keshav
-
మాకు అడ్డొస్తే చంపేస్తాం..
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మేము అధికారంలో ఉన్నాం.. మేం ఏం చెప్పినా జరుగుతుంది’ అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండ చూసుకుని రోజూ మండలంలోని ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు. మంగళవారం కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీ, కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించాడు. అతని తీరుతో విసుగు చెందిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇతను గతంలోనూ పెనుకొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం అలజడులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని తొమ్మిది పంచాయతీలకు గాను ఏడుచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. తొమ్మిది ఎంపీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దీన్ని జీరి్ణంచుకోలేని పరిటాల కుటుంబం సొంత మండలంలో ఆధిపత్యం కోసం గ్రామాల్లో గొడవలకు ఆజ్యం పోస్తోంది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కుంటిమద్దిలో అలజడి సృష్టించే క్రమంలోనే పరిటాల అనుచరుడు గంగాధర్ ఎంపీటీసీ భర్తను తుపాకీతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. -
Hyderabad: ధూమ్ ధామ్ దోస్తాన్..!
సాక్షి, సిటీబ్యూరో: మల్లారెడ్డి మహిళా కళాశాల వేదికగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లు సందడి చేశారు. ఈ నెల ఫ్రెండ్షిప్ డే నేపథ్యంలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో యువగాయకులు తమ స్వరాలతో అలరించారు. ధూమ్ ధామ్ దోస్తాన్ విత్ యువర్ ఐడల్స్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్లు అనిరుధ్, కేశవ్, కీర్తన–కీర్తి, నజీర్ పాటలతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ కన్సర్ట్ను తలపించిన ఈ కార్యక్రమం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లతో సెల్ఫీలతో ఆహ్లాదంగా సాగింది. -
హ్యాపీడేస్‌లాంటి సినిమా
తమకు నచ్చిన ప్రముఖులను అనుకరిస్తూ సొంతంగా వీడియోలను తయారు చేయటాన్ని ‘డబ్స్మాష్ ’అంటారు. ఇప్పుడు ఆ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం తెలుగు చిత్ర పరిశ్రమలోని లెజెండ్స్‌పై తీసిన పాటను సినీ నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర ప్రసాద్, రామ సత్యనారాయణలు విడుదల చేశారు. చిత్రనిర్మాత ఓంకార లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మా అన్నయ్య నటించినందుకు హ్యాపీగా ఉంది. ‘హ్యాపీడేస్’ తరహాలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా లెజెండ్స్‌పై మా సినిమాలో పాట ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.’’ అన్నారు దర్శకుడు కేశవ్ దేవర్. ‘‘ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను’’ అన్నారు పవన్. ‘‘మా చిత్రం విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు హీరోయిన్ సుప్రజ. -
దక్షిణాఫ్రికా అనూహ్య విజయం
⇒ కివీస్‌ను తిప్పేసిన కేశవ్ ⇒ మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టు వెల్లింగ్టన్: ఆట రెండో రోజు... దక్షిణాఫ్రికా 94/6... న్యూజిలాండ్ స్కోరు 268 పరుగులకు ఆమడ దూరం! కానీ... సఫారీ బ్యాట్స్‌మెన్ తెగువతో 349/9తో రెండో రోజు ముగింపు. శనివారం చూస్తే దక్షిణాఫ్రికా అనూహ్య విజయం. అదెలాగంటే... మూడో రోజు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కూడగట్టుకున్న దక్షిణాఫ్రికా... తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్‌ను 171 పరుగులకే ఆలౌట్ చేసింది. దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (6/40) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశాడు. దీంతో మూడే రోజుల్లో ముగిసిన ఈ రెండో టెస్టులో సఫారీ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు ఆటలో మరో పది పరుగులు చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 359 స్కోరు వద్ద ముగిసింది. తర్వాత 91 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కివీస్ జట్టులో ఒక్క జీత్ రావల్ (174 బంతుల్లో 80; 10 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఒక దశలో 155/5తో కాస్త మెరుగ్గానే ఉన్నా... అదే స్కోరుపై జీత్ రావల్‌ను కేశవ్ మహరాజ్ ఔట్ చేయడంతో కివీస్ పతనం ప్రారంభమైంది. కేశవ్‌తో పాటు పేసర్ మోర్నీ మోర్కెల్ (3/50) కూడా రాణించడంతో న్యూజిలాండ్ చివరి 5 వికెట్లను 16 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. తర్వాత 81 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆమ్లా 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి టెస్టు 25 నుంచి హామిల్టన్‌లో జరుగుతుంది. -
ఛాన్స్ ఎవరికో?
మంత్రివర్గ విస్తరణకు ఉగాదినాడే ముహూర్తం – ‘పల్లె’ను తప్పించే యోచనలో చంద్రబాబు - సునీత కొనసాగింపు విషయంలో అంతర్మథనం – కేబినెట్ బెర్త్ కోసం బీకే, కాలవ, కేశవ్ పోటీ (సాక్షిప్రతినిధి, అనంతపురం): మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అనంత’ టీడీపీలోని ఆశావహుల ఆశలు త్వరలోనే ఫలించనున్నాయి. ఈనెల 29న ఉగాది పండుగ రోజున రాష్ట్ర మంత్రి విస్తరణ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విస్తరణ ముహూర్తాన్ని టీడీపీలోని క్రియాశీలక నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇపుడున్న ఇద్దరు మంత్రులను కొనసాగిస్తారా..?...లేదా..? కొత్తగా ఎవరికి కేబినెట్లో చోటు దక్కుతుందన్న చర్చ ఇపుడు టీడీపీతో పాటు ఇతర పార్టీలోనూ జోరుగా సాగుతోంది. పార్టీ పరిస్థితిపై కలవరం రాష్ట్రంలోని 13 జిల్లాలలో అనంతపురాన్ని టీడీపీకి కంచుకోటగా ఇన్నాళ్లూ చంద్రబాబు భావించేవారు! కానీ ఇటీవల ఆయన స్వయంగా చేయించిన సర్వేలో అన్ని జిల్లాలలో కంటే ‘అనంత’లోనే పార్టీ పతనావస్థకు చేరిందని తేలింది. ఏకంగా 92 శాతం పార్టీకి నష్టం జిరిగినట్లు సర్వేరిపోర్ట్ వచ్చిందని ఫిబ్రవరిలో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ‘అనంత’నేతలతో స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎమ్మెలతో పాటు మంత్రులపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేకంగా ఇద్దరు మంత్రులకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ‘పార్టీవల్ల మీరు లబ్ధి పొందడం మినహా..మీ వల్ల పార్టీకి దమ్మిడీ ఉపయోగం లేదు. కేబినెట్ విస్తరణలో మీ సంగతి చూస్తా! సిద్ధంగా ఉండండి!’ అని బాహాటంగానే హెచ్చరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరిని తొలగిస్తారు? ఇద్దరినీ తొలగిస్తారా? అనే సందిగ్ధం పార్టీ నేతల్లో నెలకొంది. ఇద్దరిపైనా అసంతృప్తి! ప్రస్తుతం కేబినెట్లో అత్యంత బలహీనంగా ఉన్న మంత్రుల్లో పల్లె, సునీత ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీశాఖ మంత్రిగా పల్లె ఘోరంగా విఫలమయ్యారనే భావనలో సీఎం ఉన్నట్లు తెలిసింది. చివరకు సమాచారశాఖలో డీపీఆర్ఓలు కూడా మంత్రిమాటను ఖాతరు చేసే పరిస్థితి లేదు. తనకు అప్పగించినశాఖలను గాడిలో పెట్టడంలో విఫలం కావడం, స్వయంగా తాను ఆర్థికంగా ఎదగాలనే స్పృహ మినహా మంత్రిపదవిలో తనదైన ప్రత్యేకమై ముద్ర వేయడం ‘పల్లె’ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇతనిపై వేటు వేసేందుకు బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే మంత్రి పరిటాల సునీతపై కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఆమె కేవలం ఐదో తరగతి చదవడం, కనీసం జీఓలు కూడా చదవలేకపోవడం, మంత్రిగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో మాట్లాడే స్థాయిలో విషయం లేకపోవడాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జిల్లాలో పార్టీ ఉన్నతికి మూడేళ్లలో సునీత చేసిన కృషి ఏమీలేదనేది చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే పరిటాల ప్రభావం జిల్లాలో పూర్తిగా తగ్గిందనే భావనకు చంద్రబాబు వచ్చారు. కేవలం రాప్తాడు మినహా పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో పూర్తిగా పట్టుకోల్పోయారని భావిస్తున్న బాబు.. ఆమె కొనసాగింపుపై కూడా ఆలోచనలో పడ్డారు. వీరిద్దరి వద్ద ‘సబ్జెక్ట్’ లేకపోవడంతో జిల్లాలోని సమీక్ష సమావేశాల్లో అధికారుల ముందు తేలిపోతున్నారు. ఇప్పటికే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో ఇలాంటి మంత్రులతో ఎన్నికలకు వెళితే ఫలితాలు దారుణంగా ఉంటాయనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. ఆ ముగ్గురిలో చోటెవ్వరికో మంత్రివర్గ విస్తరణపై చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌లు భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. జిల్లాలో బీసీల ప్రాబల్యం అధికమని, బీసీ మంత్రి లేకపోవడం కూడా పార్టీ పతనానికి కారణమని జిల్లా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రిపదవిపై బీకే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఇటీవల సీఎంను కలిసినప్పుడు విస్తరణపై చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కేబినెట్లో తనకు చోటు కల్పించాలని కాలవ కోరినట్లు తెలిసింది. దీంతో బీకే పార్థసారథి, కాలవ శ్రీనివాసులల్లో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉంది. పల్లెను తప్పిస్తే ఆ స్థానంలో ఈ ఇద్దరిలో ఒకరికి చోటు ఇవ్వవచ్చు. ఇక రెండోబెర్త్ కోసం పరిటాల, పయ్యావుల పోటీ పడుతున్నారు. నారా లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకుంటే రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి బెర్త్ దొరకదు. మూడేళ్లు సునీత పదవిలో ఉన్నారు కాబట్టి, కేశవ్‌కు రెండేళ్లు అవకాశం ఇచ్చేందుకు తప్పుకోవాలని చంద్రబాబు సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు చురుకైన నేత లేకపోవడంతో కేశవ్‌ను తీసుకోవాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సునీతను తొలగించి కేశవ్‌కు మంత్రి పదవి ఇస్తారా? అనేది సందేహమే! పోనీ సునీతను కొనసాగిస్తూ, కేశవ్‌కు చోటు కల్పిస్తే ఒకే సామాజికవర్గానికి రెండు మంత్రిపదవులు కట్టబెట్టినట్లవుతుంది. దీంతో రెండోస్థానంపైనే చంద్రబాబు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆశావహుల్లోని ముగ్గురిలో ఒకరికి మాత్రమే బెర్త్ దక్కుతుందా? ఇద్దరిని మంత్రి పదవి వరిస్తుందా? అనేది చూడాలి!! -
సెకను కోపం..ఊచలు లెక్కపెట్టిస్తోంది..!
ఢిల్లీలోని అశోకా రోడ్లో కానిస్టేబుల్ అబ్దుల్ నజీర్ కుంజు, హోంగార్డ్ చందర్‌పాల్‌లు గస్తీ కాస్తున్నారు. పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. అంతా సవ్యంగానే ఉందనుకొన్నారు. కానీ, ఏదో మూల.. ఎక్కడో చిన్న అనుమానం. దూరంగా ఓ స్టార్ హోటెల్ నుంచి వెలువడుతున్న నల్లని పొగ అబ్దుల్ నజీర్‌కు ఎక్కడలేని సందేహాలనీ కలిగిస్తోంది. చందర్‌పాల్ తోడుగా దగ్గరకు వెళ్లి చూశాడు. ఏదో పెద్ద అగ్ని ప్రమాదమే జరిగేలా ఉందనుకుని, హోటెల్ గేటు దూకి లోపలికి ప్రవేశించాడు. అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం పాటు షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ అక్కడేం జరిగింది..? 1995, జూలై 2.. తన పనులు ముగించుకుని ఢిల్లీలోని మందిర్ మార్గ్ దిశగా దూసుకెళ్తున్నాడు సుశీల్ శర్మ. ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బిజీగా ఉండే ఆయన.. ఇంటికి చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయింది. సుశీల్ రాకను 29 ఏళ్ల అతడి భార్య, కాంగ్రెస్ మహిళా నాయకురాలు నైనా సాహ్ని గుర్తించలేదు. టెలీఫోన్లో ఎవరితోనో మాటల్లో మునిగిపోయింది. నేరుగా ఆమె గదికి చేరుకున్నాడు సుశీల్. అతడిని చూసీ చూడటంతోనే ఫోన్ కట్ చేసింది నైనా. అంతే.. సుశీల్‌లో అనుమానం, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. 'ఇంత రాత్రి పూట ఎవరితో మాట్లాడుతున్నావ్' అంటూ కళ్లెర్రజేశాడు. విసురుగా ఫోన్ లాక్కొని, నైనా చివరిసారిగా మాట్లాడిన నంబర్‌ను రీడయల్ చేశాడు. రెండు రింగులు పూర్తయ్యాక, అవతలి వైపు నుంచి బాగా తెలిసిన స్వరమే వినిపించింది. ఆ గొంతు మత్లూబ్ కరీమ్ది. అతడు నైనా సాహ్నికి క్లాస్మేట్ మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త కూడా! దీంతో తన అనుమానం నిజమేనని నిర్ధారించుకున్నాడు సుశీల్. ఒక్కసారిగా పొంగుకొచ్చిన దుఃఖాన్నీ, కోపాన్నీ నియంత్రించుకోలేకపోయాడు. కనీసం, ఏం మాట్లాడారని భార్యని ప్రశ్నించకుండానే.. తన వెంటే తెచ్చుకున్న లెసైన్స్డ్ రివాల్వర్ని ఆమె వైపు ఎక్కుపెట్టాడు. రెప్పపాటు వేగంలో.. ఏం జరుగుతోందో ఆమెకు తెలిసేలోపే ట్రిగ్గర్ను మూడుసార్లు నొక్కాడు. అంతే.. ఓ బుల్లెట్ తలలోకి, మరొకటి మెడ భాగంలోకి దూసుకుపోయాయి. మూడో బుల్లెట్ గురి తప్పి గదిలోని ఏసీని తాకింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే గది మొత్తం నైనా రక్తంతో నిండిపోయింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తానెంత పెద్ద తప్పు చేశాడో కొద్ది సేపటికే అర్థం చేసుకున్న సుశీల్.. తప్పును ఒప్పు చేయాలనుకుని, మరింత పెద్ద తప్పిదం చేశాడు. నైనా మృతదేహాన్ని ఓ గుడ్డలో చుట్టి, అశోకా రోడ్డులోని బాగియా బార్బేక్యూ రెస్టారెంట్‌కు చేరుకున్నాడు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న రెస్టారెంట్ మేనేజర్ కేశవ్ కుమార్, సుశీల్‌కు సాయపడ్డాడు. ఇద్దరూ కలిసి నైనా శవాన్ని ‘తందూర్’ అనే మట్టి పొయ్యిలాంటి నిర్మాణం దగ్గరకు తీసుకెళ్లారు. రెస్టారెంట్‌లోని ఆయుధాలతో అత్యంత కిరాతకంగా ఆమె దేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికారు. వాటన్నిటినీ తందూర్‌లో వేసి, కట్టెలతో మంట వెలిగించారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో మృతదేహం దహనమవ్వసాగింది. ఈ తంతు మరింత వేగంగా ముగించడానికి కేశవ్.. నిర్విరామంగా కట్టెలను పొయ్యిలోకి కూరుతూనే ఉన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి చేరుకున్నారు ఢిల్లీ కానిస్టేబుల్ అబ్దుల్, హోం గార్డు చందర్‌పాల్‌లు. ఓవైపు రెస్టారెంట్ పైకప్పుని తాకుతున్న మంటలు.. మరోవైపు శవం దహనమవుతోన్న వాసన రావడంతో వారిలో అనుమానం బలపడింది. కేశవ్‌ని పట్టుకుని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ కార్యకర్తననీ, పాత బ్యానర్లు, జెండాలు తగులబెడుతున్నాననీ చెప్పాడు కేశవ్. అయితే, కానిస్టేబుల్ అతడి మాటలు నమ్మలేదు. తందూర్పై నీటిని కుమ్మరించి, మంటలు ఆరిపోయేలా చేశాడు. ఈ గందరగోళంలో అక్కడి నుంచి సుశీల్ తెలివిగా తప్పించుకున్నాడు. ఆ రాత్రి గుజరాత్ భవన్లో తలదాచుకుని, జైపూర్‌కు పారిపోయాడు. అక్కడి నుంచి ముంబైకి, తర్వాత చెన్నైకీ మకాం మార్చాడు. చివరగా జూలై 10న బెంగళూరు చేరుకుని అక్కడే పోలీసులకి లొంగిపోయాడు. అత్యంత కిరాతకంగా భార్యను హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా చేయాలని చూసిన సుశీల్‌ను చూసి, తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. దేశ రాజధాని సహా దేశమంతటా ఈ హత్యకేసు సంచలనంగా మారింది. ఏళ్లపాటు కొనసాగిన విచారణలో తొలుత సుశీల్, కేశవ్‌లు నేరం అంగీకరించలేదు. తర్వాత తప్పు చేశామని ఒప్పుకొన్నారు. వీరికి న్యాయస్థానం 2003, నవంబర్ 7న శిక్ష విధించింది. సుశీల్‌కు మరణ దండన వేయగా, కేశవ్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గతేడాది ఈ కేసును పునఃపరిశీలించిన సుప్రీం కోర్టు.. 20 ఏళ్లకు పైగా జైళ్లోనే మగ్గిన సుశీల్‌కు ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. అతడి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత సెప్టెంబర్‌లో పెరోల్‌పై బయటకు వచ్చిన సుశీల్.., ‘‘ఒక్క సెకను.. నా జీవితాన్నే సర్వనాశనం చేసింది’’ అంటూ వాపోయాడు. చక్కని రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడి జీవితం అలా క్షణికావేశంతో నాశనమైపోయింది. -
స్కూలు వారికో పీడకల
రాంఛీ: జార్ఖండ్‌లో ఇద్దరు చిన్నారులకు పాఠశాల అనేది ఒక పీడకలగా మిగిలిపోయింది. ఆడుతూపాడుతూ స్కూలుకు వెళ్లాల్సిన వారు బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తున్నారు. ఎప్పుడు ఎవరు అవమానిస్తారో అన్న భయంతో పసి హృదయాలు వణుకుతూ కనిపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ప్రొగేరియా.. అవును. అత్యంత అరుదుగా వచ్చే ఈ వ్యాధి పాపం ఆ చిన్నారులకు వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం అంజలి అనే ఆ పాపకు ఎనిమిదేళ్లు.. కేశవ్ అనే బాబుకు రెండేళ్లు.. కానీ అప్పుడే వారి వయసుకన్నా ఐదు రెట్లు పెద్దవారిగా కనిపిస్తున్నారు. 'పా' చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లుగా నటించే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారులు ముఖం అప్పుడే వాడిపోయింది. పెద్దవారికి వచ్చినట్లుగా ఒళ్లు నొప్పులు సరే సరి. ఇక స్కూలులో అడుగుపెట్టారో తోటి పిల్లలు ముసలివారు.. ముసలివారు అంటూ గేలి చేస్తున్నారు. పాఠాలు వినడం కంటే వారిని అవమానిస్తున్న పిల్లలపై టీచర్లకు ఫిర్యాదుచేయడమే వారికి పెద్ద పనిగా, తల నొప్పిగా మారిపోయింది. దీంతో వారు బడి అంటేనే వణికిపోతున్నారు. వీరి తల్లిదండ్రులు బట్టలు ఉతుకుతూ జీవనం గడుపుతున్నారు. వారి నెల సంపాధన నెలకు రూ.4,500 మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాయం చేస్తే మెరుగైన వైద్యం చేయించుకుంటామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. -
2వ శతాబ్దపు బుద్ద విగ్రహాలు లభ్యం
-
2వ శతాబ్దపు బుద్ద విగ్రహాలు లభ్యం
ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామ శివారులో బుద్ధుని విగ్రహాలతో పాటు 2వ శతాబ్దానికి సంబంధించిన పలు అవశేషాలు సోమవారం లభ్యమయ్యాయి. పోలేరమ్మ గుడు సమీపంలో మట్టి కోసం తవ్వకాలు చేస్తుండగా పెద్ద కుండ బయటపడింది. అందులో అడుగు పొడవున్న బుద్ధుని రాగి విగ్రహాలు రెండు, స్తంభాలు రెండు, దీపారాధన కండె, హారతి పళ్లెం ఇతర వస్తువులు ఉన్నాయి. మట్టి కింద పది అడుగుల లోపల రాతి కట్టడాల ఆనవాళ్లు కనిపించాయి. ఇవి 2వ శతాబ్దానికి సంబంధించినవని పురావస్తు అధికారులు తెలిపారు. ఇక్కడ బౌద్ధ నాగరికత పరిఢవిల్లి ఉంటుందని ఆర్కియాలజి డిప్యూటీ డెరైక్టర్ కేశవ్ చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఆయన విగ్రహాలు బయటపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రదేశంలో భూమిలోపల ఊరి అవశేషాలు ఉండవచ్చని, తవ్వకాలు నిర్వహిస్తామని చెప్పారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
బెంగళూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్తను, తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోలార్ జిల్లా శ్రీనివాసపురాలో శనివారం రాత్రి ఈ హత్య జరిగింది. తన కజిన్ వాసుదేవతో ప్రేమాయణం సాగిస్తున్న శిల్పారెడ్డి, అతనితో పారిపోయి విదేశాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంది. దీంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనుకుని పథకం వేసింది. భర్త కేశవరెడ్డికి పళ్లరసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి,అనంతరం పదునైన ఆయుధంతో దాడిచేసి చంపేసింది. తర్వాత ప్రియుడు వాసుదేవ సహాయంతో మృతదేహాన్ని సమీపంలోని నదిలో పడేసింది. తర్వాత ఏమీ తెలియనట్టుగా భర్త సోదరుడు తిరుమలకి ఫోన్ చేసి కేశవరెడ్డి క్షేమ సమాచారాల గురించి ఆరా తీసింది. సాధారణంగా ఎప్పడూ తనకు ఫోన్ చేయని వదిన ఫోన్ చేయడంతో మరిదికి అనుమానం తలెత్తింది. దీనికితోడు ఆమె అసాధారణ ప్రవర్తనతో అనుమానం మరింత బలపడింది. ఈ విషయాన్ని పోలీసుల చెవిన వేద్దామనకున్నాడు. ఈలోపు ఆదివారం నదిలో శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడి ఐడీ కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా మృతుడిని కేశవరెడ్డిగా తేల్చారు. అటు అనుమానాస్పద మరణం, ఇటు మృతుని సోదరుడు ఇచ్చిన సమాచారం.. ఈ నేపథ్యంలో కేశవరెడ్డిది హత్యగా అనుమానించిన పోలీసులు శిల్పారెడ్డి సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన తర్వాత ఆమెను తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం తెలిసింది. తమ విచారణలో శిల్ప తాను చేసిన నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, గురువారం శిల్పను అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ హత్యా నేరంలో శిల్ప తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్టు వారు గుర్తించారు. -
మితిమీరిన పయ్యూవుల దౌర్జన్యాలు
కూడేరు : ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పయ్యూవుల కేశవ్, ఆయన సోదరుడు శీనప్ప దౌర్జన్యాలు మితిమీరాయని స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. కూడేరు మండలం కలగళ్లకు చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ అయమ్మ భర్త బాలన్న, నాయకులు బోయ మలోబులేసు, జయరాములుపై అక్రమంగా బనాయించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆయన కూడేరు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంపీపీ మహేశ్వరి, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలగళ్లలో మంగళవారం రాత్రి ఎస్టీ వర్గానికి చెందిన రామయ్య, వెంకటేశులు కుటుంబాల మధ్య గొడవ జరిగిందన్నారు. దీనిపై టీడీపీకి చెందిన హనుమంతు ఫిర్యాదు చేయగా.. వైఎస్సార్సీపీ నాయకులకు సంబంధం లేకున్నా స్టేషన్‌కు తీసుకొచ్చారన్నారు. వారికి బట్టలూడదీసి, మోకాళ్లపై ఎలా నిలబెడతారని పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అమాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం తగదన్నారు. హనుమంతుపై ఇప్పటికే అనేక నేరారోపణలు ఉన్నాయన్నారు. గ్రామంలో గొడవలకు అతనే కారకుడని, అలాంటి వ్యక్తి ఫిర్యాదు చేస్తే విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. దొంగలు, దౌర్జన్యపరులను పయ్యావుల సోదరులు ప్రోత్సహిస్తున్నారన్నారు. చోరీల ఆరోపణలు ఉన్నవారు టీడీపీ కన్వీనర్లుగా ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. గ్రామాల్లో టీడీపీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులపైనా విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారని, మాట వినకపోతే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఉరవకొండ, బెళుగుప్ప ఎంపీడీఓ కార్యాలయాలను టీడీపీ ఆఫీసులుగా మార్చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లను భరించలేక అధికారులు సెలవుపై వెళుతున్నారన్నారు. ఇలాగైతే నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు వైఎస్సార్ సీపీ వారికి అందకుండా అడ్డుకుంటున్నారన్నారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ, సీఐ నారాయణ స్వామి, ఎస్ఐ సుబ్బరాయుడు వచ్చి ఎమ్మెల్యేతో చర్చించారు. ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామని, విచారణ చేసి వారిని వదిలివేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే ధర్నా విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, ధనుంజయ యూదవ్, నిఖిల్‌నాథ్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మాదన్న, దేవేంద్ర, గంగాధర్, సంగప్ప, తిమ్మారెడ్డి, శశికాంత్ రెడ్డి, సత్యనారాయణ, శంకర్ రెడ్డి, మల్లికార్జున, తిరుపతయ్య, మండల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి మండల అధికారులు పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా పని చేయూలని జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీసభ్యుడు మాదన్న సూచించారు. ధర్నాలో వీరితో పాటు పార్టీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, ధనుంజయ యాదవ్ మాట్లాడారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ వారి ఆగడాలు మితిమీరాయని ధ్వజమెత్తారు. మండలంలో వైఎస్సార్ సీపీకి ఆదరణ పెరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పార్టీలో చురుగ్గా పని చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు పోలీసు స్టేషన్లోకి వెళ్లి నాయకులు బాలన్న, మలోబులేసు, జయరామ్‌ను పరామర్శించారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. సార్.. అవమానాలు భరించలేం ‘సార్.. మేము వైఎస్సార్ సీపీకి చెందిన వాళ్లమని గ్రామంలో టీడీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురి చేస్తున్నారు. వీటిని భరించలేకున్నాం. ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమ’ని కలగళ్ల సర్పంచ్ అయమ్మ, మలోబులేసు భార్య జయలక్ష్మి డీఎస్పీ మల్లికార్జున వర్మ వద్ద గోడు వెల్లబోసుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కూడేరు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ అక్కడికొచ్చారు. దీంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ నాయకులు కక్ష సాధింపుతో తమ భర్తలపై అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. తప్పు చేయకున్నా పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల నుంచి తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. డీఎస్పీ స్పందిస్తూ ఎలాంటి అన్యాయం, ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అధైర్యపడవద్దని సూచించారు. -
పదకొండేళ్ల తబలా విద్వాంసుడు
ప్రతిభా కిరణం పాండిచ్చేరిలోని ఆరోవిల్‌లో పదకొండేళ్లక్రితం పుట్టిన కేశవ్ తబలా వాద్యకారుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కేశవ్ రెండు సంవత్సరాల వయసు నుండి తబలా నేర్చుకోవడం మొదలు పెట్టి ఏడు సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చాడు. అది అతని మొదటి ప్రదర్శన. ఎలాంటి అవరోధం లేకుండా పూర్తయిన ఆ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కేశవ్లోని ప్రతిభను మొదటగా గుర్తించింది చిత్రకారిణి అయిన అతని అమ్మమ్మ ప్రఫుల్ల దహనుకర్. మొదటి పాఠాలు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడు. తరువాత ప్రజాప్రదర్శలను ఇచ్చే తబలా వాద్యకారుడు గణేశ్ బసవరాజుగారి చేతి కదలికలు నిశితంగా పరిశీలించేవాడు. తరువాత ఇంటికి వచ్చి ఆయన చేతి కదలికలను అనుకరిస్తూ తబలా వాయించేవాడు. కేశవలోని ఆసక్తిని తెలుసుకున్న బసవరాజు తనకు తీరిక దొరికినప్పుడల్లా తబలాలో తర్ఫీదు ఇచ్చాడు. కేశవ్ గిటార్‌ను కూడా అద్భుతంగా ప్లే చేయగలడు. మిగతా పిల్లల్లాగే సైకిల్ తొక్కడం, చెట్లు ఎక్కడం, చందమామ కథలు చదవడం కేశవ్‌కి ఎంతో ఇష్టం. ఈ బుడతడిని ఆదర్శంగా తీసుకుంటే, ఒక పక్క చదువుకుంటూనే నచ్చిన రంగంలోనూ రాణించవచ్చు. -
పయ్యావుల కేశవ్‌పై ఎర్రబెల్లి ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీలోని ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన నాయకుడు పయ్యావుల కేశవ్‌పై తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో టీడీపీ ముఖ్యనేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. పయ్యావుల కేశవ్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఎర్రబెల్లి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిపై చంద్రబాబు ఎలా స్పందించారన్న విషయం మాత్రం తెలియరాలేదు. -
వెళ్లవయ్యా.. వెళ్లూ..
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కళ్యాణదుర్గంలో సమైక్య సెగ తగిలింది. కేశవ్ మంగళవారం కళ్యాణదుర్గం టీ సర్కిల్లో జేఏసీ నాయకుల రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. సమైక్యవాదులు ఎదురెళ్లి ‘కేశవ్ గో బ్యాక్’ అంటూ నినదించారు. అర గంట పాటు వేదిక పైకి రాకుండా అడ్డుకున్నారు. స్పష్టమైన వైఖరి ప్రకటించాకే వేదిక మీదకు రావాలని తెగేసి చెప్పారు. వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే మౌనం వహించి కిందే నిల్చున్నారు. జేఏసీ నాయకుల జోక్యంతో ఆయన వేదికపైకి వెళ్లగా నిరసనలు మిన్నంటాయి. టీడీపీది సమైక్యవాదమా లేక ప్రత్యేక వాదమా తేల్చి చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుతో రాజీనామా చేయించి ఉద్యమంలోకి తీసుకురాగలరా అని ప్రశ్నించారు. టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తోందని మండిపడ్డారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రులకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఆ లేఖను వెనక్కు తీసుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా చంద్రబాబుతో లేఖ ఇప్పిస్తామని ప్రకటించాలని కేశవ్‌ను పట్టుబట్టారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వచ్చారని, అదే తరహాలో మీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేయకుండా నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిన అంశంతో కూడిన కరపత్రాలను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యవాదులను సముదాయించేందుకు కేశవ్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. ఆయన పక్కనే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమైక్యవాదులను వారించే ప్రయత్నం చేయగా.. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఎస్ఐ శ్రీనివాసులు నిరసనకారులను పక్కకు తోసేశారు. ఎమ్మెల్యే కేశవ్ ఏదో చెప్పబోగా.. ‘ఊకదంపుడు ప్రసంగాలొద్దు. స్పష్టమైన వైఖరి చెప్పండి’ అంటూ నిలదీయడంతో చేసేది లేక ఆయన అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకోబోయిన జేఏసీ నాయకుడు పోతుల రాధాకృష్ణను టీడీపీ నాయకులు వారించారు. అనంతరం కేశవ్ మీడియాతో మాట్లాడుతూ జేఏసీ నాయకులెవరూ తనను అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పథకం ప్రకారం నిరసనలు తెలియజేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్న మంత్రి రఘువీరారెడ్డి రాష్ట్ర విభజనపై తన వైఖరిని ప్రకటించలేదని విమర్శించారు. అయితే.. తాను సమైక్యాంధ్ర దీక్షలకు మద్దతు తెలిపేందుకు ముందుకొస్తున్నానన్నారు.