బొబ్బిలి: రాష్ర్టం కాని రాష్ర్టం వారిది... బొబ్బిలి సమీపంలో ఉన్న మదర్సాలో మూడేళ్లుగా చదువుతున్నారు. శుక్రవారం వారి పాఠశాలకు సెలవు కావడంతో వారం రోజులకు సరిపడిన వస్తువులు కొనడానికి సైకిల్‌పై ఉదయాన్నే బొబ్బిలి పట్టణానికి వచ్చారు. పనులు చూసుకొని సైకిల్‌పై తిరిగి మదర్సాకు వెళుతుండగా బొబ్బిలి నుంచి రామభద్రపురం వైపు వెళుతున్న కంటైనర్ ఢీకొనడంతో ఒకరు అక్కడకక్కడే మృతి చెందగా, మరొకరు మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. సెలవు రావడమే వారికి శాపంగా మారిందని అక్కడ వారు రోధించారు. సైకిల్‌ను ఢీకొన్న లారీ, కింద పడిన విద్యార్థిని దాదాపు 300 మీటర్ల వరకూ ఈడ్చుకొని వెళ్లిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ర్టంలోని రాయగడకు చెందిన షేక్ అబ్దుల్లా (12), జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సనావుల్లా ( 12) మూడేళ్లుగా బొబ్బిలి పట్టణ శివారున ఐటీఐ కాలనీ సమీపంలో ఉన్న మదర్సా ఉర్ధూ పాఠశాలతో చదువుతున్నారు.
ఈ పాఠశాలలో దాదాపు 70 మంది విద్యార్థులు ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకుంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లిం బాలబాలికలు వీటిని నేర్చుకోవడానికి ఇక్కడకు వస్తుంటారు. వీరికి ప్రతీ శుక్రవారం సెలవు. దాంతో వారి వ్యక్తిగత అవసరాలను తీర్చుకోడానికి, సామగ్రి కొనుగోలుకు విద్యార్థులు బొబ్బిలి పట్టణానికి, ఇటు ఐటీఐ కాలనీ వద్దకు వస్తుంటారు. అదే విధంగా అబ్దుల్లా, సనావుల్లాలు కూడా మదర్సాకు చెందిన సైకిల్ తీసుకొని బొబ్బిలి పట్టణానికి వచ్చారు. ఉదయం పది గంటల సమయంలో వారిద్దరూ తిరిగి వెళుతుండగా బొబ్బిలి నుంచి విశాఖపట్నం స్టీల్ పైప్‌లతో వెళుతున్న కంటైనర్ ఢీకొట్టింది. సైకిల్ తొక్కుతున్న అబ్దుల్లా వెనుక చక్రాల కింద పడిపోయాడు. డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో దాదాపు 300 మీటర్ల వరకూ కంటైనర్ ఆ బాలుడిని ఈడ్చుకువెళ్లింది. దీంతో ఆ ప్రదేశమంతా రక్తంతో నిండిపోయింది. సైకిల్ వెనుక కూర్చున్న సనావుల్లా రోడ్డుపై పడడడంతో కుడి కాలు కింద బాగమంతా నుజ్జు నుజ్జయింది.
తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు 108 వాహనాన్ని సమాచారం అందించినా అందుబాటులోకి రాలేదు. దాదాపు 15 నిమిషాలకు పైగా సనావుల్లా రోడ్డుపైనే ఉండిపోయాడు. అటుగా వస్తున్న చెత్తతో నిండి ఉన్న మున్సిపల్ ఆటోను ఆపి సనావుల్లాను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అక్కడ నుంచి విశాఖ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఎస్‌ఐలు ప్రసాద్, నాయుడు, ట్రాఫిక్ ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ రూర్కెల నుంచి విశాఖకు స్టీల్ పైప్‌లను తీసుకువెళుతోంది. ఆ లారీలో మద్యం సీసాలు లభ్యమవడంతో డ్రైవరు మద్యం మత్తులో ఉండి ఈ ప్రమాదానికి కారకుడయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు డ్రైవరుకు దేహశుద్ధి చేశారు. మృతుల బంధువులకు సమాచారం అందించగా, సాయంత్రానికి ఆబ్దుల్లా తల్లిదండ్రులు బొబ్బిలి చేరుకున్నారు.
స్పందించిన పాత్రికేయులు
లారీ చక్రాల కింద మృతదేహం ఇరుక్కోవడంతో ఎలా బయటకు తీయాలో ఎవరికీ అర్థకాలేదు. కనీసం తీయడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. మరికొందరు అయ్యో అంటూ చూస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో కొందరు పోలీసులుండగా, మృతదేహాన్ని బయటకు ఎలా తీయాలని మరికొందరు ఆలోచన చేస్తున్నారు.. ఇనుప పైప్‌ల లోడుతో ఉండే లారీని ఎలా కదిపి మృతదేహాన్ని బయటకు తీయాలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఈలోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న విశాఖ సమాచారం విలేకరి జవ్వాది మల్లేశ్వరరావు, ప్రజాశక్తి విలేకరి ఆర్ జగదీష్‌లు వెంటనే స్పందించారు. తాము మృతదేహాన్ని బయటకు తీస్తుంటాం...నెమ్మదిగా లారీని వెనక్కి పంపడంటూ సూచించి ఆ కార్యక్రమానికి ముందుకు వచ్చారు. దీంతో లారీ టైరు కింద పడి నుజ్జయిన మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. ఇద్దరు పాత్రికేయులు చూపిన చొరవకు స్థానికులు, బొబ్బిలి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కందుల శ్రీనివాసరావు అభినందించారు.
శాశ్వత సెలవు !
Published Sat, Mar 28 2015 3:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
Advertisement