ఛాన్స్‌ ఎవరికో? | who is chance? | Sakshi
Sakshi News home page

ఛాన్స్‌ ఎవరికో?

Published Mon, Mar 6 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

ఛాన్స్‌ ఎవరికో?

ఛాన్స్‌ ఎవరికో?

మంత్రివర్గ విస్తరణకు ఉగాదినాడే ముహూర్తం
– ‘పల్లె’ను తప్పించే యోచనలో చంద్రబాబు
 - సునీత కొనసాగింపు విషయంలో అంతర్మథనం
– కేబినెట్‌ బెర్త్‌ కోసం బీకే, కాలవ, కేశవ్‌ పోటీ
 
 
(సాక్షిప్రతినిధి, అనంతపురం):
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అనంత’ టీడీపీలోని ఆశావహుల ఆశలు త్వరలోనే ఫలించనున్నాయి. ఈనెల 29న ఉగాది పండుగ రోజున రాష్ట్ర మంత్రి విస్తరణ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విస్తరణ ముహూర్తాన్ని టీడీపీలోని క్రియాశీలక నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇపుడున్న ఇద్దరు మంత్రులను కొనసాగిస్తారా..?...లేదా..? కొత్తగా ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందన్న చర్చ ఇపుడు టీడీపీతో పాటు ఇతర పార్టీలోనూ జోరుగా సాగుతోంది.
పార్టీ పరిస్థితిపై కలవరం
రాష్ట్రంలోని 13 జిల్లాలలో అనంతపురాన్ని టీడీపీకి కంచుకోటగా ఇన్నాళ్లూ చంద్రబాబు భావించేవారు! కానీ ఇటీవల ఆయన స్వయంగా చేయించిన సర్వేలో అన్ని జిల్లాలలో కంటే ‘అనంత’లోనే పార్టీ పతనావస్థకు చేరిందని తేలింది. ఏకంగా 92 శాతం పార్టీకి నష్టం జిరిగినట్లు సర్వేరిపోర్ట్‌ వచ్చిందని ఫిబ్రవరిలో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ‘అనంత’నేతలతో స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎమ్మెలతో పాటు మంత్రులపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేకంగా ఇద్దరు మంత్రులకు ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకున్నట్లు తెలిసింది. ‘పార్టీవల్ల మీరు లబ్ధి పొందడం మినహా..మీ వల్ల పార్టీకి దమ్మిడీ ఉపయోగం లేదు. కేబినెట్‌ విస్తరణలో మీ సంగతి చూస్తా! సిద్ధంగా ఉండండి!’ అని బాహాటంగానే హెచ్చరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరిని తొలగిస్తారు? ఇద్దరినీ తొలగిస్తారా? అనే సందిగ్ధం పార్టీ నేతల్లో నెలకొంది.
ఇద్దరిపైనా అసంతృప్తి!
 ప్రస్తుతం కేబినెట్‌లో అత్యంత బలహీనంగా ఉన్న మంత్రుల్లో పల్లె, సునీత ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీశాఖ మంత్రిగా పల్లె ఘోరంగా విఫలమయ్యారనే భావనలో సీఎం ఉన్నట్లు తెలిసింది. చివరకు సమాచారశాఖలో డీపీఆర్‌ఓలు కూడా మంత్రిమాటను ఖాతరు చేసే పరిస్థితి లేదు. తనకు అప్పగించినశాఖలను గాడిలో పెట్టడంలో విఫలం కావడం, స్వయంగా తాను ఆర్థికంగా ఎదగాలనే స్పృహ మినహా మంత్రిపదవిలో తనదైన ప్రత్యేకమై ముద్ర వేయడం ‘పల్లె’ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇతనిపై వేటు వేసేందుకు బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే మంత్రి పరిటాల సునీతపై కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఆమె కేవలం ఐదో తరగతి చదవడం, కనీసం జీఓలు కూడా చదవలేకపోవడం, మంత్రిగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో మాట్లాడే స్థాయిలో విషయం లేకపోవడాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జిల్లాలో పార్టీ ఉన్నతికి మూడేళ్లలో సునీత చేసిన కృషి ఏమీలేదనేది చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే పరిటాల ప్రభావం జిల్లాలో పూర్తిగా తగ్గిందనే భావనకు చంద్రబాబు వచ్చారు. కేవలం రాప్తాడు మినహా పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో పూర్తిగా పట్టుకోల్పోయారని భావిస్తున్న బాబు.. ఆమె కొనసాగింపుపై కూడా  ఆలోచనలో పడ్డారు. వీరిద్దరి వద్ద ‘సబ్జెక్ట్‌’ లేకపోవడంతో జిల్లాలోని సమీక్ష సమావేశాల్లో అధికారుల ముందు తేలిపోతున్నారు. ఇప్పటికే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో ఇలాంటి మంత్రులతో ఎన్నికలకు వెళితే ఫలితాలు దారుణంగా ఉంటాయనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. 
 
ఆ ముగ్గురిలో చోటెవ్వరికో
మంత్రివర్గ విస్తరణపై చీఫ్‌ విప్‌ కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌లు భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. జిల్లాలో బీసీల ప్రాబల్యం అధికమని, బీసీ మంత్రి లేకపోవడం కూడా పార్టీ పతనానికి కారణమని జిల్లా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రిపదవిపై బీకే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే చీఫ్‌విప్‌ కాలవ శ్రీనివాసులు ఇటీవల సీఎంను కలిసినప్పుడు విస్తరణపై చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కేబినెట్‌లో తనకు చోటు కల్పించాలని కాలవ  కోరినట్లు తెలిసింది. దీంతో బీకే పార్థసారథి, కాలవ శ్రీనివాసులల్లో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉంది. పల్లెను తప్పిస్తే ఆ స్థానంలో ఈ ఇద్దరిలో ఒకరికి చోటు ఇవ్వవచ్చు. ఇక రెండోబెర్త్‌ కోసం పరిటాల, పయ్యావుల పోటీ పడుతున్నారు. నారా లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి బెర్త్‌ దొరకదు. మూడేళ్లు సునీత పదవిలో ఉన్నారు కాబట్టి, కేశవ్‌కు రెండేళ్లు అవకాశం ఇచ్చేందుకు తప్పుకోవాలని చంద్రబాబు సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు చురుకైన నేత లేకపోవడంతో కేశవ్‌ను తీసుకోవాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సునీతను తొలగించి కేశవ్‌కు మంత్రి పదవి ఇస్తారా? అనేది సందేహమే! పోనీ సునీతను కొనసాగిస్తూ, కేశవ్‌కు చోటు కల్పిస్తే ఒకే సామాజికవర్గానికి రెండు మంత్రిపదవులు కట్టబెట్టినట్లవుతుంది. దీంతో రెండోస్థానంపైనే చంద్రబాబు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆశావహుల్లోని ముగ్గురిలో ఒకరికి మాత్రమే బెర్త్‌ దక్కుతుందా? ఇద్దరిని మంత్రి పదవి వరిస్తుందా? అనేది చూడాలి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement