మితిమీరిన పయ్యూవుల దౌర్జన్యాలు | Substance | Sakshi
Sakshi News home page

మితిమీరిన పయ్యూవుల దౌర్జన్యాలు

Published Thu, Feb 5 2015 2:13 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

Substance

కూడేరు : ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పయ్యూవుల కేశవ్, ఆయన సోదరుడు శీనప్ప దౌర్జన్యాలు మితిమీరాయని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. కూడేరు మండలం కలగళ్లకు చెందిన వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అయమ్మ  భర్త  బాలన్న, నాయకులు బోయ మలోబులేసు, జయరాములుపై అక్రమంగా బనాయించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆయన కూడేరు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
 
 
 ఈ ధర్నాలో ఎంపీపీ మహేశ్వరి, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలగళ్లలో మంగళవారం రాత్రి ఎస్టీ వర్గానికి చెందిన రామయ్య, వెంకటేశులు కుటుంబాల మధ్య గొడవ  జరిగిందన్నారు. దీనిపై టీడీపీకి చెందిన హనుమంతు ఫిర్యాదు చేయగా.. వైఎస్సార్‌సీపీ నాయకులకు సంబంధం లేకున్నా స్టేషన్‌కు తీసుకొచ్చారన్నారు.
 
  వారికి బట్టలూడదీసి, మోకాళ్లపై ఎలా నిలబెడతారని పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అమాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం తగదన్నారు. హనుమంతుపై ఇప్పటికే అనేక నేరారోపణలు ఉన్నాయన్నారు. గ్రామంలో గొడవలకు అతనే కారకుడని, అలాంటి వ్యక్తి ఫిర్యాదు చేస్తే విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. దొంగలు, దౌర్జన్యపరులను పయ్యావుల సోదరులు ప్రోత్సహిస్తున్నారన్నారు. చోరీల ఆరోపణలు ఉన్నవారు టీడీపీ కన్వీనర్లుగా ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. గ్రామాల్లో టీడీపీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులపైనా విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారని, మాట వినకపోతే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఉరవకొండ, బెళుగుప్ప ఎంపీడీఓ కార్యాలయాలను టీడీపీ ఆఫీసులుగా మార్చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లను భరించలేక అధికారులు సెలవుపై వెళుతున్నారన్నారు. ఇలాగైతే నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు వైఎస్సార్ సీపీ వారికి అందకుండా అడ్డుకుంటున్నారన్నారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ, సీఐ నారాయణ స్వామి, ఎస్‌ఐ సుబ్బరాయుడు వచ్చి ఎమ్మెల్యేతో చర్చించారు. ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామని, విచారణ చేసి వారిని వదిలివేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే ధర్నా విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, ధనుంజయ యూదవ్, నిఖిల్‌నాథ్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మాదన్న, దేవేంద్ర, గంగాధర్, సంగప్ప, తిమ్మారెడ్డి, శశికాంత్ రెడ్డి, సత్యనారాయణ, శంకర్ రెడ్డి,  మల్లికార్జున, తిరుపతయ్య, మండల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.   
 
 నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
 మండల అధికారులు పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా పని చేయూలని జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీసభ్యుడు మాదన్న సూచించారు. ధర్నాలో వీరితో పాటు పార్టీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, ధనుంజయ యాదవ్ మాట్లాడారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ వారి ఆగడాలు మితిమీరాయని ధ్వజమెత్తారు. మండలంలో వైఎస్సార్ సీపీకి ఆదరణ పెరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పార్టీలో చురుగ్గా పని చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు పోలీసు స్టేషన్‌లోకి వెళ్లి నాయకులు బాలన్న, మలోబులేసు, జయరామ్‌ను పరామర్శించారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు.   
 
 సార్.. అవమానాలు భరించలేం
 ‘సార్.. మేము వైఎస్సార్ సీపీకి చెందిన వాళ్లమని గ్రామంలో టీడీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురి చేస్తున్నారు. వీటిని భరించలేకున్నాం. ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమ’ని కలగళ్ల సర్పంచ్ అయమ్మ, మలోబులేసు భార్య జయలక్ష్మి డీఎస్పీ మల్లికార్జున వర్మ వద్ద గోడు వెల్లబోసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కూడేరు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ అక్కడికొచ్చారు. దీంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ నాయకులు కక్ష సాధింపుతో తమ భర్తలపై అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. తప్పు చేయకున్నా పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల నుంచి తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. డీఎస్పీ స్పందిస్తూ ఎలాంటి అన్యాయం, ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అధైర్యపడవద్దని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement