సెకను కోపం..ఊచలు లెక్కపెట్టిస్తోంది..! | he Killed Wife in Tandoor Now Sushil Sharma realized his mistakes | Sakshi
Sakshi News home page

సెకను కోపం..ఊచలు లెక్కపెట్టిస్తోంది..!

Published Fri, May 27 2016 11:23 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

సెకను కోపం..ఊచలు లెక్కపెట్టిస్తోంది..! - Sakshi

సెకను కోపం..ఊచలు లెక్కపెట్టిస్తోంది..!

ఢిల్లీలోని అశోకా రోడ్‌లో కానిస్టేబుల్ అబ్దుల్ నజీర్ కుంజు, హోంగార్డ్ చందర్‌పాల్‌లు గస్తీ కాస్తున్నారు. పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. అంతా సవ్యంగానే ఉందనుకొన్నారు. కానీ,  ఏదో మూల.. ఎక్కడో చిన్న అనుమానం. దూరంగా ఓ స్టార్ హోటెల్ నుంచి వెలువడుతున్న నల్లని పొగ అబ్దుల్ నజీర్‌కు ఎక్కడలేని సందేహాలనీ కలిగిస్తోంది. చందర్‌పాల్ తోడుగా దగ్గరకు వెళ్లి చూశాడు. ఏదో పెద్ద అగ్ని ప్రమాదమే జరిగేలా ఉందనుకుని, హోటెల్ గేటు దూకి లోపలికి ప్రవేశించాడు. అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం పాటు షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ అక్కడేం జరిగింది..?
 
 1995, జూలై 2.. తన పనులు ముగించుకుని ఢిల్లీలోని మందిర్ మార్గ్ దిశగా దూసుకెళ్తున్నాడు సుశీల్ శర్మ. ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బిజీగా ఉండే ఆయన.. ఇంటికి చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయింది. సుశీల్ రాకను 29 ఏళ్ల అతడి భార్య, కాంగ్రెస్ మహిళా నాయకురాలు నైనా సాహ్ని గుర్తించలేదు. టెలీఫోన్‌లో ఎవరితోనో మాటల్లో మునిగిపోయింది. నేరుగా ఆమె గదికి చేరుకున్నాడు సుశీల్. అతడిని చూసీ చూడటంతోనే ఫోన్ కట్ చేసింది నైనా. అంతే.. సుశీల్‌లో అనుమానం, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. 'ఇంత రాత్రి పూట ఎవరితో మాట్లాడుతున్నావ్' అంటూ కళ్లెర్రజేశాడు. విసురుగా ఫోన్ లాక్కొని, నైనా చివరిసారిగా మాట్లాడిన నంబర్‌ను రీడయల్ చేశాడు. రెండు రింగులు పూర్తయ్యాక, అవతలి వైపు నుంచి బాగా తెలిసిన స్వరమే వినిపించింది. ఆ గొంతు మత్లూబ్ కరీమ్‌ది. అతడు నైనా సాహ్నికి క్లాస్‌మేట్ మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త కూడా! దీంతో తన అనుమానం నిజమేనని నిర్ధారించుకున్నాడు సుశీల్. ఒక్కసారిగా పొంగుకొచ్చిన దుఃఖాన్నీ, కోపాన్నీ నియంత్రించుకోలేకపోయాడు.

కనీసం, ఏం మాట్లాడారని భార్యని ప్రశ్నించకుండానే.. తన వెంటే తెచ్చుకున్న లెసైన్స్‌డ్ రివాల్వర్‌ని ఆమె వైపు ఎక్కుపెట్టాడు. రెప్పపాటు వేగంలో.. ఏం జరుగుతోందో ఆమెకు తెలిసేలోపే ట్రిగ్గర్‌ను మూడుసార్లు నొక్కాడు. అంతే.. ఓ బుల్లెట్ తలలోకి, మరొకటి మెడ భాగంలోకి దూసుకుపోయాయి. మూడో బుల్లెట్ గురి తప్పి గదిలోని ఏసీని తాకింది.

కొద్ది క్షణాల వ్యవధిలోనే గది మొత్తం నైనా రక్తంతో నిండిపోయింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తానెంత పెద్ద తప్పు చేశాడో కొద్ది సేపటికే అర్థం చేసుకున్న సుశీల్.. తప్పును ఒప్పు చేయాలనుకుని, మరింత పెద్ద తప్పిదం చేశాడు. నైనా మృతదేహాన్ని ఓ గుడ్డలో చుట్టి, అశోకా రోడ్డులోని బాగియా బార్‌బేక్యూ రెస్టారెంట్‌కు చేరుకున్నాడు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న రెస్టారెంట్ మేనేజర్ కేశవ్ కుమార్, సుశీల్‌కు సాయపడ్డాడు. ఇద్దరూ కలిసి నైనా శవాన్ని ‘తందూర్’ అనే మట్టి పొయ్యిలాంటి నిర్మాణం దగ్గరకు తీసుకెళ్లారు. రెస్టారెంట్‌లోని ఆయుధాలతో అత్యంత కిరాతకంగా ఆమె దేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికారు. వాటన్నిటినీ తందూర్‌లో వేసి, కట్టెలతో మంట వెలిగించారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో మృతదేహం దహనమవ్వసాగింది. ఈ తంతు మరింత వేగంగా ముగించడానికి కేశవ్.. నిర్విరామంగా కట్టెలను పొయ్యిలోకి కూరుతూనే ఉన్నాడు.
 
సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి చేరుకున్నారు ఢిల్లీ కానిస్టేబుల్ అబ్దుల్, హోం గార్డు చందర్‌పాల్‌లు. ఓవైపు రెస్టారెంట్ పైకప్పుని తాకుతున్న మంటలు.. మరోవైపు శవం దహనమవుతోన్న వాసన రావడంతో వారిలో అనుమానం బలపడింది. కేశవ్‌ని పట్టుకుని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ కార్యకర్తననీ, పాత బ్యానర్లు, జెండాలు తగులబెడుతున్నాననీ చెప్పాడు కేశవ్. అయితే, కానిస్టేబుల్ అతడి మాటలు నమ్మలేదు. తందూర్‌పై నీటిని కుమ్మరించి, మంటలు ఆరిపోయేలా చేశాడు. ఈ గందరగోళంలో అక్కడి నుంచి సుశీల్ తెలివిగా తప్పించుకున్నాడు.

ఆ రాత్రి గుజరాత్ భవన్‌లో తలదాచుకుని, జైపూర్‌కు పారిపోయాడు. అక్కడి నుంచి ముంబైకి, తర్వాత చెన్నైకీ మకాం మార్చాడు. చివరగా జూలై 10న బెంగళూరు చేరుకుని అక్కడే పోలీసులకి లొంగిపోయాడు. అత్యంత కిరాతకంగా భార్యను హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా చేయాలని చూసిన సుశీల్‌ను చూసి, తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. దేశ రాజధాని సహా దేశమంతటా ఈ హత్యకేసు సంచలనంగా మారింది. ఏళ్లపాటు కొనసాగిన విచారణలో తొలుత సుశీల్, కేశవ్‌లు నేరం అంగీకరించలేదు. తర్వాత తప్పు చేశామని ఒప్పుకొన్నారు. వీరికి న్యాయస్థానం 2003, నవంబర్ 7న శిక్ష విధించింది. సుశీల్‌కు మరణ దండన వేయగా, కేశవ్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

గతేడాది ఈ కేసును పునఃపరిశీలించిన సుప్రీం కోర్టు.. 20 ఏళ్లకు పైగా జైళ్లోనే మగ్గిన సుశీల్‌కు ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. అతడి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత సెప్టెంబర్‌లో పెరోల్‌పై బయటకు వచ్చిన సుశీల్.., ‘‘ఒక్క సెకను.. నా జీవితాన్నే సర్వనాశనం చేసింది’’ అంటూ వాపోయాడు. చక్కని రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడి జీవితం అలా క్షణికావేశంతో నాశనమైపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement