
ఇరుకు గదులు.. వసతికి మించిన విద్యార్థులు.. కనిపించని ల్యాబ్‌లు.. మానసికోల్లాసానికి కరువైన మైదానాలు.. ఇదీ జిల్లాలో నారాయణ కళాశాలల దుస్థితి. ‘40 ఇయర్స్ ఎక్స్‌లెన్సీ’ ‘నారాయణ ప్రతిభకు పట్టం’ నినాదాలతో తల్లిదండ్రులను బురిడీ కొట్టించడం వాటికి వెన్నతోపెట్టిన విద్య. లాభాపేక్షే ధ్యేయంగా.. కనీస సదుపాయాలకు దూరంగా కళాశాలలు నెట్టుకురావడం ఆ యాజమాన్యానికే చెల్లుతోంది. ప్రతిభ పక్కనబెడితే బట్టీ చదువులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తీవ్ర ఒత్తిడిని భరించలేక.. అధిక ఫీజులు చెల్లించలేక విద్యార్థులు మానసికంగా కుంగిపోవడం సర్వసాధారణమవుతోంది. తల్లిదండ్రులను ఒప్పించలేక.. విద్యాసంస్థ పెట్టే వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు.
సాక్షి, తిరుపతి : నారాయణ కళాశాలల యాజమాన్యం ఒత్తిడి భరించలేక విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బట్టీ చదువులతో కుస్తీ మినహా మానసిక పరివర్తనకు చొరవ చూపడం లేదనే ఆరోపణలున్నాయి. కళాశాలలు 8 వేల చ.అ. విస్తీర్ణంలో 20 శాతం పార్కింగ్ స్థలం ఉంచాలని నిబంధనలు వివరిస్తున్నాయి. 20/20 చ.అ. విశాలమైన గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసించేందుకు కూర్చోగలరని చట్టాలు చెబుతున్నాయి. మానసిక ఆటవిడుపు కోసం కచ్చితంగా ఆటస్థలం ఉండాలి. విద్యార్థులు మైరుగైన లక్ష్యాల కోసం ల్యాబ్‌లు తప్పనిసరి. ఇవేమీ ‘నారాయణ’ విద్యా సంస్థల్లో కనిపించవని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నారాయణ రెసిడెన్షియల్ ఇంటర్మీడియెట్ క్యాంపస్‌లు 8 ఉన్నాయి. వీటి పరిధిలో 7,330 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ విద్యనభ్యసిస్తున్నారు. ఆయా కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
వరుస వివాదాల్లో విద్యాసంస్థలు
ఇటీవల నారాయణ కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. తిరుపతి గాంధీరోడ్డులో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థి ఫీజు చెల్లించలేదని సోమవారం ఏకంగా విద్యార్థి తండ్రి గోవిందురెడ్డిపై యాజమాన్యం దాడికి దిగింది. ఫీజుల కోసం విద్యార్థులను అవమానాలపాలు చేయడం ఏమాత్రం సరైంది కాదని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. మంగళవారం రేణిగుంట నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్ విద్యనభ్యసిస్తున్న గోరంట్లకు చెందిన మహేంద్రరెడ్డి(16) ఆత్మహత్యకు యత్నించాడు. యాజమాన్యం ఒత్తిడి భరించలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. సకాలంలో సహచర విద్యార్థులు పసిగట్టడంతో మహేంద్రరెడ్డి ప్రాణాలు దక్కాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆటవిడుపు లేకపోవడమే అందుకు కారణమని నిపుణులు భావి స్తున్నారు.
ఇరుకు గదులు.. తీవ్రమైన ఒత్తిడి
రేణిగుంట నారాయణ కళాశాల విద్యార్థులకు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. వసతికి మించి విద్యార్థులను గదుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. మొదటి సంవత్సరం విద్యార్థులు 342 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 270 మంది ఉన్నారు. 612 మందికి కేవలం 40 గదులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. సరాసరిగా గదికి 15 మంది విద్యార్థులను హాస్టల్లో ఉంచినట్లు సమాచారం. విద్యార్థుల మంచాల మధ్య ఎలాంటి ఖాళీ స్థలం లేదు. మధ్యలో ఉన్న దారి నుంచి నేరుగా మంచంపైకి ఎక్కేందుకే మార్గముంది. తరగతి గదులు సైతం ఇరుకుగానే ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
నాడు మంత్రిగా అలాంటి ప్రకటనలే..
టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి హోదాలో నారాయణ సింగపూర్ తరహాలో రాజధాని నిర్మిస్తామని ఆర్భాటపు ప్రకటనలతో ఐదేళ్లు నెట్టుకొచ్చారు. ఆచరణలో రిక్తహస్తం చూపించారు. తన కళాశాలల్లో సైతం ఉన్నత ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా రోజూ 14గంటలు బట్టీ చదువులతో కుస్తీ మినహా విద్యార్థుల్లో మానసిక పరివర్తనకు చొరవ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగు గోడలు మధ్య కంఠస్థ పాఠాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆటవిడుపు కోసం ఆట స్థలమే లేదు. 612 మంది విద్యార్థులున్న క్యాంపస్‌లో కనీస ఆటవిడుపు లేకపోవడం తీవ్రమైన మానసిక ఒత్తిడికి విద్యార్థులు గురవుతున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇదిలాఉంటే విద్యార్థులకు మెరుగైన ఫలితాల కోసం కనీసం ల్యాబ్‌లు ఉంచాలనే దిశగా నారాయణ యాజమాన్యం ఆలోచించలేదు. సామాన్యులకు నిబంధనల పేరుతో వేధించే అధికారగణానికి ‘నారాయణ’ పరపతి ముందు ఇవేమీ కనిపించడం లేద నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠాలు చెప్పడంలోనే సెక్షన్లు విధిస్తూ విద్యార్థులను మానసిక వేదనకు గురిచేస్తున్నట్లు సమాచారం. మార్కులు అత్యధికంగా వచ్చిన వారి పేర్లతో ప్రచారం నిర్వహించే లాభాపేక్ష ఎత్తుగడ మినహా విద్యార్థులకు కనీస వసతులు ఉండాలనే సంకల్పం లేదని పలువురు వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని విద్యార్థి సంఘాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. విద్యాలయాలను లాభాపేక్షతో కాకుండా పవిత్ర ఆలయాలు చూడాలని పలువురు కోరుతున్నారు.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
రేణిగుంట : నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన ఎం.నరసింహారెడ్డి కుమారుడు మహేంద్రరెడ్డి(16) రేణిగుంట సమీపంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తన గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అప్పటికే అటుగా వెళుతున్న తోటి విద్యార్థులు గుర్తించి అతన్ని సురక్షితంగా కాపాడారు. విషయం కళాశాల యాజమాన్యానికి తెలిపారు. తోటి విద్యార్థులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు కళాశాలకు చేరుకుని మహేంద్రరెడ్డిని విచారించారు. 10వ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించిన అతడు కళాశాలలో ఇంటర్నల్‌గా జరిగిన వీక్లీ పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడాన్ని అవమానంగా భావించాడు. దీనికితోడు తోటి విద్యార్థులు కొందరు హేళనగా మాట్లాడడంతో జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులతో చెప్పారని తెలుస్తోంది. విచారణ అనంతరం పోలీసు సిబ్బంది అక్కడ నుంచి వెళ్లిపోయి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించిన మహేంద్రరెడ్డిని కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ వెంటనే ఓ అటెండర్‌ను జతచేసి బలవంతంగా అతని స్వగ్రామం గోరంట్లకు పంపేయడం అనుమానాలకు తావిస్తోంది.
గతంలోనూ ఆత్మహత్య
ఈ కళాశాలలో మూడేళ్ల కిందట ఓ విద్యార్థి యాజమాన్యం వేధింపులు తాళలేక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనతో అప్పట్లో యాజమాన్యాన్ని నిందిస్తూ విద్యార్థులు కళాశాలలో భవన కిటికీలు పగులగొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘాలు కూడా పెద్దస్థాయిలో ఆందోళనలు చేశాయి. అయితే అప్పట్లో మంత్రి నారాయణ కేసును పూర్తిగా నీరుగార్చి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కుటుంబానికి అన్యాయం చేశారు. ఈ ఘటన తర్వాత కూడా అనేకమార్లు కళాశాల యాజమాన్యం, లెక్చరర్ల వేధింపులు తాళలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినా, సమాచారం బయటకు పొక్కకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. నారాయణ విద్యాసంస్థలలో విద్యార్థులకు రక్షణ కరువవుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment