‘మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ సీఎం’ అంటూ కేరింతలు.. | Successfully CM YS Jagan Srikakulam District Tour | Sakshi
Sakshi News home page

వచ్చాడయ్యో సామీ..

Published Sat, Sep 7 2019 9:18 AM | Last Updated on Sat, Sep 7 2019 12:34 PM

Successfully CM YS Jagan Srikakulam District Tour - Sakshi

తనకు అలవాటైన రీతిలో టిక్‌ టిక్‌మంటూ మైకును తట్టారు.. అన్నా బాగున్నారా.. అంటూ నవ్వుతూ ప్రసంగం ప్రారంభించారు.. ప్రతి అక్కనూ ప్రతి చెల్లినీ.. ప్రతి అవ్వనూ తాతనూ పేరు పేరునా పలకరించారు.. ముఖ్యమంత్రిలా కాదు ఓ ఆత్మబంధువులా అనిపించారు.. అందుకే జగన్మోహనుడిని చూసి సిక్కోలు ప్రజలు పులకించిపోయారు. సీఎం హోదాలో తొలిసారి అడుగుపెట్టిన రాజన్న బిడ్డకు జేజేలు పలికారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులైతే ‘మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌’ అంటూ కేరింతలు కొట్టారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేసిన తొలి పర్యటన విజయవంతమైంది. 100 రోజుల పాలన గొప్పతనం చాటి చెప్పింది. అనవసర రాజకీయాలకు పోకుండా... ప్రజలు విసుక్కోకుండా... అధికారులు ఇబ్బందులు పడకుండా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చెప్పాలంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం యావత్తు సూటిగా...సుత్తి లేకుండా సాగింది. పాదయాత్రలోనూ... ఎన్నికల్లోనూ... ఏ హామీలిచ్చారు... అధికారంలోకి వచ్చాక అమలు చేసినవేంటి?... భవిష్యత్‌లో ఏం చేయబోతున్నారు... సవివరంగా, ప్రణాళిక ప్రకారంగా వివరించారు. దీంతో తమకు కలిగే ప్రయోజనం, మేళ్లేమిటో కళ్లకు కట్టినట్టు ప్రజలకు స్పష్టమైంది.

వరాల జల్లు..
ఒకపక్క వరుణ దేవుడు చిరు జల్లులు కురిపిస్తుండగా పలాస సభలో ముఖ్యమంత్రి వరాల మూట విప్పారు. ఎన్నో ఏళ్లుగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కలిగించారు. 3, 4 దశల్లో ఉన్న రోగులకు ఇక నుంచి రూ.5 వేలు పింఛన్‌ ఇవ్వనున్నట్లు కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.
-ప్రతి 500 మంది కిడ్నీ రోగులకు ఓ హెల్త్‌ అసిస్టెంట్‌ను నియమిస్తామని, వారు రోగుల బాగోగులు చూస్తారని చెప్పారు. 
-కిడ్నీ రోగులకు నాణ్యమైన మందులతోపాటు వారికి, వారి ఎటెండెంట్‌కు ఉచిత బస్‌ పాస్‌ అందిస్తామని ప్రకటించారు.
-ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియాలు, బుడగ జంగాల సమస్యలను పరిగణనలోకి తీసుకుని జేసీ శర్మ నేతృత్వంలో వన్‌మేన్‌ కమిషన్‌ వేశామని చెప్పారు. 
-వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణంతోపాటు ఆ పనులను యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  
  
పర్యటన సాగిందిలా..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 11.16 నిమిషాలకు హెలికాప్టర్‌లో పలాసకు చేరుకున్నారు. అక్కడి నుంచి దారి పొడవునా బారులు తీరిన జనాల నడుమ సభా ప్రాంగణానికి ఉదయం 11.40 నిమిషాలకు చేరుకున్నారు. 11.42 నిమిషాలకు 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, రూ.600 కోట్ల మంచినీటి పథకం, రూ.11.95 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 12.12 గంటలకు ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగం అనంతరం నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిత్లీ బాధితులకు పెంచిన పరిహారాన్ని అందజేశారు. 12.58 గంటలకు పలాస సభ ముగిసింది. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఎచ్చెర్లకు చేరుకున్నారు. రూ.30 కోట్లతో నిర్మించిన ట్రిపుల్‌ ఐటీ అకడమిక్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి భేటీ అయ్యారు. అనంతరం శ్రీకాకుళం మండలం సింగుపురం సమీపంలో నిర్మించిన అక్షయపాత్ర సంస్థ హైటెక్‌ కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు. తర్వాత రోడ్డు మార్గం గుండా ఎచ్చెర్లకు వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో విశాఖపట్నానికి బయలుదేరారు. ఇలా ఒక్కరోజులోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చకచకా కార్యక్రమాలను పూర్తి చేశారు.

ఆద్యంతం ఆసక్తికరం..
గత ఐదేళ్లలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. భారీ జన సమీకరణ ద్వారా సభలను అట్టహాసం చేశారు. సరిగ్గా చంద్రబాబు ప్రసంగించేసరికి జనాలు వెనుతిరిగిపోయేవారు. దానికి గంటల తరబడి విసిగించే ప్రసంగాలే కారణం. ఎంతసేపూ భజనకు ప్రాధాన్యమిస్తూ... ప్రతిపక్షాన్ని తిట్టిపోస్తూ చేసే ప్రసంగాలను వినలేక జనాలు మధ్యలోనే వెళ్లిపోయేవారు. వారిని నిలువరించడం ఒక ప్రహసనంగా మారేది. చంద్రబాబు సభ నిర్వహించాలంటే అధికారులు భయపడే పరిస్థితి ఉండేది. ప్రజలను తీసుకురావడం, తీసుకొచ్చాక వేచి ఉంచడం తలకుమించిన భారంగా ఉండేది. కానీ శుక్రవారం పలాసలో జరిగిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభ గాని, ఎచ్చెర్లలో  ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖి గాని అందుకు భిన్నంగా సాగింది. నాటి చంద్రబాబు సభలకు, నేడు జరిగిన వైఎస్‌ జగన్‌ కార్యక్రమాలకు మధ్య తేడా స్పష్టమైంది.

పలాసలో జరిగిన సభలో అప్పుడే అయిపోయిందా.. అనిపించే రీతిలో ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సైతం ఆరాధనాపూర్వకంగా ముఖ్యమంత్రితో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ ఆశయాలను మరోసారి ప్రశ్నలడిగి మరీ ఆలకించారు. వైఎస్సార్‌ హయాంలో ప్రారంభమైన ట్రిపుల్‌ ఐటీలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఎలా తీర్చిదిద్దుతున్నాయో వివరించారు. టీవీల్లో సీఎం కార్యక్రమాన్ని చూస్తున్న వారు కూడా అతుక్కుపోయారంటే... ఎంత మంచి వాతావరణంలో ముఖాముఖి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ప్రస్తావన లేకుండా, అనవసరమైన ఆరోపణలు చేయకుండా ప్రతిపక్షం ఊసెత్తకుండా.. తానేం చేశాను... ఏం చేస్తున్నాను... ఏం చేయబోతున్నానో చెప్పి అటు పలాస ప్రజలను, ఇటు ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఏ ఒక్కరూ విసుగెత్తకుండా... సూటిగా... సుత్తి లేకుండా ప్రసంగించారు. దీంతో కార్యక్రమం చివరి వరకు ప్రజలు వేచి ఉన్నారు. 

బిజీ షెడ్యూల్‌లో కూడా వినతుల స్వీకరణ.. 
పర్యటన మొత్తం బిజీబిజీగానే సాగింది. కానీ తన కోసం వేచి ఉన్న అర్జీదారులు నిరుత్సాహం చెందకుండా ప్రతి ఒక్కరి నుం చి వినతులు స్వీకరించారు. తీసుకోవడమే కాకుండా వాటిని చదివి ఏం చేయాలన్న దానిపై ఆలోచన కూడా చేశారు. అటు పలాస, ఇటు ఎచ్చెర్లలో ప్రజలు నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. వాటికి సంబంధించి అక్కడికక్కడే సంబంధిత అధికార వర్గాలకు ఆదేశాలు ఇచ్చారు.     
  
మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ సీఎం..
విద్యార్థులతో మాటామంతి కార్యక్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్‌మోన్‌రెడ్డి ఉత్సాహంగా సమాధానం చెబుతుంటే విద్యార్థులు కేరింతలు కొట్టారు. ‘మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ సీఎం జగన్‌’ అంటూ కేకలు వేశారు. ‘నాన్న స్థాపించిన ట్రీపుల్‌ ఐటీలను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని, ఐటీ దిగ్గజ కంపెనీలు ఆంధ్రదేశం వైపు చూసేలా చేస్తాన’ని సీఎం చెప్పగానే విద్యార్థులు కరతాళధ్వనులతో హోరెత్తించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement