Kommineni Srinivasa Rao Appointed As AP Press Academy Chairman, Details Inside - Sakshi
Sakshi News home page

ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు

Published Thu, Nov 3 2022 3:45 PM | Last Updated on Thu, Nov 3 2022 5:46 PM

kommineni Srinivasa Rao Appointed As AP Press Academy Chairman - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్‌ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. 

జర్నలిజంలో దిట్ట కొమ్మినేని
కృష్ణా జిల్లా గన్నవరంలో పుట్టి పెరిగిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978లో జర్నలిజంలో ప్రవేశించారు. పాత్రికేయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు వివిధ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 1978లో ఈనాడు పత్రికలో చేరిన కొమ్మినేని శ్రీనివాసరావు.. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌, న్యూఢిల్లీలో రిపోర్టింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. 2002 ఆగస్టు నుంచి ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్‌గా పని చేశారు. 2007 జనవరి నుంచి NTVలో చీఫ్‌ ఎడిటర్‌గా, 2007 సెప్టెంబర్‌ నుంచి TV5లో ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత కొన్నాళ్లుగా సాక్షి టీవీలో కేఎస్‌ఆర్‌ లైవ్‌ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

రచనలో మేటి
రాష్ట్రంలో రాజకీయం పేరిట కొన్నాళ్లు పొలిటికల్‌ కాలమ్‌ రాసిన కొమ్మినేని శ్రీనివాసరావు.. నిఖార్సయిన ఆర్టికల్స్‌ రాయడంలో దిట్ట. తాజాకలం పేరుతో చాలా కాలం పాటు రాజకీయ వ్యాసాలు రాశారు. 

పాత్రికేయ పర్యటనలు
పాత్రికేయుడిగా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న కొమ్మినేని శ్రీనివాసరావు.. ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ఉన్నప్పుడు ఆయన వెంట నెదర్లాండ్స్‌ వెళ్లి వచ్చారు. అలాగే అమెరికా, బ్రిటన్‌, చైనా, సింగపూర్‌ తదితర దేశాల్లో వేర్వేరు సందర్భాల్లో పర్యటించారు. విదేశీ పర్యటనలకు సంబంధించి ఆంధ్రా టు అమెరికా పుస్తకాన్ని రూపొందించారు.

పరిశోధనే జీవితం
తెలుగు రాజకీయాలపై కొమ్మినేని శ్రీనివాసరావు విస్తృతమైన పరిశోధన చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్‌పై కొమ్మినేని శ్రీనివాసరావు "ప్రాంతీయ ఉద్యమాలు-పదవీ రాజకీయాలు" పుస్తకాన్ని రాశారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత "తెలంగాణ ఆవిర్భావం- పాత్రధారులు, సూత్రధారులు" పుస్తకాన్ని రచించారు. 

కొమ్మినేని కలం
"ప్రజా తీర్పు" పేరిట ఆయన రచించిన పుస్తకాలు ఎన్నో కీలకమైన అంశాలను తెరమీదికి తెచ్చాయి. విభజన అనంతరం "ఆంధ్రప్రదేశ్‌ ప్రజాతీర్పు", "తెలంగాణ ప్రజాతీర్పు" పేరుతో మరింత సమాచారాన్ని జోడించారు. 2002 నుంచి ప్రతీ ఎన్నికల తర్వాత వివిధ అంశాలతో పుస్తకాన్ని తెస్తున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. అలాగే 2019 ఎన్నికల తర్వాత "శాసన సభ్యులు - సామాజిక విశ్లేషణ" పుస్తకాన్ని రచించారు. తెలుగు రాజకీయాలపై కొమ్మినేనికి ఉన్నంత సాధికారిక పట్టు అద్భుతమైనది. నాలుగు దశాబ్దాల రాజకీయ నాయకులందరూ గుర్తు పట్టగలిగి పలకరించే అతికొద్ది మంది జర్నలిస్టుల్లో కొమ్మినేని ఒకరు.

 స్ట్రెయిట్ ఫార్వర్డ్
ముక్కుసూటిగా వ్యవహరించడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, నిజాయతీగా వ్యవహరించడం కొమ్మినేని శ్రీనివాసరావు అనుసరించిన విధానం. నిబద్దత గల పాత్రికేయుడిగా ఎన్నో గుర్తింపులు పొందిన కొమ్మినేని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ ఆకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement