నాన్నా.. అమ్మని నిద్ర లేపు
Published Thu, Mar 16 2017 9:04 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
ఆర్థిక ఇబ్బందులు.. అప్పుల బాధ.. ఓ కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేశాయి. తల్లి, కుమార్తె మృతిచెందగా, తండ్రి మృత్యువుతో పోరాడుతున్నాడు.. జరుగుతున్నదేమిటో అర్థంగాని వారి కుమారుడు అమ్మను కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు.
► అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
► తల్లీ, కుమార్తె మృతి
► తండ్రికి వెంటిలేటర్‌పై చికిత్స
► ఒంటరిగా మిగిలిన చిన్నారి వర్ధన్
పట్నంబజారు(గుంటూరు): జాగ్రత్తగా ఉండాలి...బాగా చదువుకోవాలి నాన్నా..ఎప్పుడు ఏడవకూడదు...టిఫిన్ తిని నిద్రపో కన్నా...ఆఖరిగా ఆ కన్నతల్లి చెప్పిన మాటలివి...ఉదయాన్నే ఊరికి వెళ్దామని..అమ్మ చెప్పిన మాటలు...ఇంకా ఆ పసిమనసులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.. ఉదయాన్నే నిద్రలేచిన కుమారుడు..... అమ్మా... ఊరికి వెళ్దామన్నావు... త్వరగా నిద్రలేమ్మా..
నాన్నా..
నువై్వనా... అమ్మని.. అక్కని నిద్రలేపు.. అందుకే కదా...స్కూల్‌కు వెళ్లకుండా ఉన్నాను..అని చిన్నారి వర్ధన్ అమ్మ మృతదేహం వద్ద మాట్లాడిన మాటలివి. అంకుల్..నాన్న బాత్రూమ్‌లో కింద పడి కొట్టుకుంటున్నారు..అమ్మ..అక్కా..నిద్ర లేవటంలేదు...ఒక్కసారి మీరు రండి... అభంశుభం తెలియని వయస్సులో ఒక చిన్నారికి వచ్చిన కష్టం ఇదీ... తల్లి, అక్కా మరణించారన్న విషయం కూడా తెలియని వయస్సు...తండ్రి అపస్మారక స్థితిలో ఉన్నాడని గ్రహించలేని చిన్నారి..కానరాని లోకాలకు వెళ్లిన కన్నతల్లి..తోడబుట్టిన అక్కా ఇంకా నిద్రపోతున్నారనే అనుకుంటున్నాడు...
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు....
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మట్టుపల్లి మురళీమోహన్ కుటుంబం ఉంది. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలు భరించలేక మురళీమోహన్ భార్య హరిత (33) తనువు చాలించాలని భావించింది. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక కూల్‌డ్రింక్‌లో పురుగులు మందు కలిపి తన కుమార్తె వర్షిణి (13)కి తాగించి, హరిత కూడా తాగింది. రాత్రి అందరితో కలిసి భోజనం చేసి కుమారుడితో ముచ్చటించిన ఆమె తెల్లవారే సరికి కుమార్తెతో సహా మృత్యు ఒడిలోకి చేరింది. నెహ్రూనగర్‌లో నివాసం ఉండే మటుపల్లి మురళీమోహన్ క్లాత్ మార్కెట్‌లో వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో పూర్తిగా నష్టాలు రావటంతో...మురళీమోహన్ తల్లిదండ్రులు, బంధువులు ఒకసారి అప్పులు తీర్చారని చెబుతున్నారు. అయితే వ్యాపారాలు పూర్తిగా మం దగించటం.. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుం బంలో కల్లోల పరిస్థితులను తెచ్చాయి. ఒక్కసారిగా జరిగిన హఠాత్ పరిణామాన్ని చూసి తట్టుకోలేని..మురళీమోహన్ కుమారుడి ఎదుటే..బాత్రూమ్‌లోకి వెళ్లి పురుగుల మందు తాగడంతో పాటు, నరాలు తెగేలా..చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొన ఊపిరితో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన నగరవాసుల్లో విషాదం నింపింది.
స్పందించని 108...
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మురళీమోహన్ బాత్రూమ్‌లో కిందపడి కొట్టుకుంటున్న సమయంలో ఇంటి యజమానులు మూడు సార్లు 108కు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. అయితే ఎంతసేపటికి స్పందించలేదని యజమానులు చెబుతున్నారు. ఆఖరికి బంధువులు వచ్చిన తరువాత వారి వాహనాల్లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈస్ట్ డీఎస్పీ జేవీ సంతోష్, కొత్తపేట ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించటంతో పాటు, పురుగల మందు కలిపి ఉన్న కూల్‌డ్రింక్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అనాథగా మిగిలిన వర్ధన్...
నగరంలోని మాంటిస్సోరి పాఠశాలతో వర్షిణి 7వ తరగతి చదువుతుండగా..వర్ధన్ 2వ తరగతి చదువుతున్నాడు. ఊహించని పరిణామం..ఏ జరుగుతుందో తెలియక..పెద్ద ఎత్తున పోలీసు జీపులు..అంబులెన్స్ హడావుడితో . అమ్మా..నాన్నా..అక్కా ఏరంటూ..ఆ చిన్నారి అడుగుతున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. జరిగిన సంఘటన గురించి తెలియని వర్ధన్..బంధువులు ఎవరూ ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. నిత్యం అమ్మతోనే ఆటలాడుకునే వర్ధన్ అమ్మ దూరమటంతో అనాథలా మిగిలిపోయాడు.
Advertisement
Advertisement