బియ్యానికి ఎసరు..!
► ఇప్పటికే చక్కెర, కిరోసిన్‌కు మంగళం
► త్వరలో అమలుకు ప్రభుత్వం కసరత్తు
► ఏడు లక్షల మంది పేదలపై ప్రభావం
రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా అందించే సరుకుల సంఖ్యను పెంచే సంగతి పక్కన పెట్టి ఉన్న సరుకులకు మంగళం పాడుతూ వస్తోంది. పేద ప్రజల సంక్షేమం మరిచి ఏకపక్ష నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కేంద్రం సబ్సిడీలకు కోత పెట్టిందని సాకు చూపుతూ జూన్ నుంచి చక్కెర, కిరోసిన్‌కు మంగళం పాడింది. త్వరలోనే బియ్యానికి కూడా ఎసరు పెట్టేందుకు టీడీపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. దీనిస్థానంలో నేరుగా సబ్సిడీని లబ్ధిదారులకు అందించాలనే ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. ఇది సుమారు ఏడులక్షల మంది పేదలపై ప్రభావం చూపనుంది.
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం...సరుకుల సంఖ్యను పెంచుతామంటూ ప్రగల్బాలు పలికింది.అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కుతోంది. అంతకుముందు కాంగ్రెస్‌లోని కిరణ్ సర్కార్ అమ్మ హస్తం పేరుతో ఎనిమిది సరుకులను అందించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పామోలిన్‌కు కేంద్ర సబ్సిడీ లేదని చెప్పి మొదట్లోనే సరఫరాను నిలిపి వేసింది. తర్వాత మూడు,నాలుగు వస్తువులను ఇస్తూ కాలం గడుపుతోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం చక్కెర, కిరోసిన్‌కు సంబంధించి సబ్సిడీని ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని భరించి చక్కెర, కిరోసిన్ అందిస్తుందని ప్రజలు భావించినా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో జూన్ నెల నుంచి చక్కెర, కిరోసిన్ సరుకులను నిలిపి వేశారు. పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యానికి కూడా త్వరలో మంగళం పాడనున్నారు. ఒక్కో వ్యక్తికి నెల కు ఐదు కిలోల చొప్పున అందించే బియ్యానికి సంబంధించి నగదు రూపంలో లబ్ధి దారుని అకౌంట్లలో వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఐదు కేజీలకు రూ. 5తో పాటు కేంద్రం అందించే సబ్సిడీ రూ.45 కలుపుకొని రూ. 50 వేస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నత స్థాయిలో జరుగుతోంది.
డీలర్లకు దెబ్బ: జిల్లాలో పేదలకు అందించే రేషన్‌డీలర్లకు దెబ్ద తగలనుంది. ఇప్పటికే పలుమార్లు సరుకులపై ఇచ్చే కమీషన్ చాలడం లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలర్ల సంఘం ప్రతినిధులు చంద్రబాబును కలిసి మొర పెట్టుకున్నారు. సరుకులు తగ్గిస్తుండడంతో వాటిపై వచ్చే కమీషన్ కూడా రాకుండా పోతోంది. ఇప్పటికే చక్కెర, పామోలిన్, కిరోసిన్ నిలిపేశారు. బియ్యం కూడా ఆపేస్తే నష్టపోవాల్సి వస్తోందని డీలర్లు వాపోతున్నారు.
జిల్లాకు సంబం«ధించి సమాచారం
జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య – 7 లక్షలకు పైగానే
జిల్లాలో చౌక దుకాణాల సంఖ్య – 1,738
అంత్యోదయ అన్న యోజన కార్డులు – 5,7000