దక్షిణాఫ్రికా అనూహ్య విజయం
⇒ కివీస్‌ను తిప్పేసిన కేశవ్
⇒ మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టు
వెల్లింగ్టన్: ఆట రెండో రోజు... దక్షిణాఫ్రికా 94/6... న్యూజిలాండ్ స్కోరు 268 పరుగులకు ఆమడ దూరం! కానీ... సఫారీ బ్యాట్స్‌మెన్ తెగువతో 349/9తో రెండో రోజు ముగింపు. శనివారం చూస్తే దక్షిణాఫ్రికా అనూహ్య విజయం. అదెలాగంటే... మూడో రోజు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కూడగట్టుకున్న దక్షిణాఫ్రికా... తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్‌ను 171 పరుగులకే ఆలౌట్ చేసింది. దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (6/40) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశాడు. దీంతో మూడే రోజుల్లో ముగిసిన ఈ రెండో టెస్టులో సఫారీ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు ఆటలో మరో పది పరుగులు చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 359 స్కోరు వద్ద ముగిసింది.
తర్వాత 91 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కివీస్ జట్టులో ఒక్క జీత్ రావల్ (174 బంతుల్లో 80; 10 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఒక దశలో 155/5తో కాస్త మెరుగ్గానే ఉన్నా... అదే స్కోరుపై జీత్ రావల్‌ను కేశవ్ మహరాజ్ ఔట్ చేయడంతో కివీస్ పతనం ప్రారంభమైంది. కేశవ్‌తో పాటు పేసర్ మోర్నీ మోర్కెల్ (3/50) కూడా రాణించడంతో న్యూజిలాండ్ చివరి 5 వికెట్లను 16 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. తర్వాత 81 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆమ్లా 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి టెస్టు 25 నుంచి హామిల్టన్‌లో జరుగుతుంది.