యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీ యూనివర్సిటీలో మెస్‌లు మూసివేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం రాత్రి వీసీ బంగ్లాను ముట్టడించారు. ఎస్‌వీయూలోని అనుబంధ హాస్టళ్ల మెస్‌లను మంగళవారం మూసివేశారు. ఇప్పటికే మహిళా హాస్టళ్లలోని విద్యార్థులను బలవంతంగా ఇంటికి పంపారు. తాజాగా మెన్స్ హాస్టళ్లనూ మూసివేశారు. దీన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో వీసీ బంగ్లాను ముట్టడించారు. బంగ్లాలోకి చొరబడే ప్రయత్నం చేశారు. గేట్లను తోసివేశారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థులు బంగ్లా గేట్ వద్ద పడుకుని నిరసన తెలిపారు. ఆందోళనకారులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు వీసీ కుట్రపన్నారని ఆరోపించారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డెరైక్షన్‌లో వీసీ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం సొంత జిల్లాలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉద్యమాలకు వేదికైన ఎస్‌వీయూలో మెస్‌లు మూసివేయడం ద్వారా ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వర్సిటీ అధికారులే మెస్‌లు నడిపి తెలంగాణ ఉద్యమానికి సహకరించారని తెలిపారు. ఎస్‌వీయూ అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారన్నారు. మెస్‌లు తెరుస్తామని వీసీ ప్రకటన చేసే వరకు కదిలేది లేదని బంగ్లా గేటు వద్ద పడుకున్నారు. వీసీ రాజేంద్ర విద్యార్థులతో చర్చించారు. మెస్‌లు మూసివేసే అంశం తనకు తెలియదని చెప్పారు. వీసీ సమాధానంతో సంతృప్తి చెందని విద్యార్థులు ‘మీకు తెలియకుండా ఎలా మూసివేస్తారని’ ప్రశ్నించారు. స్పందించిన రాజేంద్ర బుధవారం సంబంధిత అధికారులతో మాట్లాడి మెస్‌లు తెరిపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శేషాద్రినాయుడు, ఆనంద్ గౌడ్, వి.వెంకటరమణ పాల్గొన్నారు
మెస్‌లు మూసివేయడాన్ని నిరసిస్తూ వీసీ బంగ్లా ముట్టడి
Published Wed, Aug 7 2013 4:31 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement