దర్జాగా చూచిరాతలు | Style and teaching relevant today | Sakshi
Sakshi News home page

దర్జాగా చూచిరాతలు

Published Tue, Apr 8 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM

దర్జాగా చూచిరాతలు

దర్జాగా చూచిరాతలు

  • పాఠశాలల యాజమాన్యాల ప్రోత్సాహం
  •  ఉత్తీర్ణత శాతం పెంపునకు అడ్డదారులు
  •   నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. ఒకపక్క పరీక్షలు, మరోపక్క ఎన్నికలు రావడంతో ఈ పరీక్షలపై అధికారులు దృష్టిసారించకపోవడాన్ని అవకాశంగా చేసుకుని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు చూచిరాతలను ప్రోత్సహిస్తున్నాయి. పరీక్ష ప్రారంభమైన అర్ధగంటలోపే ప్రశ్నపత్రం బయటకు వస్తోంది. వెనువెంటనే జవాబుపత్రాన్ని తయారుచేసి విద్యార్థులకు అందజేస్తున్నారు.

    ఈ ప్రక్రియ నడపడానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు బృందంగాఏర్పడి వాహనంలో పలు సెంటర్లకు తిరుగుతూ వీటిని చేరవేస్తున్నారు. ఈ తతంగం జరగడానికి విద్యాశాఖాధికారులు, ఆయా కేంద్రాల పరీక్ష నిర్వాహకులు ప్రధానభూమిక పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ఏడు కేంద్రాలతో పాటు వేములపూడిలోని రెండు కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

    ఈ కేంద్రాల్లో 1600మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో ఏడు కేంద్రాల్లో ఈ తతంగం జరుగుతోంది. ఎన్నికల హడావిడిలో అధికారులు, పోలీసులు, మీడియా నిమగ్నమై ఉండడంతో ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉత్తీర్ణత శాతాలను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పర్యవేక్షణాధికారులకు, ఇన్విజిలేటర్లకు ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ముట్టజెప్పడం వల్లే ఈ తతంగం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    అధికారుల కాసుల కక్కుర్తి కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్ష కేంద్రంలో జరుగుతున్న ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లావిద్యాశాఖాధికారి దృష్టిసారించి నర్సీపట్నంలో జరుగుతున్న మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

    ఈ విషయమై డీఈవో బి.లింగేశ్వరరెడ్డిని సంప్రదించగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, సిట్టింగ్‌స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ కేంద్రం నుంచైనా ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు తెలిస్తే సంబంధిత కేంద్ర నిర్వాహకులపై చర్యలు చేపడతామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement