విద్యార్థి శక్తి జాతీయ శక్తి | student power is national power | Sakshi
Sakshi News home page

విద్యార్థి శక్తి జాతీయ శక్తి

Published Thu, Jan 30 2014 3:22 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

student power is national power

కామారెడ్డి, న్యూస్‌లైన్:  విద్యార్థి శక్తి అంటే జాతీయ శక్తి అని, తెలంగాణ విద్యార్థుల శక్తి ముందు ఏ శక్తీ నిలువజాలదని తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా నంది ని సిధారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ విద్యార్థి శక్తి సముద్రం కన్నా గొప్పదన్నారు. రాజకీయ నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన విద్యార్థి శక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిందన్నారు. తెలంగాణ తల్లి సంకెళ్లను తెంపడానికి విరోచిత పోరాటాలు జరిపిన విద్యార్థులే హీరోలన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.

ఇన్నేళ్లు ఎన్నో అవకాశాలు కోల్పోయిన విద్యార్థులకు ప్రత్యేక రాష్ర్టంలో న్యాయం జరుగుతుందన్నారు. సీమాంధ్ర నాయకుల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.  ఇన్నేళ్లుగా మన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు ఏ పుస్తకంలో లేవని, తెలంగాణ రాష్ట్రంలో వీటినన్నింటిని సాధించుకోవాల్సి ఉందన్నారు.

 ఆందోళన వద్దు -కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
 పదమూడేళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతోందని, ఆందోళన వద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. వచ్చే రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన అన్యాయాలను సరిచేసుకోవాల్సి ఉందన్నారు. సీమాంధ్ర పాలకులు కొల్లగొట్టిన రెండు లక్షల ఉద్యోగాలను పొందాలన్నారు.

విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలని, తద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. పుస్తకాలనే కాక ప్రపంచాన్ని చదవాలని, సమాజాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని ఆమె  సూచించారు. సమైక్యవాదులది పైసల ఉద్యమమని, తెలంగాణది ప్రజల ఉద్యమమన్నారు. అనంతరం  టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, డీసీఎం ఎస్ చైర్మన్ ఎంకే ముజీబొద్దిన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు తిర్మల్‌రెడ్డి, భూంరెడ్డి, సుమిత్రానంద్, బాబూరావ్, మల్లేశ్‌యాదవ్, నవీనాచారి, విఠల్‌రావ్, సుమంత్, చంద్రశేఖర్‌రెడ్డి, పార్శి కాంశెట్టి, ముస్తాక్, బూక్య నర్సింలు, యాదవరెడ్డి, రాజిరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.  సభకు ముందు విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement