ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, తమకు విద్యేతర పనులతో విద్యకు దూరం చేస్తున్నారని ఓ వైపు విద్యార్థులు, మరోవైపు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాలకులు తమ ప్రచార ఆర్భాటాల కోసం పాఠశాల విద్యార్థులను వినియోగించడం ద్వారా తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని విద్యార్థులే ఆరోపిస్తున్నారు. సాధించేది ఏమీ లేకున్నా...ఏదో ఒక ప్రచారం పేరిట చదువుకు దూరం చేస్తూ తమ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రామభద్రపురం: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని పాలకులు ప్రకటనలు చేస్తూనే మరోవైపు ప్రణాళికాబద్దంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ పాఠశాలలను బలోపేతం చేసే ఆలోచన చేస్తుంది. దీంతో పేద, మధ్యతరగతులకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కంటే ప్రభుత్వ పథకాల ప్రచారానికే ఎక్కువగా ఆర్భాటం చేస్తూ సాధించేదేమి లేకున్నా తమ పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంకోవైపు ఉపాధ్యాయులను పాఠ్యాంశాల బోధనకు దూరం చేస్తూ ఏదో ఒక శిక్షణ పేరిట పాఠశాలలకు దూరం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
జిల్లాలో 2817 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో దాదాపుగా 2లక్షల 10 వేల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి సుమారుగా 12 వేల మంది టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. జిల్లాలో 740 పాఠశాలలో ఏకోపాధ్యాయులు, 70 శాతం పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏకోపాధ్యాయులు ఉన్నచోట ఒక్క టీచరు ఉండకుండా బోధనేతర పనులకు చేయడం, ఇద్దరు ఉన్న చోట ఒకరు బోధనేతర పనులకు వెళ్తే ఒక్కరే మొత్తం ఐదు తరగతులకు చదువులు చెప్పడం కష్టతరంగా ఉందని ఉపాధ్యాయ వర్గాల భావించగా, సకాలంలో సిలబస్‌లు కాక సామర్ధ్యాలపై ఆ ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ప్రచార పటాటోపం...
దోమలపై దండయాత్ర, వనం–మనం, పరిసరాల పరిశుభ్రత ర్యాలీలు, పెద్దవారు ఎవరైనా వచ్చినపుడు, నిరక్షరాస్యత నిర్మూలన చేసేందుకు చిట్టిగురువులు వంటి పలు ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వం విద్యార్థులనే ఉపయోగిస్తుంది. వీటితో తమ చదువులు కుంటుపడుతున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వం విద్యార్థులను ఓడీఎఫ్ భాగస్వా మ్యం చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛభారత్ పేరిట ప్రాజెక్టులు తప్పనిసరి చేసింది. మరోవైపు బయోమెట్రిక్ పేరిట యంత్రాల ముందు గంటల తరబడి నిలబడేలాచేసి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించే యత్నం చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓడీఎఫ్ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థులకు పెర్ఫార్మన్స్ కింద 5 మార్కులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వాటికోసం ఆలోచిస్తే తమ సామర్ధ్యాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అక్షర విజయం ద్వారా వయోజనులకు చదువు నేర్పించే వారని ఇప్పుడు అలాకాకుండా చిట్టి గురువులు కార్యక్రమం పెట్టి 6, 7, 8 తరగతులలో బాగా చదువుతున్న పిల్లలను గుర్తించి వారితో చదువులు చెప్పించడం వల్ల వారు రాత్రి వేళల్లో చదవక విద్యా సామర్ధ్యం దెబ్బతింటుందని, సరిగా విద్యాబోధన లేని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ఎందుకు చేర్పించామా?అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment