బోగస్ రోల్‌పై కలెక్టర్ ఆగ్రహం
చీరాల: కలెక్టర్ సుజాత శర్మ బుధవారం పట్టణంలో పలు ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీన్‌పార్క్ పనుల పరిశీలనకు చీరాల వచ్చిన ఆమె స్థానిక ఏఆర్‌ఎం ైెహ స్కూల్‌ను తనిఖీ చేశారు. హాజరు పట్టికలో విద్యార్థుల హాజరు అధికంగా నమోదై ఉండగా..క్లాసు రూంలో మాత్రం విద్యార్థులు లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరులో 50 శాతం వ్యత్యాసం ఉండటంతో తీరు మార్చుకోవాలని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అలానే కస్తూరిబా మున్సిపల్ బాలికల పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం సుద్దగా ఉండటంతో కుకింగ్ ఏజెన్సీని ప్రశ్నించారు. బియ్యం మంచిగా లేకపోవడం వలన అన్నం సుద్ద అవుతుందన్నారు. కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
పారిశుధ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...
చీరాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ పారిశుధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా పట్టణంలో పారిశుధ్య పనులు ఏవిధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం క్షీణించకుండా అన్ని చర్యలు తీసుకోవాలి సూచించారు. అవసరమైతే కొత్త సిబ్బందిని నియమించుకోవాలన్నారు. డ్రైవర్ల అవసరముంటే ఆర్టీసీ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంటే ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డీఈవో రామలింగేశ్వరరావు, మున్సిపల్ డీఈ మాల్యాద్రి, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంఈవో విశాలాక్షి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.