అటకెక్కిన అదనపు చక్కెర | sugar | Sakshi
Sakshi News home page

అటకెక్కిన అదనపు చక్కెర

Published Sat, Jul 4 2015 1:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

sugar

తెనాలి : రంజాన్ పర్వదినం కానుకగా రాష్ట్రంలోని తెల్ల రేషను కార్డుదారులందరికీ ఈ నెలలో అరకిలో చొప్పున అదనంగా చక్కెర పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు తూచ్ అంటోంది. ఈ ప్రకారం రేషను డీలర్లకు పౌరసరఫరాలశాఖ సంక్షిప్త సందేశాలను పంపింది. దీనితో ఈనెలలో మరో అరకిలో చక్కెర అదనంగా వస్తుందని భావించిన సాధారణ కార్డుదారులకు నోరు చేదయినట్టే!
 
 భిన్న ప్రకటనలు..
 సాధారణ కోటా కింద అరకిలో, రంజాన్ సందర్భంగా మరో అరకిలో కలిపి మొత్తం ఒక్కో కార్డుకు కిలో చొప్పున చక్కెర ఇవ్వనున్నట్టు పౌరసరఫరాలశాఖ డెరైక్టర్ జి.రవిబాబు గత నెల 24న ప్రకటించారు. ఈ చక్కెరను డీలర్లు విధిగా అందరూ కార్డుదారులకు జూలైలో ఇవ్వాలని, ఇతర పథకాలకు మళ్లించరాదని ఆయన స్పష్టంచేశారు. దీనితో బియ్యంతోపాటు అదనపు చక్కెరకు రేషను డీలర్లు డీడీలు తీయాలని అధికారులు హడావుడి మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గత నెల 27న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ముస్లిం కార్డుదారులకు రంజాన్ కానుకను ప్రకటించారు.
 
 అందుకనుగుణంగా పౌరసరఫరాల శాఖ ‘చంద్రన్న రంజాన్ తోఫా’ పేరుతో చౌకదుకాణాల ద్వారా ఒక్కో ముస్లిం కార్డుదారుకు అయిదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, ఒక కిలో సేమియా, వంద గ్రాముల నెయ్యి సహా ఉచితంగా అందించేందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పటికే కార్డుపై ఒక కిలో గోధుమపిండిని ఇస్తున్నచోట ఈ కానుక కింద మరో నాలుగు కిలోలు ఇస్తారని చెప్పినా, గోధుమపిండిని జిల్లాలో ఎక్కడా చౌకదుకాణాల్లో ఇవ్వటం లేదు. మొత్తం అయిదు కిలోలు ఇప్పుడు ఇవ్వాల్సివుంటుంది. నెలనెలా ఇస్తున్న అర కిలో చక్కెర కు మరో కిలోన్నర అదనంగా కలిపి మొత్తం రెండు కిలోలు ఇస్తారు. రాష్ట్రంలో 10-12 లక్షల ముస్లిం కార్డుదారులకు ఈ కానుక అందించనున్నారు.
 
 ఈ నేపథ్యంలో సాధారణ తెల్లరేషను కార్డుదారులకు అదనంగా ఇస్తామన్న అరకిలో చక్కెర హామీ అటకెక్కించారు. సాధారణ కోటా కింద నెలనెలా అందిస్తున్నట్టే జూలై నెలకూ అరకిలో చొప్పున ఇవ్వాలని, అదనపు కోటా లేదని పౌరసరఫరాల అధికారులు చౌకడిపోల డీలర్లకు సంక్షిప్త సందేశాలు పంపారు. దీనితో ఈసారి ఇతర అదనపు చక్కెరకు కార్డుదారులు ఆశను వదిలేసుకున్నారు. ఉన్నతస్థాయిలో సమన్వయం లేనందునే కొన్ని కీలకమైన నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయనీ, ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో గందరగోళానికి దారితీస్తోందనే అభిప్రాయానికి అదనపు చక్కెర వ్యవహారం బలం చేకూరుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement