టెన్నిస్‌లో కూడా జాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పతకాలు సాధించాడు. బాడీ బిల్డింగ్‌లో కూడా లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు, పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆయనే మన భీమిలి దారాసింగ్ బోర సూర్యనారాయణ రెడ్డి. ఆయన బాట..ఆట ఈ నాటి క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి. ఆ క్రీడాకారుడి విజయప్రస్థానం తెలుసుకుందాం.
సాక్షి, తగరపువలస (భీమిలి): తిండి కలిగితె కండ కలదోయ్.. కండ గలవాడేను మనిషోయ్ అన్నారు మహాకవి గురజాడ. జవసత్వాలు నిండిన మనుషులే సుదృఢ భారత ఆకాంక్షలను నెరవేర్చగలుగుతారు. నిరాశా, నిస్పృహ, నిశ్శత్తువ నిండిన యువతరంలో క్రీడా స్ఫూర్తి, దేహదారుఢ్యం ప్రదర్శిస్తున్న వారిలో తగరపువలసకు చెందిన బోర సూర్యనారాయణరెడ్డి అనే 82 ఏళ్ల వెటరన్ క్రీడాకారుడు ముందంజలో ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఫుట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ క్రీడలలో కేరళ, ఒడిషా, మధ్యప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలలో జరిగిన పోటీలలో జాతీయస్థాయి పతకాలు సాధించారు. 15 ఏళ్లకే ఫుట్‌బాల్ తన ‘గోల్’ సాధించారు. ఈయన 1955 నుంచి 1970 వరకు ఫుట్‌బాల్‌లో జైత్రయాత్ర కొనసాగించారని చెప్పవచ్చు. అలాగే 1965 నుంచి 2000 వరకు టెన్నిస్‌లో కూడా విశేష ప్రతిభ కనపరిచారు. ఈ రెండు క్రీడలలోనూ పదుల సంఖ్యలో బంగారు పతకాలు, వందలాది రజక, కాంస్య పతకాలు అందుకున్నారు.
దేహదారుఢ్యంలో ఉక్కు మనిషి
యువకుడిగా ఉన్నప్పుడే ఆరడుగుల ఆజానుబాహుడుగా ఉండే సూర్యనారాయణరెడ్డి క్రీడలతో పాటు బాడీ బిల్డింగ్ పోటీలలో కూడా పతకాలు కొల్లగొట్టాడు. ఆయన దేహదారుఢ్యాన్ని చూసి పలువురు ముద్దుగా టైగర్, కింగ్ కాంగ్, బొబ్బిలి పులి అని పిలుచుకునేవారు. అప్పట్లో రూ.150లతో కొనుగోలు చేసిన బుల్ వర్కర్ ఆయన క్రీడాభివృద్ధికి, దేహదారుఢ్యానికి దోహదపడింది. వెండితెర దారాసింగ్‌ను చూసిన వారు అప్పటి నుంచి ఈయనను కూడా భీమిలి దారాసింగ్ అనేవారు. క్రీడాకారుడిగానే కాకుండా బాడీ బిల్డింగ్‌లో కూడా అనేక మంది సూర్యనారాయణరెడ్డి చూపిన మెలకువలు పాటించేవారు. క్రీడాకారుడిగా, బాడీ బిల్డర్‌గా ఈ ప్రాంతవాసులకు సుపరిచితమైన ఈయన ప్రస్తుతం వెటరన్ క్రీడాకారుడిగా కూడా పలు పతకాలు సాధించారు. గత ఏడాది వరకూ పోటీలు పాల్గొంటూ పతకాలు సాధించారు. అయితే గత కొంత కాలంగా పోటీలకు దూరంగా ఉంటున్నారు.
భార్య రమణమ్మ కూడా వెటరన్ క్రీడాకారిణే
భీమిలిలో కాంట్రాక్ట్ వర్కులు నిర్వహించే సూర్యనారాయణరెడ్డి పలువురు క్రీడాకారులకు ఇప్పటికీ మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. అంతే కాకుండా ఆయన భార్య రమణమ్మ (71) కూడా జాతీయ స్థాయి క్రీడాకారిణిగా పలు పతకాలు సాధిం చారు. గుంటూరు, బెంగళూరు, కేరళ వంటి రాష్ట్రాలలో భార్యాభర్తలు ఇరువురు కలిసి షార్ట్‌పుట్, జావెలిన్ త్రో, హేమర్ త్రో, డిస్క్ త్రో వంటి అథ్లెటిక్స్‌లో పదుల సంఖ్యలో బంగారు, రజత, కాంస్య పతకాలు వారి ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్యంపై గురి పెట్టాలి
ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఎంచుకున్న లక్ష్యంపై గురి పెట్టాలి. నిత్యం అదే తపస్సులా భావించాలి. వెళ్లే దారిలో పూలు, ముళ్లు రెండూ ఉంటాయి. పూల సువాసన ఆస్వాదిస్తూ..ముళ్లను దాటేయాలి. అప్పుడే లక్ష్యం చేరుకోగలం. ముఖ్యంగా క్రీడల్లో గెలుపోటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలి. ఓటమి చెందితే కుమిలిపోకూడదు. గెలుపుపై మరింత కసి పెంచుకోవాలి..గెలిచి తీరాలి. క్రీడాకారులు నిత్యం వ్యాయామం చేస్తే ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవు.
–బోర సూర్యనారాయణరెడ్డి, వెటరన్ క్రీడాకారుడు
Comments
Please login to add a commentAdd a comment