104 శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు మందులు ఇస్తున్న వైద్యులు
మధుమేహం.. వ్యథాభరితంగా మారింది.. చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలకు ముప్పు తెస్తోంది.మారుతున్న జీవన సరళి, ఆధునికపోకడలు, ఆరోగ్య క్రమశిక్షణ మీరడం,ఆహారపు అలవాట్లు వ్యాధి విస్తరణకుకారణమవుతున్నాయి. ప్రధానంగా 35నుంచి 45 ఏళ్ల వయసు వారు చక్కెర రోగం బారినపడటం ఆందోళన కలిగి స్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో సుగర్ బాధితులు ఎక్కువగా ఉండగా జిల్లాలోనూ అదేస్థాయిలో ప్రభావం చూపుతోంది. జిల్లాలో ప్రతినెలా సుమారు 6 వేల కొత్త మధుమేహ కేసులు నమోదు కావడంపరిస్థితికి అద్దంపడుతోంది.
పశ్చిమగోదావరి, నిడమర్రు: మధుమేహం కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలతో దేశంలోని ప్రతి నిమిషానికి ఇద్దరు మరణిస్తున్నట్టు గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతి 20 మరణాల్లో ఒకటి మధుమేహ సంబంధిత వ్యాధుల కారణమని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని నివారించడం సులభం కాదని, విధి విధానాలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా సమర్థంగా ఎదుర్కొనవచ్చని వ్యాధి నిపుణులు చెబుతున్నారు.
జిల్లాలో సుమారు 6 లక్షల మందికి..
మధుమేహాన్ని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. జిల్లాలో 39 లక్షల మంది జనాభా ఉంటే 25 ఏళ్లు పైబడిన వారు 27 లక్షల మంది వరకూ ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ గణాంకాలు పరిశీలిస్తే జిల్లాలో సుమారు 6 లక్షల మంది సుగర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రతి ఏడుగురిలో ఒకరికి చక్కెర వ్యాధి ఉందన్నమాట. దాదాపు 80 శాతం కుటుంబాల్లో దీనిబారిన పడిన వారు ఒక్కరైనా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఉచితంగా మందులు
ప్రభుత్వపరంగా పరిశీలిస్తే జిల్లాలో మధుమేహం వివిధ దశలో ఉన్న 1,24,665 మంది రోగులకు ప్రభుత్వాస్పత్రుల ద్వారా ప్రతి నెలా ఉచితంగా మందులు అందిస్తున్నట్టు ఎన్‌సీడీ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. 104 వాహనం ద్వారా 14,402 మందికి ప్రతినెలా సుగర్ మందులు అందిస్తున్నట్టు 104 సీసీ ఎంవీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లాలోని 555 ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా 25 శాతం ఆస్పత్రుల్లో సుగర్ వ్యాధి నిపుణులు ఉన్నారు.
ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్లే..
శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన రుగ్మత, అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువ వేయడం (పాలీడిప్పియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్దకం మధుమేహం ముఖ్య లక్షణాలు. రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని బట్టి వ్యాధినినిర్ధారిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డయాబెటిస్‌ను మూడు రకాలుగా గుర్తించింది.
ప్రసవం తర్వాత తగ్గిపోతుంది
డయాబెటిస్‌లో మూడో రకమైన జెస్టేషనల్ డయాబెటిస్ సాధారణంగా మహిళకు ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. మొదటి, రెండో రకాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పు కూడా బాగుంటే ఇన్సులిన్ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం తప్పనిసరి. ఆహార అలవాట్లలో మార్పు, యాంటీ డయాబెటిక్ మందులు వాడకం వల్ల, అవసరమైతే ఇన్సులిన్ వాడకం వల్ల రెండో రకం మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment