=సుప్రీం కోర్టు ఉత్తర్వులే కారణం
=టీచర్లకు నో వర్క్-నో పే అడ్డంకి
=13 వేల మంది నిరీక్షణ
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు సమ్మె కాలానికి జీతాల కోసం మరి కొన్నాళ్లు ఎదురు చూడక తప్పేలా లేదు. తెలంగాణ సమ్మె అనంతరం సుప్రీం కోర్టు జారీచేసిన ఉత్తర్వులే దీనికి కారణమని తెలుస్తోంది. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సమ్మె కాలాన్ని సెలవుల్లో బోధన ద్వారా భర్తీ చేస్తూ, జీతాలిచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జీవో నెం.31 పేరిట ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), న్యాయ విభాగం అనుమతికి ఫైల్‌ను పంపించారు.
ఇప్పటి వరకు తెలంగాణ సమ్మెలో పాల్గొన్న వారికి జీవో నెం.171 ప్రకారం జీతాలిచ్చేసిన విషయం తెలిసిందే. ఇవే ఉత్తర్వుల ఆధారంగా సీమాంధ్రలో కూడా ఉపాధ్యాయులకు జీతాలిచ్చేస్తారనుకున్నారు. అయితే తెలంగాణ సమ్మె తర్వాత సుప్రీం కోర్టు ‘నో వర్క్-నో పే’ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.177ను జారీ చేసింది. దీంతో తెలంగాణా ఉపాధ్యాయులకిచ్చిన జీవో నెం.171ను అమలు చేసే పరిస్థితి లేదు. దాంతో సమ్మె రోజుల్ని భర్తీ చేస్తూ విధులు నిర్వర్తించనున్న నేపథ్యంలో జీతాల చెల్లింపునకున్న అవకాశాలపై న్యాయపరంగా వివరణ కోరినట్టు తెలిసింది.
ఈ సమాచారం అందడానికి కనీసం పది రోజులు పడుతుందని సమాచారం. అప్పటి వరకు జీతాల కోసం జిల్లాలోని 16 వేల మంది ఉపాధ్యాయుల్లో సుమారు 13 వేల మంది నిరీక్షించక తప్పని పరిస్థితి ఉంది. మరోవైపున కొందరు ఉపాధ్యాయులు ఆగస్టు 22న, మరి కొందరు 26న సమ్మెలోకి వెళ్లడంతో ఆ కాలానికి జీతాలు చెల్లించేందుకు డీడీవోలకు అధికారముందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు సాక్షికి తెలిపారు. దాంతో బిల్లులు పెట్టిన వెంటనే జీతాలు మంజూరవుతాయని చెప్పారు.