నీటిలో గల్లంతైన విద్యార్థి.. శవమై తేలాడు..
మార్కాపురం టౌన్ : మార్కాపురం చెరువులో గురువారం రాత్రి ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థి రాంజీనాయక్ శుక్రవారం ఉదయం 9 గంటలకు శవమై తేలాడు. బాలుని ఆచూకీ కోసం వేములకోట జాలర్లు, అగ్నిమాపక సిబ్బంది గురువారం రాత్రి 2 గంటల వరకు ప్రయత్నించినా ప్రయోజనం లేని విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా 9 గంటల సమయంలో జాలర్ల వలలకు బాలుని మృతదేహం చిక్కుకుంది. వెంటనే గుర్తించిన జాలర్లు మృతదేహాన్ని బయటకు తీశారు.
విద్యార్థి మృతికి హాస్టల్ వార్డెన్ పిచ్చయ్య ప్రధాన కారణమని మృతుని బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. కొద్దిసేపు ఆందోళన నిర్వహించగా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు సరస్వతి వచ్చి మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇవ్వటంతో ఆందోళన సద్దుమణిగింది. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. డీఎస్పీ శ్రీహరిబాబు, తహశీల్దార్ నాగభూషణం, సీఐ కరుణాకర్, ఎస్సై శ్రీహరి, ఏఎస్‌డబ్ల్యూఓ దిబ్బయ్యలు అక్కడే ఉండి పర్యవేక్షించారు.