No work - no pay
-
Fishermen: ‘వల’సి సొలసి
బరంపురం: రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది జీవితాలను కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్, షట్డౌన్లతో రోజువారీ కూలీలు, కొన్ని సంప్రదాయ వృత్తుల వారు పొట్టకూటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా అనాది కాలంగా చేపల వేటని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల పరిస్థితి అయితే మరీ దారుణం. కరోనా నిబంధనలు అతిక్రమిస్తూ వేట కొనసాగించలేని వారంతా ఇప్పుడు ఇంటికే పరిమితమై, ఆకలితో పస్తులుంటున్నారు. కొంతమంది తీరం వైపు చూస్తూ తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తావమని సముద్ర దేవునికి దండం పెట్టుకుంటున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, వేటకు వెళ్తే కానీ ఆ రోజు కాలం గడవదని, ఈ పరిస్థితుల్లో తామెలా బతకాలని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి, తమకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 475 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న గంజాం జిల్లాలో సూన్‌పూర్ నుంచి చందిపూర్ వరకు దాదాపు 108 మత్స్యకార గ్రామాలు ఉండగా, ఆయా గ్రామాల్లోని 15 వేల కుటుంబాలు చేపల వేటని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ఆదుకోవాలని పలు మత్స్యకార సంఘాల ప్రతినిధులు జి.ఎర్రయ్య, టి.సింహాద్రి, జి.పాపారావు తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సమ్మె జీతాలు జాప్యం?
=సుప్రీం కోర్టు ఉత్తర్వులే కారణం =టీచర్లకు నో వర్క్-నో పే అడ్డంకి =13 వేల మంది నిరీక్షణ సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు సమ్మె కాలానికి జీతాల కోసం మరి కొన్నాళ్లు ఎదురు చూడక తప్పేలా లేదు. తెలంగాణ సమ్మె అనంతరం సుప్రీం కోర్టు జారీచేసిన ఉత్తర్వులే దీనికి కారణమని తెలుస్తోంది. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సమ్మె కాలాన్ని సెలవుల్లో బోధన ద్వారా భర్తీ చేస్తూ, జీతాలిచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జీవో నెం.31 పేరిట ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), న్యాయ విభాగం అనుమతికి ఫైల్‌ను పంపించారు. ఇప్పటి వరకు తెలంగాణ సమ్మెలో పాల్గొన్న వారికి జీవో నెం.171 ప్రకారం జీతాలిచ్చేసిన విషయం తెలిసిందే. ఇవే ఉత్తర్వుల ఆధారంగా సీమాంధ్రలో కూడా ఉపాధ్యాయులకు జీతాలిచ్చేస్తారనుకున్నారు. అయితే తెలంగాణ సమ్మె తర్వాత సుప్రీం కోర్టు ‘నో వర్క్-నో పే’ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.177ను జారీ చేసింది. దీంతో తెలంగాణా ఉపాధ్యాయులకిచ్చిన జీవో నెం.171ను అమలు చేసే పరిస్థితి లేదు. దాంతో సమ్మె రోజుల్ని భర్తీ చేస్తూ విధులు నిర్వర్తించనున్న నేపథ్యంలో జీతాల చెల్లింపునకున్న అవకాశాలపై న్యాయపరంగా వివరణ కోరినట్టు తెలిసింది. ఈ సమాచారం అందడానికి కనీసం పది రోజులు పడుతుందని సమాచారం. అప్పటి వరకు జీతాల కోసం జిల్లాలోని 16 వేల మంది ఉపాధ్యాయుల్లో సుమారు 13 వేల మంది నిరీక్షించక తప్పని పరిస్థితి ఉంది. మరోవైపున కొందరు ఉపాధ్యాయులు ఆగస్టు 22న, మరి కొందరు 26న సమ్మెలోకి వెళ్లడంతో ఆ కాలానికి జీతాలు చెల్లించేందుకు డీడీవోలకు అధికారముందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు సాక్షికి తెలిపారు. దాంతో బిల్లులు పెట్టిన వెంటనే జీతాలు మంజూరవుతాయని చెప్పారు.