షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
► అఖిలపక్ష రైతు సంఘాల నాయకుల డిమాండ్
► నంద్యాల-నూనెపల్లి ప్రధాన రోడ్డులో చైర్మన్ దిష్టిబొమ్మ దహనం
నంద్యాల రూరల్: బకాయిలు చెల్లించకుండా రైతులను బెదిరించిన షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్‌గుప్తను వెంటనే అరెస్ట్ చేయాలని అఖిల పక్ష రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు ఆవరణలో భారతీయ కిసాన్‌సంఘ్ ఆధ్వర్యంలో చెరుకు రైతుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అతిథిగా జాతీయ రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాలు, షేరుధనం పోగొట్టుకొని చెరుకు ఫ్యాక్టరీ నిర్మిస్తే ప్రభుత్వం కారుచౌకగా ప్రైవేటు యాజమాన్యానికి విక్రయించడం బాధాకరమన్నారు.
ప్రభుత్వంతో షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కుమ్మక్కై నంద్యాల చెరుకు రైతులను చంపుతానని బెదిరించారని, జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే జోక్యం చేసుకుని అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భారతీయకిసాన్‌సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు వంగాల సిద్ధారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు, చెరుకు రైతులు షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్‌గుప్త దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకొనివచ్చి నంద్యాల-నూనెపల్లె ప్రధాన రహదారిపై దహనం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ సిద్ధం శివరాం, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్రబోలు ఉమామహేశ్వరరెడ్డి, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ, టీడీపీ జిల్లా నాయకుడు జిల్లెల్ల శ్రీరాములు, బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి మేడా మురళీ, షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ఐక్య కన్వీనర్ నాగేశ్వరరావు, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మహేశ్వరరెడ్డి, బంగారురెడ్డి పాల్గొన్నారు.