భర్త కోసం మౌనపోరాటం
వాళ్లిద్దరిదీ అన్యోన్య దాంపత్యం.. వాళ్ల సంసారం కొన్నేళ్లపాటు ఆనందంగా సాగింది. చిన్న చిన్న మనస్పర్ధలే వారి మధ్య ఎడబాటుకు కారణయ్యాయి. సర్ది చెప్పాల్సిన పెద్దలు కూడా ఆమెకు అన్యాయం చేశారు. వారు కూడా భర్త వైపే మాట్లాడటంతో పాపం ఆ అభాగ్యురాలు మూడేళ్ల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఇప్పుడు నా మొగుడు నాక్కావాలంటూ ఆమె మౌనపోరాటానికి దిగింది. అమెకు మహిళా సంఘాల వారు అండగా నిలిచారు.
- ప్రొద్దుటూరు క్రైం
ఓ భార్య మౌన పోరాటం
ప్రొద్దుటూరు శ్రీరాములపేటకు చెందిన కూరగాయల వ్యాపారి షంషీర్ కుమార్తె గౌసియా వివాహం 2008వ సంవత్సరంలో రాజాజీరోడ్డు ప్రాంతానికి చెందిన ఎస్‌ఎండీ కరీముల్లా అనే డాక్టర్‌తో అయింది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్ జనరల్ సర్జన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో గౌసియా తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ.12 లక్షల నగదుతో పాటు 45 తులాల బంగారాన్ని ఇచ్చారు. వారికి మున్నీ సాదిన్ అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. కొన్నేళ్ల వరకు వారి సంసారం సజావుగా సాగింది.
చిన్న చిన్న సమస్యలే పెద్ద అగాధంగా...
ఆ తరువాత చిన్న చిన్న సమస్యలు తలెత్తి పెద్ద అగాధం ఏర్పడింది. నలుగురు ఆడపడచులు, ఒక మరిది ఉండగా, తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో గౌసియా నెల తప్పింది. అదే సమయంలో ఆడబిడ్డ కూడా నెల తప్పింది. ఇంట్లో పనులు చేయడానికి ఇబ్బందిగా ఉందని బలవంతంగా తనకు అబార్షన్ చేయించారని గౌసియా కన్నీటిపర్యంతమయ్యారు. భర్తతో పాటు అత్తింటి వారిపై 2011 నవంబర్ 26న కడప మహిళా పోలీస్ స్టేషన్‌లో గౌసియా ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, మామతో పాటు నలుగురు ఆడపడచులపై 26/11 క్రైం నెంబర్ కింద కేసు నమోదైంది.
భర్త, మామకు జైలు శిక్ష ఖరారు
ఈ ఏడాది జూన్ 20న భర్త కరీముల్లా, మామ ఖాసీంపీరాకు కోర్డు ఏడాది జైలు శిక్ష విధించింది. ఆ తరువాత బాధితురాలు ప్రొటెక్షన్ ఆర్డర్, భరణం కావాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గౌసియాకు తలాక్ ఇచ్చినట్లు కరీముల్లా కుటుంబ సభ్యులు అంటున్నారు. తర్వాతనే ఆమెకు నెలకు రూ.6 వేలు భరణం చెల్లిస్తున్నామని వారు చెబుతున్నారు. తన ప్రమేయం లేకుండా తలాక్ ఇచ్చారని గౌసియా ఆవేదన వ్యక్తం చేస్తోంది. తలాక్ నోటీసులో తాను సంతకాలు చేయలేదని తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.
కోర్టులో కేసు నడుస్తుండగానే రెండో పెళ్లికి...
కోర్టులో కేసు నడుస్తుండగనే తన భర్త రెండో పెళ్లికి ప్రయత్నం చేస్తున్నాడని గౌసియా నాలుగు రోజుల కిందట ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తన భర్తకు వచ్చే ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లులో రెండో పెళ్లి జరుగుతోందని సమాచారం అందడంతో భర్త ఇంటి ఎదుట మంగళవారం నుంచి ఆమె మౌనపోరాటానికి కూర్చున్నారు. విష యం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు తరలివచ్చారు. గౌసియాకు న్యాయం జరిగే వరకు ఇక్క డి నుంచి కదిలేది లేదని భీష్మిం చారు. కరీముల్లా హైదరాబాద్ నుం చి బుధవారం ఉదయం వస్తాడని చెప్పినా ఆమె వినిపించుకోలేదు.
అంత వరకూ ఇక్కడే అన్నపానీయాలు ముట్టుకోకుండా కూర్చుం టానంటూ గౌసియా గద్గద స్వరంతో అన్నారు. తనకు పెళ్లి అయ్యేనాటికి భర్తకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని, కట్నం డబ్బులతో అప్పులు తీర్చుకున్నాడని గౌసియా వివరిం చింది. తనకు భర్తే కావాలని ఆమె అంటోంది. అక్కడికి వచ్చిన మహిళందరూ కరీముల్లా ఫొటోను చూపి స్తూ నిరసన తెలిపారు. దీంతో రాకపోకలు నిలిచి పోగా పోలీసుల రాక తో వారు రోడ్డుపై నుంచి కరీముల్లా ఇంటి ప్రాంగాణానికి మారారు.