ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామ శివారులో బుద్ధుని విగ్రహాలతో పాటు 2వ శతాబ్దానికి సంబంధించిన పలు అవశేషాలు సోమవారం లభ్యమయ్యాయి. పోలేరమ్మ గుడు సమీపంలో మట్టి కోసం తవ్వకాలు చేస్తుండగా పెద్ద కుండ బయటపడింది. అందులో అడుగు పొడవున్న బుద్ధుని రాగి విగ్రహాలు రెండు, స్తంభాలు రెండు, దీపారాధన కండె, హారతి పళ్లెం ఇతర వస్తువులు ఉన్నాయి.
మట్టి కింద పది అడుగుల లోపల రాతి కట్టడాల ఆనవాళ్లు కనిపించాయి. ఇవి 2వ శతాబ్దానికి సంబంధించినవని పురావస్తు అధికారులు తెలిపారు. ఇక్కడ బౌద్ధ నాగరికత పరిఢవిల్లి ఉంటుందని ఆర్కియాలజి డిప్యూటీ డెరైక్టర్ కేశవ్ చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఆయన విగ్రహాలు బయటపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రదేశంలో భూమిలోపల ఊరి అవశేషాలు ఉండవచ్చని, తవ్వకాలు నిర్వహిస్తామని చెప్పారు.