స్కూలు వారికో పీడకల
రాంఛీ: జార్ఖండ్లో ఇద్దరు చిన్నారులకు పాఠశాల అనేది ఒక పీడకలగా మిగిలిపోయింది. ఆడుతూపాడుతూ స్కూలుకు వెళ్లాల్సిన వారు బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తున్నారు. ఎప్పుడు ఎవరు అవమానిస్తారో అన్న భయంతో పసి హృదయాలు వణుకుతూ కనిపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ప్రొగేరియా.. అవును. అత్యంత అరుదుగా వచ్చే ఈ వ్యాధి పాపం ఆ చిన్నారులకు వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం అంజలి అనే ఆ పాపకు ఎనిమిదేళ్లు.. కేశవ్ అనే బాబుకు రెండేళ్లు.. కానీ అప్పుడే వారి వయసుకన్నా ఐదు రెట్లు పెద్దవారిగా కనిపిస్తున్నారు.
'పా' చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లుగా నటించే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారులు ముఖం అప్పుడే వాడిపోయింది. పెద్దవారికి వచ్చినట్లుగా ఒళ్లు నొప్పులు సరే సరి. ఇక స్కూలులో అడుగుపెట్టారో తోటి పిల్లలు ముసలివారు.. ముసలివారు అంటూ గేలి చేస్తున్నారు. పాఠాలు వినడం కంటే వారిని అవమానిస్తున్న పిల్లలపై టీచర్లకు ఫిర్యాదుచేయడమే వారికి పెద్ద పనిగా, తల నొప్పిగా మారిపోయింది. దీంతో వారు బడి అంటేనే వణికిపోతున్నారు. వీరి తల్లిదండ్రులు బట్టలు ఉతుకుతూ జీవనం గడుపుతున్నారు. వారి నెల సంపాధన నెలకు రూ.4,500 మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాయం చేస్తే మెరుగైన వైద్యం చేయించుకుంటామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.