విద్యార్థులతో ఎన్నికల వెబ్‌కాస్టింగ్
Published Thu, Feb 27 2014 1:34 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్:వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను చేపట్టే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించ నున్నామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ చెప్పారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు, ఎన్నికల నియమావళి కమిటీ, మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనట రింగ్ కమిటీ, వ్యయ పరిశీలన కమిటీ, ఇతర కమిటీల నోడల్ అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ జిల్లాలో 2,450 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలోని కొన్నిచోట్ల వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేపడతామని, మిగిలిన కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకులు ఉంటారని చెప్పారు. వెబ్‌కాస్టింగ్ విధులు నిర్వహించే వారికి తగిన పారితోషికం అందిస్తామ ని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి అనుభవం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లాకు 5080 ఈవీఎంలు అవసరం కాగా ఇప్పటివరకు ఐదువేలు వచ్చాయని చెప్పారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పోలింగ్‌కు అవసరమైన సెక్టార్, రూట్, ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది జాబితాను సిద్ధం చేయాలని, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. మాక్ పోలింగ్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్, ఫిర్యాదు సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల సమాచారం, ఫిర్యాదుల కోసం 24 గంటలూ పనిచేసే 18004256625 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. తహశీల్దార్ల నేతృత్వంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తాయని చెప్పారు. పెయిడ్ ఆర్టికల్స్‌ను మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనటరింగ్ కమిటీ పరిశీలిస్తుందని, అభ్యర్థులు జారీ చేసే ప్రకటనలకు ముందస్తు అనుమతులను ఇస్తుందని చెప్పారు.
జేసీ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ తహశీల్దార్లు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ నవీన్ గులాఠీ చెప్పారు. ఏజేసీ షరీఫ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 36 రకాల నివేదికలు సమర్పించాలన్నారు. ఆర్డీవోలు జి.గణేష్‌కుమార్, ఎన్.తేజ్‌భరత్, కె.శ్యామ్‌ప్రసాద్‌లు తమ డివిజన్లలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్వీఎం ఈఈ ఎస్.సుగుణాకరరావు మాట్లాడుతూ 240 పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం, 1371 కేంద్రాల్లో ర్యాం పులు, 723 కేంద్రాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డీఆర్‌డీఏ పీడీ ఎస్. తనూజారాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement