రాజధానిలో వేర్వేరు ఘటనల్లో బీటెక్, బీఎస్సీ విద్యార్థుల ఆత్మహత్య
ఒత్తిడికి గురవుతున్న స్టూడెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఇష్టంలేని కోర్సులు.. కొండలా సిలబస్.. పుస్తకాలతో కుస్తీ పట్టలేక.. కన్నవారి కలలను నిజం చేయలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అర్థంకాని పాఠాలు.. అంతుచిక్కని సిలబస్.. వరుస పరీక్షలు.. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడులు.. వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇదే క్రమంలో మంగళవారం నగరంలో బీటెక్, బీఎస్సీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వేర్వేరు సంఘటనల్లో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ఇద్దరూ తల్లిదండ్రులు తమను క్షమించాలని, చదువులో రాణించలేక పోతున్నానని, తరచూ ఫెయిల్ అవుతున్నామని సూసైడ్ నోట్ రాసి చనిపోవడం గమనార్హం. ఉన్నత చదువులు చదువుతున్న పలువురు విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల సామాజిక వేత్తలు, విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లల చదువుల కోసం పుట్టెడు అప్పులు చేసిన తల్లిదండ్రులు..చేతికంది వస్తారనుకున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.
సారీ మమ్మీ.. డాడీ..!
‘సారీ మమ్మీ.. డాడీ.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌నోట్ రాసి అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా, శ్రీశైలంకు చెందిన ఖాసింపీరా, ముంతాజ్‌ల కుమారుడు షేక్ రహీవుుద్దీన్(23) రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. వర్సిటీ హాస్టల్‌లోని సి-బ్లాక్ 173 రూమ్‌లో ఉంటున్న రహీం సోమవారం రాత్రి రూమ్‌కు వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో స్నేహితులు రూమ్‌లో చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. రహీం రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. రహీవుుద్దీన్‌కు అగ్రి బీఎస్సీ సెకెండియర్ కీటకశాస్త్రం సబ్జెక్టు బ్యాక్‌లాగ్ ఉంది. ఆ ఆందోళనతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా రహీం మృతదేహంపై పడి అతని తల్లిదండ్రులు రోదించిన తీరు విద్యార్థులను కంటతడి పెట్టించింది.
ఓర్పు లేకపోవడమే కారణం
ముఖ్యంగా 18 నుంచి 23 ఏళ్లలోపు పిల్లల్లో ఓర్పు, ఓపిక మచ్చుకైనా కనిపించడం లేదు. తాము అనుకున్నవి అప్పటికప్పుడు క్షణాల్లో జరిగిపోవాలని భావిస్తున్నారు. తమ ఆలోచనలకు, అంచనాలకు భిన్నంగా జరిగితే జీర్ణించుకోలేకపోతున్నారు. టీనేజ్ పిల్లల ఆత్మహత్యలకు మరో ప్రధాన కారణం సూడోఫ్రెండ్‌షిప్. తప్పుడు అభిప్రాయాలతో స్నేహితులను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. జీవితంలోని లక్ష్యాన్ని, ఆశయాన్ని తక్కువ టైమ్‌లో చేరుకోవాలనే దృక్పథం నుంచి పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల బారి నుంచి యువతను కాపాడుకోగలుగుతాం.
-డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్
చదవలేక చనిపోతున్నా...
‘చదవలేకపోతున్నా.. చనిపోతున్నా’ అని తల్లిదండ్రులనుద్దేశించి సూసైడ్‌నోట్ రాసి వురో బీటెక్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన సింగరేణి ఉద్యోగి యూకూబ్ కుమారుడు అరాఫత్ (21). మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ స్థానిక భారత్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. చదువులో వెనకబడటంతో మొదటి, ద్వితీయ సంవత్సరాల పరీక్షల్లో కొన్ని సబ్జెక్ట్‌లు తప్పాడు. ఇతనితో పాటు హాస్టల్ గదిలో ఉంటున్న ముగ్గురు స్నేహితులు సొంతూళ్లకు వెళ్లగా.. అరాఫత్ ఒక్కడే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. సోమవారం భోజనం చేసి గదికి వెళ్లి పడుకున్నాడు. మంగళవారం ఉదయం టిఫిన్ చేయడానికి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకుడు వెళ్లి చూడగా తాడుతో ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఆరాఫత్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. ‘చదవడం కష్టంగా ఉండడం వల్లే చనిపోతున్నా.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని అందులో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి వుృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.